Idream media
Idream media
రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఆయన బినామీగా ప్రచారంలో ఉన్న సినీ నటుడు మాగంటి మురళీమోహన్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు..? అనే ప్రశ్న ఆయన ప్రాతినిధ్యం వహించిన రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ ప్రజలతోపాటు.. చంద్రబాబు అభిమానుల్లోనూ మెదులుతోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు అల్లాడిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కేసుల సంఖ్యలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. రాజమహేంద్రవరం నగరంలో ప్రతి డివిజన్‌లోనూ కేసులు నమోదయ్యాయి. అయితే వివిధ రాజకీయ, రాజకీయేతర వర్గాలు ప్రజలకు అండగా ఉండేందుకు తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నాయి. ఇలాంటి ఏ కార్యక్రమంతోనూ నియోజకవర్గంలో మురళీమోహన్ కనిపించలేదు.
2014 నుంచి 2019 వరకు రాజమహేంద్రవరం ఎంపీగా మురళీమోహన్ పని చేయగా.. 2019 ఎన్నికల్లో ఆయన కోడలు మాగంటి రూప పోటీ చేసి ఓటమిచెందారు. ఆ తర్వాత వారు నియోజవర్గం వైపు చూడడం లేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు చంద్రబాబు మూడు రాజధానులకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలోనూ మురళీమోహన్ కనిపించడం లేదు. అమరావతిలో మురళీమోహన్ కూడా భూమలు కొన్నారనే ప్రచారం సాగింది. అంతేకాకుండా తన సంస్థ జయభేరి ద్వారా అమరావతిలో భారీ ఆపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. అయినా కూడా అమరావతికి అనుకూలంగానో, మూడు రాజధానులకు వ్యతిరేకంగానో ఏ విధమైన ప్రకటన మురళీమోహన్ నుంచి రాలేదు. ఆ మధ్య అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఇటీవలే తన 80వ పుట్టిన రోజును జరుపుకున్నారు.
80వ పడిలోనూ చలాకీగా ఉన్న మురళీమోహన్ రాజకీయాలకు దూరంగా ఉన్నా.. తన వృత్తిలో మాత్రం యాక్టివ్‌గానే ఉన్నారు. అటు నియోజకవర్గ ప్రజలకు, ఇటు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న మురళీమోహన్.. టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. జెమిని టీవీలో ప్రసారమవుతున్న ‘బొమ్మరిల్లు’ సీరియల్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సీరియల్‌లో తమిళనటి కుస్భు సహా సురేష్ తదితర సినిమా నటులతో కలసి మురళీమోహన్ నటిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని పూర్తిగా రాజకీయాలకు దూరం ఉండాలని మురళీ మోహన్ భావించారు. కానీ పార్టీ ఒత్తిడి మేరకు తన కోడలను ఎంపీ స్థానంలో నిలబెట్టాల్సి వచ్చింది. ఓటమి తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరం అయినట్లు తన వృత్తి అయిన నటనపై మురళీమోహన్ దృష్టి పెట్టడడంతో అందరికీ స్పష్టమవుతోంది.
Read Also : ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు.. పుల్లారావు..!