2019 టాప్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా సంక్రాంతి విజేతగా నిలిచిన ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 నిర్మాణ దశలోనే విపరీతమైన అంచనాలు రేపుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఆగస్ట్ 27 రిలీజ్ డేట్ ఇచ్చేశారు కాబట్టి చేతిలో ఉన్న ఆరు నెలలు పరుగులు పెట్టాల్సిందే. ఇప్పటికే కీలక భాగం ఫినిష్ చేశారని టాక్. దాదాపు మొదటి భాగం తారాగణం ఇందులో కూడా కంటిన్యూ కాబోతోంది. సునీల్ లాంటి అదనపు ఆకర్షణలు ఈసారి తోడయ్యాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ,మొదటి భాగానికి మించిన కామెడీ ఇందులో హై లైట్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని తెలిసింది.
తాజా సమాచారం మేరకు ఈ స్టోరీకి సంబంధించి ఒక లీక్ ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇందులో వెంకటేష్ వరుణ్ తేజ్ లు ఇద్దరూ రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టి భార్య ఖర్చులను లైఫ్ స్టైల్ ని మేనేజ్ చేయడం కోసం డబ్బు కోసం నానా తిప్పలు పడటాన్ని మెయిన్ లైన్ గా తీర్చిదిద్దారట. అంతేకాదు వెంకీ తమన్నా జోడికి పిల్లల కామెడీని కూడా జత చేయొచ్చని తెలిసింది. మరి సునీల్ పాత్ర ఏంటి, ఎక్కడ వస్తాడు, ఏం చేస్తాడనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎఫ్3 వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఎఫ్3కి ఒక ఫారిన్ షెడ్యూల్ కూడా ఉందని టాక్.
ఇప్పటికే శాటిలైట్ డిజిటల్ డీల్స్ పూర్తయ్యాయని కొద్దిరోజుల క్రితమే లీక్ వచ్చింది. సుమారుగా 24 కోట్లకు ఆ హక్కులను ఇచ్చేశారని చెప్పారు. అయితే ఇలాంటివి అధికారికంగా చెప్పరు కాబట్టి ధ్రువీకరణ లేదు. జీ తెలుగు ఛానల్ ప్రసారం చేజిక్కించుకున్నట్టు తెలిసింది. నారప్ప మేలో రిలీజైతే కేవలం నాలుగు నెలల గ్యాప్ లో వెంకటేష్ మరో సినిమా వచ్చినట్టు అవుతుంది. అలాగే జులై 30న గనితో వచ్చే వరుణ్ తేజ అంతకన్నా తక్కువ కేవలం 28 రోజుల తేడాతో ఎఫ్3లో కనిపిస్తాడు. ఇలా ఇద్దరు హీరోల అభిమానులకు ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది. వేసవిలోనే ఎఫ్3 టీజర్ రాబోతోంది