Idream media
Idream media
అనంతపురంలో అన్ని థియేటర్లూ ఇష్టమే. వాటిలో శాంతి మరీ ఇష్టం. సూపర్ హిట్ సినిమాలన్నీ చూసింది ఇక్కడే. 1976 సమ్మర్‌లో దొరలు… దొంగలు ఫస్ట్ చూశాను. రామకృష్ణ హీరో. రాయదుర్గంలో పరమడొక్కు థియేటర్లు చూసిన నాకు శాంతి ఒక అద్భుతం. టికెట్లు కింది క్లాసువి దొరకకపోతే 2 రూపాయల క్లాస్‌కి వెళ్లాను. ఆ రోజుల్లో 2 రూపాయలకి చాలా విలువ. థియేటర్‌లోకి వెళ్లగానే చల్లగాలి తగిలింది. మా వూళ్లోలా ఫ్యాన్స్ వెతుక్కుని కూచోనక్కరలేదు. కిర్రుకిర్రుమని సౌండ్ లేదు. సీటు మెత్తగా తగిలింది. చెక్క బెంచీలకి అలవాటు పడిన శరీరానికి , అదో సింహాసనంలా అనిపించింది.
పరదా కుచ్చిళ్ల లైట్లు వెలిగాయి. కయ్ సెప్టెంబర్ మ్యూజిక్‌తో తెరలేచింది. సినిమా మాత్రం చెత్త. తలాతోక లేని కథ. థియేటర్ అనుభూతిని దాచుకుని అశోక్‌నగర్ వరకూ నడక. 12 ఏళ్ల కాలంలో కొన్ని వందల సినిమాలు చూశాను. సీతామాలక్ష్మి పాటలకి మెస్మరైజ్ అయ్యింది ఇక్కడే. ప్రాణం ఖరీదులో చిరంజీవిని, చిలుకమ్మ చెప్పిందిలో రజనీకాంత్‌ని చూసి ఎవరబ్బా వీళ్లు అనుకుంది ఈ థియేటర్‌లోనే.
NTR వేటగాడు సినిమాకి ఉదయం 5కి నిద్రలేచి థియేటర్ దగ్గరికి పరిగెత్తాను. అప్పటికే అభిమానుల హడావుడి. కొంత మంది కటవుట్‌కి పూల దండలు రెడీ చేస్తున్నారు. ఈ థియేటర్‌లో ప్రత్యేకత ఏమంటే శుభ్రంగా వుండేది. కాంపౌండ్ గలీజ్ అవుతుందని పాలాభిషేకంకి ఒప్పుకునే వాళ్లు కాదు. అభిమానులకి ఇదో బాధ.
8 గంటలకి షో అయితే, 7 గంటలకి గేట్లు open చేశారు. ఒకర్నొకరు తోసుకుంటూ కౌంటర్ మీదికి ఎగబడితే, ఒకాయన కర్రతో వచ్చి గద్దించి క్యూలైన్ ఏర్పాటు చేశాడు. నిజాయితీ ఏమంటే బ్లాక్‌ని ఎంకరేజ్ చేసేవాళ్లు కాదు. సూపర్‌హిట్ సినిమాలకి కూడా న్యాయంగా కౌంటర్‌లో టికెట్లు ఇచ్చేవాళ్లు.
థియేటర్ నిండా NTR అభిమానులు. తెరపైకి లేస్తే ఈలలు కేకలు. NTR కనిపిస్తే పూల వర్షం. శ్రీదేవి తెలుగు సినిమాని ఏలుతుందని అందరికీ అర్థమైంది. కాని ఆమె ఇండియా సినిమానే శాసిస్తుందని , అన్యాయంగా బాత్‌టబ్‌లో చనిపోతుందని వూహించలేదు. NTR పిచ్చి డ్యాన్సులు , స్టెప్పులు వేస్తూ పుట్టింటోళ్లు తరిమేశారు అని జయమాలినితో పాడుతుంటే అప్పట్లో చూశాం కానీ ఇప్పుడు నవ్వొస్తుంది.
