Idream media
Idream media
గీత వేరు కుంపటి!! – సొంత ఆఫీసు ప్రారంభం – అశోక్ పెత్తనానికి సవాల్
విజయనగరం టిడిపి అంటేనే అశోక్ గజపతిరాజు. ఆయన చెప్పిందే వేదం. అయన చేసిందే శాసనం, గత ముప్పయ్యేళ్లుగా ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించేవాళ్లు లేరు. ఆయన చెప్పినవాళ్లకే టికెట్లు దక్కుతాయ్. ఆయన కన్నెర్రజేస్తే రాజకీయ భవిష్యత్ గల్లంతే.. చిరకు పార్టీ ఆఫీసు కూడా ఆయన కనుసన్నల్లోనే ఉంటుంది… అంటే ఆయన బంగళాలోనే ఉంటుంది. ఎంతటి పెద్ద నాయకులైనా అశోక్ బంగ్లాకు వచ్చి ఆయన్ను కలిసి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందే .. జిల్లా పార్టీకి ఆయనే ఆదరువు ..ఆయనే ఆధారం. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు.
ఈరోజు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, టిడిపి చరిత్రలో ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకుని అశోక్ గజపతి పెద్దరికానికి సవాల్ విసిరారు. ఇన్నాళ్లుగా ఉన్న టీడీపీ పార్టీ కార్యాలయాన్ని కాదని ఇపుడు సొంతంగా ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇదివరకు ఎవరూ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకునే ధైర్యం చేయలేదు. కానీ గీత ఇప్పుడు కొత్త సంప్రదాయానికి తెరతీశారు. ఇక ముందు తాము అశోక్ గజపతి ఇంట్లో ఉన్న కార్యాలయానికి పోయేది లేదని, తమ కార్యకర్తలు అభిమామలను తమ కార్యాలయంలోనే కలుస్తామని సందేశం పార్టీ హైకమాండ్ కు పంపారు.
అదితి కోసం గీతను బలిచేశారా?
వాస్తవానికి 2014-2019 మధ్య విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్న గీత మొన్నటి సాధారణ ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని చివరివరకూ ఆశించారు. కానీ అశోక్ చివర్లో చక్రం తిప్పి టికెట్ కాస్తా తన కుమార్తె అదితి గజపతికి ఇప్పించారు. దీంతో అలక వహించిన గీత గత ఎన్నికల్లో ఎక్కడా ప్రచారం చేయకుండా లో ప్రొఫైల్లో ఉండిపోయాడు. మొత్తానికి 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కొలగట్ల వీరభద్రస్వామి విజయం సాధించారు. ఆ తరువాత గీత రాజకీయాల్లో పెద్దగా ఉత్సాహంగా పాల్గొనడం లేదు. ఇక అటు తరువాత ఇప్పటికే అదితి కూడా పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ కార్యకర్తలతో మమేకమవుతున్నారు. దీంతో గీతకు తన భవిష్యత్ అర్థమైంది.
అశోక్ తన కుమార్తెకు రాజకీయ భయిష్యత్తు ఇవ్వడం కోసం తన కెరీర్ ను బలిపెట్టారని, ఇక ముందు కూడా ఇదే కొనసాగుతుంది తప్ప తనకు టికెట్ రాదని అవగతమైంది. ఎన్నాళ్లున్నా అదితి కి ప్రాధాన్యం ఉంటుంది తప్ప తనకు ఎలాంటి అవకాశాలు కూడా ఉండవు అని గీతకు క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంకా అక్కడ ఉండడం వల్ల ప్రయోజనం లేదని, అందుకే తన దారి తాము చూసుకుంటున్నాను అని ఈ కొత్త ఆఫీసు ప్రారంభం ద్వారా తెలియజెప్పారు.
ఇంతవరకూ జిల్లాలోని ఏ నాయకుడు తీసుకోని నిర్ణయం, ఓ ధైర్యవంతమైన నిర్ణయం తీసుకున్నారు. అశోక్ గజపతిని వ్యతిరేకించి పార్టీలో మనగలిగిన వాళ్లు లేరు. ఒకనాటి తెర్లాం ఎమ్మెల్యే తెంటు జయ ప్రకాష్, కూడా అశోక్ బాధితుడే. అలాంటిది, ఒ మహిళ, ఆది కూడా ఒకే ఒకసారి ఎమ్మెల్యే అయిన గీత ఇలా అశోక్ పై ధ్వజమెత్తడం ఎటు దారితీస్తుందో చూడాలి..