iDreamPost
android-app
ios-app

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరలిపోతోందనే ప్రచారం వెనుక అసలు కథ ఏంటీ..?

  • Published Jun 16, 2021 | 6:22 AM Updated Updated Jun 16, 2021 | 6:22 AM
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరలిపోతోందనే ప్రచారం వెనుక అసలు కథ ఏంటీ..?

కొన్ని నెలల క్రితం కియా తరలిపోయింది. పచ్చ మీడియాలో చేసిన ప్రచారం ఆ రీతిలో ఉంటుంది. నిజానికి కియా తరలిపోయిందనే ప్రచారం స్థానంలో కియా విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంతు వచ్చింది. వాస్తవానికి కియా పరిశ్రమ ఉత్పత్తి చేసేందుకు సిద్ధపడింది. ప్రస్తుతం ఉత్పత్తిలో ఉంది. కానీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ దానికి పూర్తి భిన్నం. గతంలో విశాఖ కేంద్రంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో ఎంవోయూలు కుదుర్చుకున్న వివిధ కంపెనీల తరహాలోనే ఇది కూడా మిగిలిపోయింది. లక్షల ఉద్యోగాలు, కోట్ల పెట్టుబడులంటూ ఆయా సమ్మిట్ ల సందర్భంగా ఆడంబరంగా చంద్రబాబు చేసిన ప్రకటనలన్నీ గాలిమాటలేనని ఇప్పటికే రుజువయ్యింది.

నిజానికి చంద్రబాబు అలవిగాని కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం, అవన్నీ పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ప్రచారం చేయడం, తీరా అవి గ్రౌండ్ కాకపోతే దానికి జగన్ ని నిందించడం ఇప్పుడు నిత్యకార్యంగా మారింది. చంద్రబాబు అధికారంలో ఉండగా 2016లోనే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వచ్చేస్తుందని ప్రకటించారు. నేరుగా చంద్రబాబు అమెరికా వెళ్లిన సమయంలో ఆ సంస్థ సీఈఓ జెన్నీఫర్ ఎం జాన్సన్ తో భేటీ కూడా జరిగింది. ఇంకేముంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న సంస్థ విశాఖలోనూ పెట్టుబడులు పెడుతోందంటూ ప్రచారం చేసుకున్నారు. 2017లో ఎంవోయూ కుదుర్చుకున్నామని తెలిపారు. 2018లో విశాఖ రిషికొండ ప్రాంతంలో కార్యాలయం కూడా ప్రారంభించారు.

2016లోనే వస్తున్నాయని చెప్పిన పెట్టుబడులు 2019లో కూడా ఎందుకు గ్రౌండ్ కాలేదంటే సమాధానం ఉండదు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే పెట్టుబడుల సంస్థ ఫార్చ్యూన్ 500 లో ఉన్నప్పటికీ 2,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ, 450 కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పిన మాటలు ఎందుకు ఆచరణ రూపం దాల్చలేదూ అంటే దిక్కులు చూస్తారు. చంద్రబాబుని చూసి పెట్టుబడులు పెడుతున్నారని అప్పట్లో చెప్పుకున్న మాటల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూలలో నామమాత్రపు పెట్టుబడులయినా రాకపోవడానికి కారణం ఎవరూ అంటే మౌనమే సమాధానం. అదే పరంపరలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వ్యవహారం కూడా ఉండదనే గ్యారంటీ ఉందా అంటే గొంతు పెగలదు. కానీ జగన్ మీద మాత్రం బురదజల్లే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు ఉండగా, కంపెనీలు వచ్చేసినట్టు, జగన్ వచ్చిన తర్వాత వెనక్కి పోతున్నట్టు అర్థసత్యాల ప్రచారానికి పూనుకుంటారు.

 అప్పట్లో కియా, ఆ తర్వాత అదానీ డేటా పార్క్ ఇలా అన్నింటి చుట్టూ అబద్ధాలను అల్లడమే అలవాటుగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. నిజానికి ఇటీవల ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మీద ఇటీవల ఈడీ కేసు నమోదు చేసింది. ఈ ఏడాది మార్చిలో ఆ సంస్థ యాజమాన్యం, ప్రతినిధులపై మనీ లాండరింగ్ కేసు నమోదయ్యింది. ఆర్థిక నేరాల విభాగం చేసిన ఫిర్యాదుతో చెన్నైలో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. అంతేగాకుడా సెబీ కూడా ఈ సంస్థపై రూ 3 కోట్ల జరిమానా కూడా విధించింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సర్వీసెస్ ట్రస్ట్ తో పాటు ఆ సంస్థ ఇండియా ప్రతినిధుల మీద కూడా ఫైన్ వేసింది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో సెబీ నిబంధనలను ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడినందుకు ఆ సంస్థ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశంలో పలు ఆర్థిక నేరాల్లో భాగస్వామిగా ఉన్న సంస్థ పెట్టుబడుల విషయంలో ముందుకు వెళ్లేందుకు పునరాలోచనలో ఉండడం అత్యంత సహజం. అలాంటి అంశాన్ని పట్టుకుని జగన్ మెడకు చుట్టాలని పచ్చమీడియా చేస్తున్న ప్రయత్నం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. వాస్తవానికి కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాకముందే హడావిడి చేయడం వెనుక అసలు లక్ష్యం, వారి బండారం బయటపడుతుంది.

Also Read : వాహన మిత్ర పథకంపై ఆంధ్రజ్యోతి అక్షర విషం