iDreamPost
android-app
ios-app

Farmers, Cyclones – రైతులను వణికిస్తున్న తుఫానులు

  • Published Dec 08, 2021 | 6:04 AM Updated Updated Dec 08, 2021 | 6:04 AM
Farmers, Cyclones – రైతులను వణికిస్తున్న తుఫానులు

తుఫానులు అనేక దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌ రైతులను వణికిస్తున్నాయి. ఏటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ నెలల్లో కనీసం ఒక తుఫానైనా రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపడం సాధారణంగా మారింది. ప్రతి రెండు, మూడేళ్లకు ఒకసారి వీటిలో తీవ్ర తుఫానులు కూడా ఉంటున్నాయి. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం.. ఒడిశా తర్వాత తుఫాన్ల బారిన ఎక్కువగా పడుతున్న రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉంది. తుఫాన్లు ఏర్పడడానికి బంగాళాఖాతం అనువైన ప్రాంతంగా ఉండడమే ఇందుకు కారణమని ఐఎండీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తుఫానుల దెబ్బకు ఏటా కోస్తా జిల్లాలలో పంట నష్టం అనివార్యం అవుతోంది. చేతికి ఫలసాయం వస్తుందనుకొనే దశలో విరుచుకుపడే తుఫానుల వల్ల రూ.కోట్లలో పంట నీటిపాలవుతోంది. రైతులు ఆర్థిక నష్టంతో కుదేలవుతున్నారు.

తొమ్మిది కోస్తా జిల్లాల్లో ప్రభావం అధికం..

రాష్ట్రంలోని తొమ్మిది కోస్తా జిల్లాల్లో 974 కిలోమీటర్ల మేర 92,906 చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. తీర ప్రాంతంలోని 430 మండలాల్లో 190 మండలాలు తుఫాన్ల బారిన పడుతున్నాయి. ఇందులో 17 మండలాలు అతి తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. 31 మండలాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. సముద్ర తీరానికి 2 కిలోమీటర్లలోపు ఉన్న 692 తీర గ్రామాలు తుఫాన్ల బారిన పడుతున్నాయి. ఈ సమయంలో వచ్చే రాకాసి అలల వల్ల ఈ గ్రామాలు  తీవ్రంగా దెబ్బతింటున్నాయి. తొమ్మిది జిల్లాల్లోని మొత్తం జనాభాలో 11 శాతం మంది తుఫాన్ల ముప్పు పరిధిలో ఉన్నారు. ఇందులో 7 శాతం అర్బన్, 4 శాతం రూరల్‌ ప్రాంతాల ప్రజలు ఉన్నారని అంచనా.

Also Read : Korangi City – కడలి గర్భంలో కలిసిపోయిన కోరంగి నగరం గురించి తెలుసా..?

వాతావరణ శాఖ లెక్కలివీ..

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. 1977 నుంచి ఇప్పటివరకు ఏకంగా 66 తుఫాన్లు రాష్ట్రంపై విరుచుకుపడ్డాయి. వీటి వల్ల రూ.90 వేల కోట్లకుపైగా ఆర్థిక నష్టం జరిగింది. 1891 నుంచి 2019 వరకు 184 తుఫాన్లు ఏపీ తీరంలో తీరం దాటినట్టు ఐఎండీ (భారత వాతావరణ శాఖ) నివేదికలు చెబుతున్నాయి. తుఫాన్ల వల్ల ఎక్కువ ఆస్తి నష్టం 2014లో వచ్చిన హుద్‌హుద్‌ వల్ల జరిగింది. 180 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ఉత్తరాంధ్ర జిల్లాలను ముఖ్యంగా విశాఖ నగరాన్ని వణికించాయి. పెనుగాలులకు దాదాపు చెట్లన్నీ కూలిపోయాయి. భవనాలు, విద్యుత్‌ టవర్లు, స్తంభాలు, సెల్‌ టవర్లు కూలిపోయాయి. ఆ తుఫాను పెద్ద విలయం సృష్టించింది. రూ.21,908 కోట్ల నష్టం వాటిల్లింది.

1996లో వచ్చిన తుఫానుకు కోనసీమ భారీగా నష్టపోయింది. కోనసీమకు పెట్టని కోటగా ఉండే కొబ్బరిచెట్లు మొత్తం కూకటి వేళ్లతో సహా నేలకూలిపోయాయి. వేల ఎకరాల్లో లక్షల కొబ్బరి చెట్లు కూలిపోవడంతో రైతులు చాన్నాళ్లకు గాని కోలుకోలేకపోయారు. అతి భయంకరమైన తుఫాన్లలో 1977లో దివిసీమ ఉప్పెన నిలిచింది. ఈ ఉప్పెనలో అధికారిక లెక్కల ప్రకారమే పది వేల మంది మృతి చెందారు. మొత్తం 66 తుఫాన్ల వల్ల 77.78 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. 1976 నవంబర్‌లో మచిలీపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర తుఫానులో ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ 66 తుఫాన్ల వల్ల 16,450 మంది మృతి చెందగా 12.66 కోట్ల మంది ప్రభావితమయ్యారు. తుఫానుల వల్ల వచ్చిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. ఇక తుఫానుల ఉప్పెనలతో తీర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Also Read : Konaseema Cyclone – కోనసీమ విషాదానికి పాతికేళ్లు

పెరుగుతున్న తీవ్రత..

గ్లోబల్‌ వార్మింగ్‌, వాతావరణ మార్పుల వల్ల కొన్నేళ్లుగా తుఫానుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలు, ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. నష్టాన్ని తగ్గించడం, మరణాలు సంభవించకుండా చూడడం, ఆస్తి, మౌలిక వసతుల నష్టాన్ని సాధ్యమైనంత తక్కువ ఉండేలా చర్యలు తీసుకోవడం వంటి పనులు ప్రభుత్వాలు చేస్తున్నాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విపత్తు నిర్వహణ ప్రణాళికలు అధికారులు అమలు చేస్తున్నారు. తుఫాన్లకు ముందు, వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏ శాఖ ఎలా వ్యవహరించాలో చెప్పడంతోపాటు ఆ పనిని సరిగా చేస్తున్నాయో, లేదో పర్యవేక్షిస్తున్నారు.