iDreamPost
android-app
ios-app

యూపీ బీజేపీకి శిరోభారం, రైతు ఉద్యమం రాజుకుంటుందనే ఆందోళన

  • Published Oct 06, 2021 | 1:19 AM Updated Updated Mar 11, 2022 | 10:39 PM
యూపీ బీజేపీకి శిరోభారం, రైతు ఉద్యమం రాజుకుంటుందనే ఆందోళన

ఉత్తర్రదేశ్ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. మరో ఆరేడు నెలల్లో ఎన్నికలు అనివార్యంగా ఉన్నాయి. ఈ సమయంలో ప్రజా వ్యతిరేకత నుంచి గట్టెక్కేందుకు యోగి ఆదిత్యానాద్ దాస్ ప్రభుత్వం అనేక కసరత్తులు చేస్తోంది. ఏదో రకంగా గట్టెక్కాలని ఆశిస్తోంది. విపక్షాల అనైక్యత తమకు కలిసి వస్తుందనే అంచనాతో ఉంది. అయితే ఠాకూర్ల పాలన పట్ల అసంతృప్తిగా ఉన్న బ్రాహ్మణుల నుంచి వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తున్నందున చల్లార్చాలని యత్నిస్తోంది. అందుకు అనుగుణంగానే గతంలో బ్రాహ్మణ వికాస పరిషత్ వంటివి స్థాపించిన మాజీ కాంగ్రెస్ నేత జితేంద్ర ప్రసాద్ ని క్యాబినెట్ లోకి కూడా తీసుకున్నారు. అందుకు తోడుగా అనేక ప్రయత్నాలతో ముమ్మరంగా ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో రైతు ఉద్యమం బీజేపీని కలచివేస్తోంది. అందులోనూ లఖింపూర్ ఘటన మరింత శిరోభారం అవుతుండడంతో సమస్యల్లో పడుతోంది.

వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం పైకి గంభీరంగా కనిపిస్తున్నా అవసరమైతే వాటిని తాత్కాలికంగా ఉపసంహరించుకునేందుకు సన్నద్ధమవుతోంది. తద్వారా రైతుల ఆగ్రహాన్ని చల్లార్చాలని చూస్తోంది. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికల ముంగిట ఈనిర్ణయం మేలు చేస్తుందనే ఆలోచన బీజేపీ పెద్దల్లో ఉంది. దానికి అనుగుణంగా చట్టాలను వెనక్కి తీసుకునే నిర్ణయం గురించి ఆలోచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఏడాది దాటినా రైతుల ఉద్యమం చల్లారకపోవడం, కొత్త ప్రాంతాలకు విస్తరించడంతో ఇది అనివార్యంగా భావిస్తోంది. అలాంటి సమయంలో లఖింపూర్ లో జరిగిన ఘటన బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. యోగీ ప్రభుత్వం మీద రైతు వ్యతిరేకత పెరిగేందుకు ఇది దోహదపడుతోంది.

ఇప్పటికే పశ్చిమ యూపీలో బీజేపీకి గడ్డు పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో జాట్లు, ముస్లీంల మధ్య రాజేసిన మంట మూలంగా బీజేపీ గట్టెక్కింది. కానీ ప్రస్తుతం రాకేష్ తికాయత్ వంటి వారు బీజేపీ ని ఓడించమే తమ లక్ష్యం అని ప్రకటించడం, మతాలకు అతీతంగా రైతులంతా ఆయన నాయకత్వంలో ర్యాలీ అవుతుండడంతో బీజేపీ బేజారెత్తిపోతోంది. యూపీలో అన్నదాతలతో పాటుగా చెరుకు రైతులు తీవ్రంగా సతమతమవుతున్నారు. సర్కారు వైఖరితో అసంతృప్తితో ఉన్నారు. ఈ తరుణంలో రైతు ఉద్యమం మరింత వేడిని రాజేసింది. లఖింపూర్ ఘటనలో రైతులను కేంద్ర మంత్రి కొడుకే చంపేయడం చిచ్చుని పెంచేసింది. ప్రతిపక్షాలకు పెద్ద అస్త్రంగా మారింది. ఇప్పటికే ప్రియాంక గాంధీ సహా వివిధ ప్రతిపక్షాలు దానిని ఆసరాగా చేసుకుని ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. రైతు వ్యతిరేకత మరింత పెంచేందుకు శ్రమిస్తున్నాయి.

యోగీ పాలనలో ఇప్పటికే కిందస్థాయిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణుల వ్యవహారాలు తలనొప్పిగా తయారయ్యాయి. ఎన్నికల ముంగిట వాటి నుంచి జనం దృష్టి మళ్లించే యత్నం చేస్తున్నా తాజా ఘటనతో మరోసారి తెరమీదకు వచ్చాయి. ఇది యోగీ కష్టాలను రెట్టింపు చేసినట్టయ్యింది. రాష్ట్రమంతా రైతాంగంలో పెరిగిన ఈ అసహనం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్న కమలదళంలో కలకలం రేపుతోంది. దానిని ఎలా అధిగమించాలనే అంశంపై తీవ్రంగా మధనపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో లఖింపూర్ ఘటన యూపీ ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశంగా మారడం ఆసక్తికరమే.