iDreamPost
android-app
ios-app

కుమారుడు కోసం పావులు కదుపుతున్న మాజీ ఎంపీ

  • Published Sep 25, 2021 | 6:18 AM Updated Updated Sep 25, 2021 | 6:18 AM
కుమారుడు కోసం పావులు కదుపుతున్న మాజీ ఎంపీ

తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ప్రముఖుడు చిట్టూరి రవీంద్ర తన వారసుడు శ్రీనివాసరావును 2024 ఎన్నికల్లో రాజానగరం నుంచి పోటీ చేయిస్తారని నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. రవీంద్ర ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నా ఆయన నేపథ్యం, వ్యవహార శైలి గురించి తెలిసినవారు వారసుడి రాకపై ఆసక్తి కనబరుస్తున్నారు.

బలమైన నేపథ్యం..

రామచంద్రపురం నియోజకవర్గంలోని కూళ్ళ గ్రామ సర్పంచిగా రవీంద్ర రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. శ్రీరామదాసు మోటారు ట్రాన్స్ పోర్ట్ (ఎస్ఆర్ఎంటీ) వ్యవస్థాపకుడు) కేవీఆర్ చౌదరి చిన్నల్లుడైన రవీంద్ర ఆర్థికంగా స్థితిమంతుడు. ఎస్ఆర్ఎంటీ చౌదరిగా ప్రసిద్దుడైన ఆయన మామ.. కపిలేశ్వరపురం జమీందారులైన ఎస్బీపీబీకే పట్టాభి రామారావు, సత్యనారాయణరావులతో తలబడుతూ జిల్లా రాజకీయాల్లో కింగ్ మేకర్ గా పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశం ఆవిర్భావంతో ఆ పార్టీకి జిల్లాలో ఎస్ఆర్ఎంటీ చౌదరి ఆర్థికంగా పెద్ద దిక్కుగా ఉండేవారు. జిల్లా వరకు పార్టీని ఆయన వెనుక ఉండి నడిపించారు. అయన పెద్ద అల్లుడు చుండ్రు శ్రీ హరిని టీడీపీ నుంచి 1984లో రాజమండ్రి ఎంపీగా గెలిపించారు. ఆ తరువాత రవీంద్ర టీడీపీలో చేరారు.

Also Read : వయసైపోతోంది నాయకా..!

రామచంద్రపురంలో తిరుగుబాటు..

1994 అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీలపై నేతలు తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు, తెలుగుదేశం పార్టీ గుత్తుల శ్రీ సూర్యనారాయణబాబుకు టికెట్లు ఇచ్చాయి. రెండు పార్టీలు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినవారికే టికెట్లు కట్టబెట్టడాన్నిఇతర నాయకులు నిరసించారు. టీడీపీ స్థానికేతరుడైన గుత్తులకు టికెట్‌ ఇవ్వడాన్ని పార్టీలో సీనియర్‌ నేతలు జీర్ణించుకోలేకపోయారు. కాంగ్రెస్‌ కూడా ఎప్పుడూ శెట్టిబలిజలకే టికెట్‌ ఇవ్వడాన్ని ఆ పార్టీలో సీనియర్లు ‍వ్యతిరేకించారు. ఇలా అసంతృప్తితో ఉన్న రెండు పార్టీలకు చెందిన సీనియర్‌ నేతలు చిట్టూరి రవీంద్ర, పేపకాయల సత్యనారాయణ, తోట త్రిమూర్తులు మరికొందరు తమ అనుచరులతో బయటకు వచ్చి కూటమిగా ఏర్పడ్డారు. కూటమి ఉమ్మడి అభ్యర్థిగా తోట త్రిమూర్తులును ఇండిపెండెంట్‌గా నిలిపి గెలిపించారు. ఆ తర్వాత తోట త్రిమూర్తులు టీడీపీలో చేరగా, రవీంద్ర కాంగ్రెస్‌లోకి వెళ్లారు.

Also Read : పెద్దాపురం పై బొడ్డు వారసుడి గురి…..

ఎన్నికల్లో విజయాలు.. అపజయాలు

రాజమండ్రి నుంచి 1996లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి రవీంద్ర ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, తన తోడల్లుడు చుండ్రు శ్రీహరిపై రవీంద్ర గెలవడం విశేషం. 1998లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 1999 ఎన్నికల్లో మళ్లీ రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ తరఫున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు చేతిలో ఓడిపోయారు. 2004లో అప్పటి బూరుగుపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలిచి టీడీపీ అభ్యర్థి పెందుర్తి అన్నపూర్ణపై గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనతో బూరుగుపూడికి బదులు రాజానగరం నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాజానగరం నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేశ్‌ చేతిలో ఓడిపోయారు.

వైఎస్సార్‌ మరణానంతరం టీడీపీలోకి..

2009లో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో ఆయన కలత చెందారు. అప్పుడున్న రాజకీయ గందరగోళంలో కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరారు. అప్పటి నుంచి రాజకీయంగా స్తబ్ధుగా ఉన్నారు. పారిశ్రామిక వేత్త అయిన ఆయన కాకినాడలో ఉంటూ తన వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఎంబీఏ చదివిన ఆయన కుమారుడు శ్రీనివాసరావును ఇప్పుడు రాజకీయ తెరపైకి తేవడానికి సిద్ధపడుతున్నారని అంటున్నారు. రవీంద్ర ఎన్నికల్లో పోటీచేసినపుడు ఆయన తనయుడు వెంటే ఉండేవారు. ఆయన రాజానగరం నియెజకవర్గానికి కొత్తేంకాదని అంటున్నారు.

Also Read : మాజీ ఎమ్మెల్యే రౌతుకు నామినేటెడ్‌ పదవి దక్కనిది ఇందుకేనా..?