‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా’ అనేది పాత సామెత, ఇప్పుడు ఆ సామెతను పాలకులు అక్షరాల నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అత్యాచారాలకు, హత్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉండే ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన మహారాజ్‌గంజ్ జిల్లాలో ఒక విచిత్రమైన పోలీసు కేసు తెరమీదకు వచ్చింది.. తన కోడిని ఎవరో కావాలనే హత్య చేశారని చెబుతూ ఒక మాజీ ఎమ్మెల్యే కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినడానికి చాలా విచిత్రంగా ఉన్న ఈ కేసు పూర్వపరాలలోకి వెళితే మహారాజ్‌గంజ్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే. దుఖీ ప్రసాద్ కుటుంబానికి చెందిన పెంపుడు కోడిని శనివారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారట. మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాజ్‌కుమార్ భారతి ఈ మేరకు సింధూరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతే కాదు తన కోడికి పోస్టుమార్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరో విచిత్రం ఏమిటంటే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల వెతకడం ప్రారంభించడమే.
శనివారం, నిచ్లౌల్ ప్రాంతంలో గ్రామ కార్యదర్శిగా ఉన్న రాజ్‌కుమార్ భారతి, కోడి హత్యకు సంబంధించిన ఫిర్యాదుతో సిందూరియా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, అందరూ ఆశ్చర్యపోయారు. తనకు ఇష్టమైన కోడిని ఎవరైనా విషం ఇచ్చి చంపారేమో అని రాజ్‌కుమార్ భారతి ఆరోపించారు. తాను ఒక పెట్ లవర్ ను అని పేర్కొన్న అతను, ఈ కోడి మరణం యొక్క షాక్‌ను భరించలేనని, పోలీసులు నిందితులను పట్టుకునే వరకు నేను విశ్రాంతి తీసుకోనని కూడా అన్నారు. రాజ్ కుమార్ తండ్రి దుఖీ ప్రసాద్ 1977లో సదర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన చేశారు కూడా. ఆయన కొడుకు సిందూరియా ప్రాంతంలోని పిప్ర కళ్యాణ్ గ్రామంలో నివసిస్తున్నాడు. ఇంట్లో చిలుక, పావురంతో సహా నాలుగు కోళ్లను పెంచుతున్నామని రాజ్‌కుమార్ భారతి చెప్పారు.
తాను కుటుంబంతో సహా ఒక చిన్న పని పడడంతో మహారాజ్‌గంజ్‌కు వెళ్లానని తన కుమారుడు పాఠశాలకు వెళ్లాడని, అతను పాఠశాల నుండి ఇంటికి చేరుకున్నప్పుడు, ఆ కోడి ఇబ్బంది పడుతోందని, కాసేపటికే అది మరణించిందని పేర్కొన్నారు. రాజ్‌కుమార్ భారతి మాట్లాడుతూ, గ్రామంలో లేదా సమీపంలోని ఎవరైనా కోడికి విషం ఇచ్చి చంపారని అనుమానం వ్యక్తం చేసారు. అందుకే పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత చర్యలు తీసుకోవాలని కేసు నమోదు కాకుంటే ఉన్నత అధికారులను సైతం కలుస్తానాని అంటున్నారు. ఇక సింధూరియా ఇన్‌ఛార్జ్, తానేదార్ రితురాజ్ సుమన్ యాదవ్ మాట్లాడుతూ ‘కోడి మర్డర్’ అంటూ ఒక ఫిర్యాదు అందుకున్నామని, ఇప్పటికైతే ఫిర్యాదులో ఎవరూ నిందితులుగా పేర్కొనబడలేదని అన్నారు. విషం ఇచ్చారు అంటున్నారు సరే ఎందుకు ? ఎవరు ఇస్తారు? అనే కోణాల్లో మాజీ ఎమ్మెల్యే కుమారుడిని ప్రశ్నిస్తున్నామని అన్నారు.
అయితే ఈ వ్యవహారం చూస్తుంటే 2019 సంవత్సరంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి కుక్క చనిపోయిన సమయంలో పోలీసులు కేసులు పెట్టిన ఘటన గుర్తొస్తోంది. అప్పట్లో కేసీఆర్ అధికారిక నివాసం అయిన ప్రగతి భవన్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒక కుక్క పిల్లను తెచ్చి పెంచుకునేవారు. ‘హస్కీ’ అనే పేరు గల ఆ కుక్కపిల్ల 11 నెలల వయసులో అనారోగ్య కారణాలతో చనిపోయింది. అయితే అది చనిపోవడానికి కారణం దానికి ట్రీట్మెంట్ ఇచ్చిన వెటర్నరీ డాక్టర్ అని పేర్కొంటూ ఆ డాక్టర్ మీద పోలీసులు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తరువాత కొట్టేశారు అనుకోండి అది వేరే విషయం. కానీ ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేస్తేనే దిక్కూ మొక్కూ లేని ఉత్తర్ ప్రదేశ్ లో ఈ కోడి మర్డర్ కేసు నమోదు కావడమే హాస్యాస్పదం. రేప్,మర్డర్ లాంటి సీరియస్ కేసులనే లైట్ తీసుకునే అక్కడి పోలీసులు కేసు నమోదు చేయడమే ఎక్కువ అంటున్నారు నెటిజన్లు, మరి చూడాలి ఈ కోడి మర్డర్ ఎందాకా వెళ్తుంది అనేది.