iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఇటీవల అనూహ్య మార్పులు చూడవచ్చు. అందులోనూ సోము వీర్రాజు ప్రకటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సహజంగా మత రాజకీయాల్లో అందెవేసిన చేయిగా కనిపించే బీజేపీ ఇప్పుడు మందు రాజకీయాలు కూడా మొదలెట్టింది. చీపు లిక్కరు చీపుగా ఇస్తామంటూ ఎన్నికల వాగ్దానం కూడా చేసింది. అదే సమయంలో గుంటూరులో జిన్నా టవర్, విశాఖలో కేజీహెచ్ పేర్లు చుట్టూ రాజకీయ పబ్బం గడుపుకునే యత్నాలు మొదలెట్టారు. సోము వీర్రాజు హఠాత్తుగా ఇంత దూకుడు ప్రదర్శించడం వెనుక ఆపార్టీలో పరిణామాలు కీలక దశకు చేరడమే కారణమని పలువురు భావిస్తున్నారు.
ఏపీలో బీజేపీ ఉనికి చాటుకోవడమే పెద్ద సమస్య అవుతుందనడంలో సందేహం లేదు. నేటికీ ఆపార్టీకి పక్కాగా పట్టు కలిగిన నియోజకవర్గం ఒక్కటి కూడా లేదు. రాజకీయంగా మిత్రపక్షాల అండదండలతోనయినా కొన్ని సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యం తప్ప సొంతంగా సత్తా చాటే అవకాశం లేదు. అయినప్పటికీ బీజేపీ తో స్నేహం రాజకీయంగా ఉపయోగించుకోవాలనే ప్రయత్నం టీడీపీ తీవ్రంగానే చేసింది. కానీ ఆపార్టీ ఆశలు పండేలా కనిపించడం లేదు. బీజేపీతో మైత్రీకి బాబు ఎన్ని అడుగులు వేసినా కమలనాధుల కేంద్రం నుంచి కదలికలేదు.ఈ తరుణంలో బీజేపీలో ఉన్న బాబు బ్యాచ్ తమ యత్నాలు ముమ్మరం చేశారు. బీజేపీ, టీడీపీలను ఏకం చేసే యత్నంలో గట్టిగానే శ్రమిస్తున్నారు. అధిష్టానం నుంచి ఆశావాహక స్పందన లేకపోయినా ఆఖరి వరకూ తమ ప్రయత్నాలు విరమించకూడదని సంకల్పించుకున్నట్టు కనిపిస్తోంది.
Also Read : తెలంగాణకు జేపీ నడ్డా.. సికింద్రాబాద్ లో హైటెన్షన్.. చివరకు..
అందుకు అనువుగా తొలుత ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీద బీజేపీ దాడి ఎక్కుపెట్టిందనే వాతావరణం రాజకీయంగా కల్పించే యత్నంలో ఉన్నారు. ఇటీవల ప్రజాగ్రహసభకు సీఎం రమేష్ , సుజనా చౌదరి వంటి వారు బాధ్యత తీసుకుని జనసమీకరణ నుంచి ఇతర అన్ని అవసరాలు తీర్చడం అందులో భాగమే. అదే సమయంలో సోము వీర్రాజు వైఖరి తమకు ఆటంకం అని బాబు వర్గం భావిస్తోంది. చంద్రబాబు అంటే గిట్టని సోము వీర్రాజుని సాగనంపకుండా ఏపీలో బీజేపీ, టీడీపీలు ఒకే గూటికి చేర్చడం సాధ్యం కాదని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇటీవల సోము వీర్రాజు మీద ఫిర్యాదుల పర్వం పెంచారు. అయినా ఫలితం ఇంకా కనిపించకపోయేసరికి అసహనంతో ఉన్నట్టు కనిపిస్తోంది.
సోము వీర్రాజుకి ఏపీలో అధ్యక్ష బాధ్యతలు అప్పగించి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో త్వరలోనే అధ్యక్ష మార్పు ఉంటుందనే ఊహాగానాలను ఆ వర్గం ప్రచారం చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే వీర్రాజుకి వ్యతిరేకంగా ఢిల్లీలో పావులు కదుపుతోంది. ఈపరిణామాలతో అప్రమత్తమయిన సోము కాస్త దూకుడు పెంచి ముందుకెళ్లే యోచనలో ఉన్నారు. అందులో భాగమే తాజా ప్రకటనలని కూడా కొందరు భావిస్తున్నారు. పార్టీలో తన వ్యతిరేక వర్గానికి అవకాశం లేకుండా వచ్చే ఎన్నికల వరకూ అధ్యక్ష పీఠాన్ని కాపాడుకునే యత్నంలో సోము వీర్రాజు కూడా శ్రమిస్తున్నారు. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వీర్రాజు పదవీకాలం పొడిగించకుండా చూడాలనే సంకల్పంతో చంద్రబాబు సన్నిహితులున్నారు.
ఏపీ బీజేపీలో ఇరువర్గాల వైరం ఆపార్టీ శ్రేణులను కూడా సతమతం చేస్తోంది. ఇటీవల పలు కార్యక్రమాల సందర్భంగా పైచేయి సాధించేందుకు ఇరువర్గాలు పట్టుదలకు పోయాయి. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఏపీ బీజేపీ పరిస్థితిని ఇది మరింత దిగజారుస్తోంది. అయినప్పటికీ ఆధిపత్యపోరులో ఇరువర్గాలు నేరుగా తలపడుతున్న తీరు ఆసక్తిగా కనిపిస్తోంది. సోము వీర్రాజు స్థానంలో కాపులకే అవకాశం ఇవ్వాలనుకుంటే కన్నా లక్ష్మీనారాయణ పేరుని పరిశీలించాలనే అభిప్రాయం కూడా కొందరు వినిపిస్తుండడం విశేషం. కానీ కేంద్రంలో బీజేపీ పెద్దల వైఖరి భిన్నంగా ఉండడంతో ఇప్పటికిప్పుడు సోము వీర్రాజు సీటు మారుస్తారా లేదా అనేది సందేహమే. ఏమయినా బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్ష పీఠం కోసం సాగుతున్న కసరత్తులు మాత్రం కమలంలో కలకలం రేపుతున్నాయనడంలో సందేహం లేదు.
Also Read : నేను ప్రధాని అయ్యాకే ఇదంతా : మణిపూర్‌లో మోడీ కీలక వ్యాఖ్యలు