Idream media
Idream media
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాపిస్తోంది. అది ఎంత ఉధృతంగా వ్యాపిస్తుందో.. సోషల్ మీడియాలో అసత్య, తప్పుడు వార్తల సమాచారం కూడా అంతే వేగంగా వ్యాపిస్తోంది. ఒకరిని చూసి మరొకరు వెనువెంటనే నిర్ధారణ లేకుండానే కరోనా వార్తలను, దాని బారిన పడి చనిపోయారంటూ అసత్య ప్రచారాలను చేస్తున్నారు. అదే దారిలో ఏకంగా ఓ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూడా వెళ్లారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కరోనాతో మృతి చెందారంటూ ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కరోనాతో కన్నుమూశారని శశిథరూర్ గురువారం తప్పుడు ట్వీట్ చేశారు. పలు మీడియా సంస్థలూ ఆమె చనిపోయారని వార్తలు రాశాయి. అయితే సుమిత్ర క్షేమంగానే ఉన్నారని బీజేపీ వర్గాలు స్పష్టం చేయడంతో థరూర్ ఆ ట్వీట్‌ను తొలగించారు. వార్తా సంస్థలూ ఆ న్యూస్‌ను తొలగించాయి.
తాను చేసిన ట్వీట్‌కు చిందిస్తూ సుమిత్రా మహాజన్ కుమారుడికి శశిథరూర్ క్షమాపణలు చెప్పారు. ఈ విషయాన్ని థరూర్ శుక్రవారం ట్విటర్ ద్వారా తెలిపారు. ‘‘ఈ రోజు సుమిత్రా మహాజన్ గారి కుమారుడితో మాట్లాడాను. నిన్న జరిగిన పొరపాటుకు క్షమించాలని కోరాను. ఆయన పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. సుమిత్ర గారు క్షేమంగానే ఉన్నారని తెలిసి ఎంతో సంతోషించాను. వారు, వారి కుటుంబసభ్యులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని థరూర్ ట్వీట్ చేశారు.
తన ఆరోగ్యంపై వచ్చిన తప్పుడు వార్తలపై సుమిత్ర ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. ‘‘కొంతమంది ఎలాంటి స్పష్టమైన సమాచారం లేకుండా వార్తలు రాశారు. వారు కనీసం ఇండోర్ జిల్లా అధికారుల నుంచైనా వివరణ తీసుకుంటే బాగుండేది. ఈ వార్త దేశమంతా పాకిపోయింది. నాకు మా బంధువుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె పేర్కొన్నారు. కాగా, సుమిత్ర చనిపోయారని సోషల్ మీడియాలో వదంతులు సృష్టించిన గుర్తు తెలియని వ్యక్తిపై ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక బీజేపీ నేత, మాజీ కార్పొరేటర్ సుధీర్ ఈ విషయమై ఫిర్యాదు చేశారు.