77లో శాంతిలోనే అడవిరాముడు వందరోజులు ఆడింది. సర్దార్ పాపారాయుడు ఇంకో సూపర్‌హిట్. 77 సంక్రాంతికి కురుక్షేత్రం వేశారు. కృష్ణ పబ్లిసిటి ఒక రేంజ్‌లో వుండేది. ఈ సినిమా కటవుట్‌ని దీర్ఘ చతురస్రాకారంలో థియేటర్ బయట పరిచారు. పెద్ద హీరోల సినిమాలకి నిలువెత్తు కటవుట్లు మాత్రమే వుండే రోజుల్లో ఇదో రికార్డు. థియేటర్ ముందు దీన్ని చూడడానికి వచ్చే జనంతో ట్రాఫిక్ ఆగిపోయేది.
ప్రేమాభిషేకం కూడా ఇక్కడే వేశారు. 8 గంటల ఆటతో స్టార్ట్. సినిమా సూపర్‌హిట్ అని అర్థమయ్యేసరికి అభిమానులంతా డాన్సులు చేస్తూ బయటికొచ్చారు. శంకరాభరణం మొదటి ఆట 11-30తో స్టార్టయింది. జనం లేరు. రెండోరోజు నుంచి టికెట్లు లేవు.
అనంతపురంలో నేను చూసిన మొదటి ఇంగ్లీష్ మార్నింగ్ షో కూడా ఇక్కడే. దాని పేరు ఫ్రొఫెషనల్స్. కథ గుర్తు లేదు కానీ, రైలు దోపిడీ అద్భుతంగా తీసారు. బహుశా షోలేకి ఇది ప్రేరణ కావచ్చు. శని, ఆదివారాలు ఉదయం 10 గంటలకి ఇంగ్లీష్ సినిమాలు వేసేవాళ్లు.
ఎంటర్ ది డ్రాగన్ 4 ఆటలు వేశారు. ఇంగ్లీష్ సినిమాకి టికెట్లు దొరకకపోవడం ఇదే ఫస్ట్. బ్రూస్‌లీ క్రేజ్. ఈ సినిమా చూసాకా చాలా మందికి కరాటే పిచ్చి పట్టింది. వూళ్లో చాలా మంది మాస్టర్లు వెలిశారు.
ఆప్పుడప్పుడు హిందీ సినిమాలు వచ్చేవి. కర్జ్, త్రిశూల్, కాళీచరణ్ , నాగిని ఇక్కడ చూసినవే. ఈ థియేటర్‌లో మహరాజ్ సర్కిల్ అని 3 రూపాయల క్లాస్ వుండేది. మెత్తటి సీట్లు, కానీ 3 రూపాయలంటే చాలా costly.
థియేటర్‌లో పక్కనే రమణవిలాస్ అనే హోటలుండేది. ప్లేట్ భోజనం 2 రూపాయలు. పప్పు రుచి అద్భుతం. ఎంత అద్భుతం అంటే 40 ఏళ్ల తర్వాత కూడా ఇంకా నాలుక మీదే వుంది.
తరువాతి రోజుల్లో ఈ కాంపౌండ్‌లో ఇంకో రెండు మినీ థియేటర్లు కట్టారు. శాంతి థియేటర్‌ని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం వల్ల ఏమో ముసలితనం రాలేదు. అనంతపురం వచ్చినపుడు అటు వెళితే జనం లేకుండా ఒంటరిగా కనిపిస్తూ వుంటుంది. అప్పటి సందడి , వైభవం ఇక రావు.
ఇక్కడ సినిమా చూడక చాలా ఏళ్లయింది. ఎందుకంటే నా అమాయకత్వానికి రంగులద్దిన మిత్రులెవరూ ఇపుడు లేరు. జీవిక కోసం ఎటో వెళ్లిపోయారు. సగం మంది శాశ్వతంగా!
జ్ఞాపకాలకి మరణముండదు. బతికినంత కాలం మోస్తూనే వుంటాం.