రాజకీయ బలంతో ఏం చేసినా చెల్లుతుందనుకుంటే అవివేకమే అవుతుంది. టీడీపీ నాయకురాలు, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ విషయంలో ఇది మరోమారు నిరూపితమైంది. తన దుందుడుకు స్వభావంతో నిత్యం వివాదాల్లో నిలిచే అఖిల ప్రియ తాజాగా మారో వివాదానికి కేరాఫ్ గా మారారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అఖిల ప్రమేయాన్ని గుర్తించిన పోలీసులు ఆమెను ఆరెస్టు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువు, క్రీడాకారుడు ప్రవీణ్ రావు, అతని సోదరులు సునీల్ రావు, నవీన్ రావుల కిడ్నాప్ కేసు కొత్త మలుపు తీసుకుంది. కిడ్నాప్ కేసులో టీడీపీ నాయకురాలు అఖిల ప్రియ ప్రమేయముందని పోలీసులు దృవీకరించారు. విచారణ నిమిత్తం అఖిల ప్రియను అరెస్టు చేసిన పోలీసులు బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ లో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు.
కేసీఆర్ బంధువు
మాజీ హాకీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరికి బంధువు. కేసీఆర్ పీఏ వేణుగోపాలరావుకు బావమరిది. బోయిన్ పల్లిలో నివాసముండే ప్రవీణ్ రావు నివాసానికి గురువారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. తమను తాము ఐటీ అధికారులుగా చెప్పుకున్న వారు ఇంట్లో వారిని ఓ గదిలో బంధించి ప్రవీణ్‌రావు అతని సోదరులు సునీల్‌రావు, నవీన్‌రావులను కిడ్నాప్ చేశారు. వారితో పాటు విలువైన పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్ల కూడా తీసుకెళ్లారు. ప్రవీణ్ రావు సోదరులతో సంతకాలు చేయించుకున్న కిడ్నాపర్లు నార్సింగి సమీపంలో వారిని వదిలేసి పరారయ్యారు.
కిడ్నాప్ విషయం తెలియగానే మంత్రి శ్రీనివాసగౌడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ప్రవీణ్ రావు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్లను వికారాబాద్ లో అరెస్టు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 15 మందిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన వారిలో మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భర్త భార్గవరామ్ సోదరుడు చంద్రమాస్ కూడా ఉండడం గమనార్హం.
అఖిల ప్రియ హస్తం
కిడ్నాప్ వెనక అఖిల ప్రియ హస్తం ఉందని ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హఫీజ్‌పేట్‌లోని 50 ఎకరాల భూ వివాదం కిడ్నాప్ కి కారణమని తెలుస్తోంది. భూమా అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి ఉన్నప్పటి నుంచీ ఈ భూ వివాదం కొనసాగుతోంది. అఖిల ప్రియతో ఆమె భాగస్వాములు కొందరు చాలా కాలం నుంచి ప్రవీణ్ కుమార్ కుటుంబంపై ఒత్తిడి చేస్తున్నారు. కాగా… ఈ భూవివాదం విషయంలో సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిందని, తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని ప్రవీణ్ కుటుంబ సభ్యులు అంటున్నారు. అఖిల ప్రియ ఏదైనా సమస్య ఉంటే తమ భాగస్వాములతో తేల్చుకోవాలని, కానీ అనవసరంగా తమపై ఒత్తిడి చేయడం సరికాదని అంటున్నారు.
వందల కోట్ల విలువ చేసే భూమి కావడంతో అఖిల ప్రియ కుటుంబం భూమిని సొంతం చేసుకోవడంపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా అఖిల ప్రియ భర్త భార్గవ్ సోదరుడు సెటిల్ మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో పక్కా ప్రణాళికతో కిడ్నాప్ స్కెచ్ వేశారు. రెక్కి నిర్వహించి మరి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ వ్యవహారంలో మొత్తం 15మంది ప్రమేయాన్ని గుర్తించిన పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిలో ఇప్పటికే 8మందిని అరెస్టు చేసిన పోలీసులు కిడ్నాప్ వ్యవహారంలో అఖిల ప్రియ ప్రమేయంపై విచారణ జరుపుతున్నారు.
వివాదాలకు కేరాఫ్
భూమా అఖిల ప్రియ ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి తెరతీస్తూనే ఉంటుంది. గతంలోనూ ఆమెపై హత్యాయత్నపు ఆరోపణలున్నాయి. భూమా అఖిల ప్రియ దంపతులు తనను చంపేందుకు యత్నిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. అందుకోసం కోటి రూపాయాలతో కాంట్రాక్టు కుదుర్చుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఈసారి కిడ్నాప్ వ్యవహారంలో అఖిల ప్రియ పేరు బయటపడింది. మొత్తానికి కిడ్నాప్ కేసుతో రాజకీయాలను అడ్డుపెట్టుకొని చేస్తున్న అక్రమాలకు పాల్పడాలనుకుంటున్న భూమా కుటుంబం కుట్రలు బట్టబయలయ్యాయి.