చంద్ర వెళ్లిపోయారు. ఇక్కడ గీయాల్సినవి అయిపోయాయి. వేరే లోకంలో బొమ్మలు గీసే పని మీద వెళ్లిపోయారు. ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు. బొమ్మలతో 40 ఏళ్ల స్నేహం. ఆయన గీతలు చూస్తూ పెరిగినవాన్ని. బొమ్మని చూసి కథలు చదివేవాన్ని. కథలు ఆయన బొమ్మలతో వస్తే రచయితలు గర్వగా చెప్పుకునే కాలం. నా కథ కూడా చంద్ర బొమ్మతో రావాలని ఆశపడ్డాను. కుదరలేదు. ఇక కుదరదు.
చంద్రని రెండుసార్లు చూసాను. 2000 సంవత్సరంలో పులికంటి కృష్ణారెడ్డి తిరుపతి భీమాస్ హోటల్‌లో ఆయన్ని సన్మానించారు. సభ ప్రారంభమైంది. కాసేపటికి చంద్ర బయటికొచ్చి స్నేహితులతో కబుర్లలో పడ్డాడు.
“కృష్ణారెడ్డి మీద ప్రేమతో వచ్చా కానీ, నాకెందుకబ్బా సన్మానాలు” అంటున్నాడు. ఈలోగా చంద్రని వెతుక్కుంటూ కృష్ణారెడ్డి వచ్చి “చంద్రా, సభ నీ కోసమే” అని యాష్టపోయాడు.
“సన్మానం నాకే కాబట్టి తప్పించుకోలేం” నవ్వుతో చంద్ర వెళ్లాడు.
ఇంకోసారి ప్రెస్‌క్లబ్‌లో. అప్పటికే ఆయన కొంచెం నలతగా వున్నాడు.
చంద్రలేడు, బొమ్మలు మాత్రం మాట్లాడుతూనే వుంటాయి.
తెల్లారి భయంగానే ఫేస్‌బుక్ , వాట్సప్ ఓపెన్ చేశాను. ఈ వార్త చూసి దిగులేసింది.
బాపు, మోహన్, కరుణాకర్, చంద్ర అందరూ వెళ్లిపోయారు. చేతి వేళ్లతో ప్రపంచాన్ని చూసిన వాళ్లు.
ఒక రకంగా అదృష్టవంతులు. స్వేచ్ఛగా గీసిన వాళ్లు. గీతల్లో నానార్థాలు వెతికేవాళ్లని చూడకుండానే , బాధపడకుండానే వెళ్లిపోయారు.
Also Read : వైఎస్ ప్రభంజనానికి ఎదురొడ్డి గెలిచిన చిట్టబ్బాయి ఇకలేరు
17541