నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. రైతులకు క్షమాపణలు చెప్పారు. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదింపచేశారు కూడా. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే లోపు.. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి మోడీ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే, వ్యవసాయ చట్టాలను రద్దు చేసేస్తే రైతు సంఘాలు శాంతిస్తాయని అందరూ అనుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మాత్రం వేరు.
రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించేంత వరకు తమ ఉద్యమం ఆగదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) కీలక నేత రాజేష్ తికాయత్ ప్రధాన మంత్రికి తేల్చి చెప్పేశారు. ఎందుకంటే పరిష్కరించాల్సిన రైతు సమస్యలు ఇంకా చాలానే ఉన్నాయనేది తికాయత్ వాదన. కనీస మద్దతు ధరకు చట్టం చేయాలని ఉద్యమ కాలంలో రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని విద్యుత్ సంస్కరణల బిల్లును ఉపసంహరించుకోవాలని రైతులపైకి వాహనాన్ని నడిపించి నలుగురు రైతుల మరణానికి కారకుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలనే డిమాండ్లు ఇంకా మిగిలే ఉన్నాయి.
నిజానికి రైతు సంఘాలు చేస్తున్న డిమాండ్లలో కొన్నింటిని పరిష్కరించటం ఇప్పటికిప్పుడు అయ్యేపని కాదు. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవటం కేంద్రం చేతిలో లేదు. కోర్టు ద్వారా మాత్రమే కేసుల ఉపసంహరణ సాధ్యమవుతుంది. ఇక విద్యుత్ సంస్కరణల బిల్లు కనీస మద్దతు ధరల చట్టం చేయటం కేంద్రం చేతిలోని పనే. కానీ రైతులు డిమాండ్ చేశారు కదాని అన్నీ చేసేస్తే మళ్ళీ మళ్ళీ ఏదో డిమాండ్లతో ఉద్యమం మొదలుపెట్టే అవకాశాలున్నాయి. అందుకనే మోడీ ప్రభుత్వం విషయాన్ని వీలైనంతగా లాగుతోంది. ఇదే సమయంలో పార్లమెంటులో ప్రతిపక్షాల ఎంపీలు దాదాపు ఇవే డిమాండ్లను లేవనెత్తుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రతిపక్షాల పోరుపడలేక 12 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేసినా ఎంపీలు గోల చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ మోడీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా ఉన్నాయి.
చట్టాలను రద్దు చేసిన మోడీ.. రైతు సంఘాల డిమాండ్లపై మాత్రం పెదవి విప్పడం లేదు. రైతు సంఘాలు మాత్రం అవన్నీ నెరవేర్చే వరకూ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నాయి. ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేశాయి. ఆ కమిటీతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, త్వరలోనే ఈ ఆందోళనలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో మోడీ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : Uttar Pradesh, Akhilesh Yadav – బీజేపీతో పోరాటానికి.. అఖిలేష్ ‘‘ఇంద్రధనస్సు’’