iDreamPost
iDreamPost
టెక్కలి మాజీ శాసనసభ్యులు సీనియర్ నేత బమ్మిడి నారాయణ స్వామి మృతిచెందారు. అయన స్వగ్రామం రాంపురంలో స్వగృహంలో ఉండగా హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యిన ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు తెలుస్తుంది. ఆచార్య ఎన్‌జీ రంగా, సర్దార్ గౌతు లచ్చన్నలకు ముఖ్య అనుచరుడిగా ఉన్న నారాయణ స్వామి 1978 లో జనతా పార్టీ తరఫున టెక్కలి సమితి నుండి పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న సతారు లోకానందం నాయుడు పై విజయం సాదించారు.
1978 ఎన్నికల్లో జనతాపార్టీ తరుపున పోటీ చేసిన 270 మందిలో 60 మంది విజయం సాధించగా తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాలవలన జనతా శాసన సభ్యులు గా ఉన్న 60 మందిలో 59 మంది కాంగ్రెస్ లో చేరిపోగా ఒక్క బమ్మిడి నారాయణస్వామి మాత్రమే జనతా పార్టీలోనే ఉండిపోయారు. 1978 నుంచి 1983 వరకు ఇంచుమించు స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయాల్లో ఎలాంటి స్వలాభం చూసుకోకుండా పూర్తిగా ప్రజాసేవకే అంకితమై ఎన్నికల్లో పోటీకి ముందే తన సోంత ఊరు రాంపురంలో తన పూర్వీకుల నుండి వచ్చిన 89 ఎకరాల సొంత భూమిని సైతం పూర్తిగా కోల్పోయారు. దీంతో 1978 ఎన్నికల్లో ఆయనకు జనతా పార్టి తరుపున టెక్కలి సమీతి స్థానం సీట్ దక్కడంతో ప్రజలే స్వచ్చందంగా వేల రూపాయల విరాళాలు సేకరించి ఆయనను గెలిపించుకున్నారు.
ఆయన శాసన సభ్యుడిగా ఉన్న కాలంలో టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ది బాటలో నడిపించారు, టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం, నౌపడ జూనియర్ కళాశాల, రావివలస సబ్‌స్టేషన్, అగ్ని మాపక శాఖ కార్యాలయం, గ్రామాలకు రహదారుల సదుపాయం కల్పించారు అంతే కాకుండా ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డులో సభ్యునిగా ఉండడంతో, టెక్కలి నియోజకవర్గంతో పాటు హరిశ్చంద్రాపురం నియోజకవర్గంలో గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించారు. 1983లో నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించి తదనంతరం అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరిన బమ్మిడి నారాయణ స్వామి కర్షక పరిషత్ పర్సన్ ఇన్‌చార్జిగానూ సేవలు అందించారు.
రాజకీయాల్లో డబ్బు ప్రభావం బాగా పెరిగిపోయిన నేపధ్యంలో సుదీర్ఘ కాలంపాటు రాజకీయాలకి దూరంగా ఉంటు వచ్చిన బమ్మిడి నారాయణ స్వామి 2018 డిసెంబర్ 19న నాటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ పాదయాత్ర శ్రీకాకుళం లోకి అడుగు పెట్టగానే కోటబొమ్మాళి మండలం కొబ్బరిచెట్లపేట వద్ద పాదయాత్ర శిబిరంలో వైఎస్ జగన్ ను కలిసి వైయస్సార్ పార్టీలో చేరారు. ఈ సంధర్భంగా ఆయన ఆనాడు మాట్లాడుతు ప్రస్తుత రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయని, రాజకీయ విలువల కోసం వైఎస్ జగన్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని , దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా రైతు బాంధవుడని, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని. మళ్ళీ వైయస్ జగన్‌తోనే రైతాంగానికి మేలు జరుగుతుందని తనకి పూర్తి విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు.
విలువులతోనే సుదీర్గ రాజకీయ ప్రయాణం చేసి చివరి వరకు ప్రజా సంక్షేమానికే కట్టుబడిన బమ్మిడి నారాయణ స్వామి 92 ఏళ్ళ వయస్సులో మృతిచెందడంతో ఆయన అభిమానులు, పార్టీలకి అతీతంగా రాజకీయ నేతలు సంతాపం తెలియజేశారు.