iDreamPost
iDreamPost
ఒక హీరో 30 సంవత్సరాలకు పైగా స్టార్ స్టేటస్ అనుభవిస్తూ ఇప్పటికీ నవ మన్మధుడిలా నీరాజనాలు అందుకుంటూ ఒక్క డ్యూయెట్ కాని ఫైట్ కాని లేకుండా చక్రాల కుర్చీలో కూర్చునే అచేతనుడి పాత్ర చేయలనుకున్నపుడు అందరు ముక్కున వేలేసుకున్నారు. కాని ఇలా ప్రయోగాలు చేయటం నాగార్జున కొత్త కాదు అనే విషయం వారీకి తెలుసు కాబట్టే నాగ్ యువ హీరోలతో పోటీ పడి మరీ విజయాలు సాధిస్తున్నాడు. ఈ రోజు కింగ్ పుట్టినరోజు సందర్భంగా కెరీర్ గురించి సింహావలోకానం
శివ రోజుల్లో…..
ఎన్టీఆర్, చిరంజీవి లాంటి మాస్ హీరోల వల్ల తెలుగు సినిమా ఒక ఫార్ములాకు కట్టుబడి ఆ మూస చట్రంలో ఇరుక్కుపోయి గింగిరాలు తిరుగుతుంటే శివ రూపంలో వర్మ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ నాగార్జున తీసుకున్న నిర్ణయం నిజంగా సాహసమే. ఆ సినిమా తెలుగు సినిమా గమనాన్ని ఎలా మార్చిందో ఈ తరం ప్రేక్షకులకి కూడా అవగాహన ఉందంటే ఆ రోజు నాగ్ శివ చేసే విషయంలో ఎంత అద్భుతంగా ఫలితాన్ని ఉహించాడో అర్థమవుతుంది…
శివ తర్వాత….
కొత్త పోకడని తీసుకొచ్చినప్పటికీ తెలుగు సినిమా బంధింపబడిన మాస్ చట్రం అంతగా తేలిగ్గా మారలేదు. శివ నాగార్జున కెరీర్ మీద ఎంత సానుకూల ప్రభావం చూపిందో అంతే మోతాదులో వ్యతిరేక ప్రభావం కూడా చూపింది. ఆ క్రమంలో తెలుగు సినిమా కట్టుబాట్లకు లోబడి చేసిన ప్రేమ యుద్ధం, నేటి సిద్దార్థ, చైతన్య, అగ్ని, అగ్ని పుత్రుడు, విజయ్, శాంతి క్రాంతి, జైత్రయాత్ర లాంటి సినిమాలు నిరాశపరిచాయి. కాస్త రూటు మార్చి చేసిన ఆఖరి పోరాటం శివ కన్నా ముందే సత్ఫలితాన్ని ఇచ్చిన విషయం మర్చిపోకూడదు
పర బాషా సహనం
ప్రేక్షకులకు విభిన్నమైన చిత్రాలను అందించాలనే ఉద్దేశంతో నాగ్ ఇతర బాషా దర్శకులతో చేసిన ప్రయోగాలు కొన్ని వికటించాయి. అందులో మలయాళ దర్శకులు ఫాజిల్ “కిల్లర్”, ప్రియదర్శన్ “నిర్ణయం”, తమిళ్ డైరెక్టర్ ప్రతాప్ పోతన్ “చైతన్య”, కన్నడ దర్శకలు దేశాయ్ “ప్రేమ యుద్ధం”, రవిచంద్ర “శాంతి క్రాంతి”, హిందీ దర్శకుడు మహేష్ భట్ “క్రిమినల్” అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. కాని నాగ్ ఎప్పుడు కొత్త ఆలోచనలతో వచ్చే ప్రతీ దర్శకుడికి అవకాశం ఇచ్చారు. ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో సామాజిక స్పృహ నేపధ్యంలో వచ్చిన జైత్ర యాత్ర కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. కెరీర్ ఉచ్చ దశలో ఉన్నపుడే నాగ్ ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేసారు.
కమర్షియల్ పంథా
ఒక దశలో ప్రయోగాలు అనుకున్న రీతిలో ఫలితాలు ఇవ్వకపోవటం తో కమర్షియల్ బాణీలో సినిమాలు తీసి తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో రుజువు చేసారు నాగార్జున. అలా తీసిన అల్లరి అల్లుడు, ఘరానా బుల్లోడు, వారసుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం బాక్స్ ఆఫీస్ ని కాసులతో కళ కళ లాడించి యువ సామ్రాట్ స్టార్ ఇమేజ్ ని అమాంతం పెంచేసాయి. అన్ని శతదినోత్సవ చిత్రాలు కావటంతో అభిమాన గణం కూడా విపరీతంగా పెరిగిపోయింది. మన్మథుడు లాంటి సాఫ్ట్ ఎంటర్ టైనర్ తో మాస్ ని మెప్పించేలా చేసుకోవడం కూడా ఫ్యాన్స్ ప్రత్యేకంగా చెప్పుకుంటారు
హలో బ్రదర్ గా
రాజేంద్రప్రసాద్ లాంటి హీరోలతో కామెడీ హిట్లు తీస్తున్న ఈ.వి.వి సత్యనారాయణ వెనకాల స్టార్ హీరోలు సైతం వెంట పడేలా చేసింది ముమ్మాటికి నాగార్జునే అని చెప్పాలి. కెరీర్ లో తొలి సారి ద్విపాత్రాభినయం చేస్తూ అపార అనుభవం ఉన్న దర్శకుడికి కాకుండా కథ మీద నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని ఈ.వి. వి వమ్ము చేయకుండా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అంతకుముందు వారసుడుతో కుదిరిన బాండింగ్ దీంతో మరింత బలపడింది. తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలందరితోను ఈవీవీ సక్సెస్ ఫుల్ సినిమాలు తీసారంటే దానికి మూల కారణం నాగ్ ఇచ్చిన అవకాశమే.
