iDreamPost
android-app
ios-app

టీడీపీ ఆ ఇంఛార్జిని ఎందుకు తొలగించినట్లో?!

  • Published Aug 20, 2021 | 7:26 AM Updated Updated Aug 20, 2021 | 7:26 AM
టీడీపీ ఆ ఇంఛార్జిని ఎందుకు తొలగించినట్లో?!

సార్వత్రిక ఎన్నికల్లో రెండున్నరేళ్ల క్రితం ఎదురైన దారుణ ఓటమితో తెలుగుదేశం కుదేలైంది. నేతలు, కార్యకర్తల వలసలతో పార్టీ జవసత్వాలు ఉడిగిపోయాయి. చాలా ఆలస్యంగా తెప్పరిల్లిన అధిష్టానం పార్టీని పటిష్టపరిచే క్రమంలో చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా చాలా చోట్ల వికటిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో అదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ పార్టీ ఇంచార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడిని ఉన్న ఫళంగా ఇంఛార్జి పదవి నుంచి తప్పించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కంచుకోటలో ఓటమి బాట

పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశానికి ఒకప్పుడు కంచుకోట. 1983 నుంచి ఏడుసార్లు ఆ పార్టీ అభ్యర్థులే ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి బండారు మాధవ నాయుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడిపై నెగ్గారు. 2019లో జగన్ వేవ్ నరసపురంలోనూ టీడీపీని కూలదోసింది. సిటింగ్ ఎమ్మెల్యే మాధవ నాయుడిని వైఎస్సార్సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు ఓడించారు. అప్పటి నుంచి మాధవనాయుడు టీడీపీ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. అయితే పార్టీ వర్గాలుగా చీలిపోవడంతో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పార్టీ పటిష్టానికి మాధవనాయుడు కృషి చేయడం లేదని పార్టీలోని ఒక వర్గం ఆరోపిస్తోంది.

తప్పించారా.. తప్పుకున్నారా?

అయితే నేతలే దొరకని దుస్థితి నెలకొన్న తరుణంలో ఉన్న ఇంచార్జి ని హఠాత్తుగా తొలగించడంపై టీడీపీ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవలే మాధవనాయుడు స్థానంలో పాతూరు రామరాజును ఇంఛార్జిగా నియమించారు. మాధవనాయుడు పార్టీని పట్టించుకోవడంలేదని, స్థానిక ఎన్నికల్లో ఆయన తీరు వల్లే పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జి తోట సీతారామలక్ష్మి, పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దాని ఫలితంగానే మాధవనాయుడును ఇంఛార్జి పదవి నుంచి తొలగించారన్న వాదన నియోజకవర్గంలో వినిపిస్తోంది.

అయితే ఈ వాదనను మాధవనాయుడు వర్గీయులు ఖండిస్తున్నారు. తమ నాయకుడు ఇటీవలి కాలంలో ఆర్థికంగా చితికిపోయారని, ఈ పరిస్థితిలో ఇంఛార్జిగా ఉండలేనని అధిష్టానానికి చెప్పడం వల్లే మార్చారని అంటున్నారు. కాగా బీజేపీ వైపు ఆడుగులు వేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. గతం నుంచీ మాధవనాయుడు కు బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు శిష్యుడిగా పేరుంది. ఆ పరిచయాలతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని.. దాన్ని పసిగట్టిన టీడీపీ అధిష్టానం ముందుగానే అప్రమత్తమై పదవి నుంచి తప్పించిందన్న మరో వాదన కూడా వినిపిస్తోంది.

Also Read : బాబుని బజారున పడేసిన బుచ్చయ్య