సాహసంతో చెలగాటం
శివలాంటి మైల్ స్టోన్ ఇచ్చిన వర్మకు తర్వాతి క్రమంలో నాగ్ మూడు అవకాశాలు ఇచ్చారు. ఒకటి అంతం. రెండోది గోవిందా గోవిందా. మూడోది ఆఫీసర్. మొదటి చిత్రం అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో విషాదంత క్లైమాక్స్ తో కూడుకున్నది కాగా, రెండోది తెలుగు ప్రజల ఆరాధ్య దైవం వెంకన్న సన్నిధిలో చోరీ చేయటం అనే సాహసోపేతమైన కథాంశం. రెండూ చేదు ఫలితాన్నే మిగిల్చినప్పటికి అప్పట్లోనే నాగ్ అంత రిస్క్ చేయడాన్ని హాట్స్ ఆఫ్ అనాల్సిందే. ఆ తర్వాత ఆ మధ్య ఆఫీసర్ ఇస్తే వర్మ ఏం చేశారో అందరికీ తెలిసిందే
భిన్న పాత్రల సమ్మేళనం
ఒక వైపు ప్రేమ దేశం లాంటి చిత్రాలు యువత మతి పోగొడుతున్నాయి. మరో వైపు వెంకటేష్ కుటుంబ కథ చిత్రాలతో దూసుకుపోతుంటే, ఇంకోవైపు చిరంజీవి, బాలయ్య మాస్ చిత్రాలతో ఎలుతుంటే వీటికి ఏ మాత్రం నెరవకుండా కృష్ణ వంశీ అనే అప్ కమింగ్ డైరెక్టర్ ను నమ్మి నిన్నే పెళ్లాడతా లాంటి రొమాంటిక్ ఫీల్ గుడ్ ఫామిలీ ఎంటర్టైనర్ తీసే ధైర్యం చేయటం నాగార్జునకే చెల్లింది. అప్పట్లో ప్రతీ తెలుగు ఫామిలీ ఈ సినిమా చూసారంటే అతిశయోక్తి కాదు.
అన్నమయ్య పునాది
స్టార్ హీరోగా అపారమైన అండదండలతో ఆదరాభిమానాలు కలిగి వెలుగొందుతున్న సమయంలో భిన్న కోణాలు కలిగిన భక్తి పూరిత పాత్ర అన్నమయ్య చేయటం ఒక చరిత్ర. యువకుడిగా, రసికుడిగా, భక్తుడిగా, వృద్ధుడిగా, చివరికి దైవ సన్నిధిలో ఆత్మ త్యాగం కోరే అపర కరుణ రస భరిత పాత్రలో నాగార్జున లీనమయ్యి నటించి ప్రేక్షకులను ధార్మిక ఆనందంలో ఒలలాడించటంతో స్క్రిప్ట్ పరంగా ఉన్న ఎన్నో లోపాలు మరగున పడ్డాయి అన్నది నగ్న సత్యం.అది పునాదిగా ఇతర హీరోలు సైతం భక్తి చిత్రాల వైపు మళ్ళటం ఆయా అభిమానులు సైతం ఒప్పుకుంటారు. ఆ కోవలోనే షిరిడి సాయి, శ్రీరామదాసు, ఓం నమో వెంకటేశాయలు చేసినా అన్నమయ్య స్థాయికి చేరుకోలేదు
చివరిగా
తన తరం హీరోల మార్కెట్ క్రమంగా కుంచించుకుపోతుంటే నవతరం హీరోలు పుట్ట గొడుగులా వస్తు ఉనికి కోసం పడ రాని పాట్లు పడుతుంటే తన వారసులు వచ్చాక కూడా నాగ్ మనం లాంటి అల్ట్రా లాజికల్ ఫామిలీ డ్రామా ను తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారికి నివాళిగా ఘన విజయాన్ని అందివ్వడం ఒక అద్భుత ఘట్టం.ఐదు పదుల వయసు దాటినా యువ హీరోలు సైతం అసూయపడేలా గ్లామర్ మెయింటైన్ చేస్తూ “సోగ్గాడే చిన్ని నాయన” తో అవలీలగా 50 కోట్ల వసూళ్లు కొల్లగొట్టటం నాగ్ కె చెల్లింది.రాజు గారి గది 2తో హారర్ జానర్ టచ్ చేసినా వైల్డ్ డాగ్ తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి శ్రీకారం చుట్టినా ఎంచుకునే ప్రతికథలోనూ వైవిధ్యం ఎంచుకోవడం వల్లే నాగార్జున తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తున్నారు.