బద్వేలు ఉపఎన్నిక లో పోటీకి దిగుతున్న బీజేపీ, అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిన మాజీ ఎమ్మెల్యే జయరాములును పోటీకి దించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బద్వేలు ఉపఎన్నికలో పోటీ చేయడం లేదని బీజేపీ మిత్రపక్షమైన జనసేన ప్రకటించినప్పటికీ జనసేన శ్రేణుల మద్దతు తమకు ఉంటుందని కాషాయపార్టీ నేతలు ఆశపడుతున్నారు.
పోటీకి జనసేన దూరం..
ఆంధ్రప్రదేశ్ లో (BJP-JSP) మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. అయితే బీజేపీతో సంబంధం లేకుండానే జనసేన తన నిర్ణయాన్ని ప్రకటించింది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్నఅభ్యర్థి, దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య అయినందున పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జనసేన అధినేత పవన్ ప్రకటించారు. విలువలతో కూడిన రాజకీయాల్లో భాగంగానే తాము పోటీ చేయడంలేదని పవన్ చెప్పారు.
బీజేపీ వర్షన్ ఇలా..
కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమైనందున తమ పార్టీ పోటీలో ఉంటుందని కాషాయ నేతలు చెబుతున్నారు. ప్రచారానికి పవన్ ను ఆహ్వానిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. జనసేన శ్రేణుల మద్దతు తమకే ఉంటుందనేది కూడా వారి అంచనాగా ఉంది. మిత్రపక్షమైన బీజేపీ పోటీపై పవన్ ఇంకా స్పందించలేదు. బహుశా బీజేపీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించిన తర్వాత క్లారిటీ ఇచ్చే అవకాశముంటుంది.
Also Read : జనసేన అడుగు.. బీజేపీకి అర్థం అవుతోందా..?
వైసీపీకే మళ్లీ అవకాశం.. !
వైసీపీ తరఫున డాక్టర్ సుధ పోటికి దిగుతున్నారు. ఆమె దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్యయ్య భార్య. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే, వైసీపీ అభ్యర్థి విజయం దాదాపు ఖరారైనట్లుగానే ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరు పోటికి దిగినా అది రెండోస్థానం కోసమే అన్నట్లుగా ఉందనేది కూడా ఓ రాజకీయ విశ్లేషణ. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అట్టడుగువర్గాలకు చేరువైంది. వైసీపీకి ఆయా వర్గాలు కోర్ ఓట్ బ్యాంక్ గా మారారు. దీనికి తోడు పోటీలో ఉన్నది దివంగత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కావడంతో సానుభూతి ఓట్లు గంపగుత్తగా పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బద్వేలు ఉపఎన్నికను ప్రభుత్వం కూడా సీరియస్ గానే తీసుకుంది. నియోజకవర్గానికి ఇన్ చార్జ్ లను నియమించి ఎన్నికల బాధ్యతలను అప్పచెప్పింది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్న అధికారపార్టీ అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు తయారు చేసుకుంది. భారీ విజయం సాధించి మరో మారు సత్తా చాటేందుకు కేడర్ ను సన్నద్ధం చేశారు.
బద్వేలు ఉపఎన్నికలో పోటీ చేయడంలేదని టీడీపీ కూడా ప్రకటించినందున బీజేపీ ఓటు బ్యాంకు పెరిగే అవకాశముందనే వాదన కూడా ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే జయరాములకు 735 ఓట్లే వచ్చాయి. టీడీపీ తరఫున పోటికి దిగిన రాజశేఖర్ 50 వేల పైచిలుకు ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. బీజేపీతో పాటు బీఎస్పీ అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయి.
Also Read : మీసాల రాజు గారు ఇప్పుడు ఏమి చేస్తున్నారు..?
ఇంటింటి ప్రచారానికి సిద్ధమైన బీజేపీ…
కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటి ప్రచారం ద్వారా వివరించాలని బీజేపీ ప్లాన్ చేసింది. అన్ని గ్రామపంచాయతీలకు ఇంచార్జ్ లను నియమించి బీజేపీ కార్యకర్తలతో విస్తృత ప్రచారం చేయాలనేది బీజేపీ యాక్షన్ ప్లాన్ గా తెలుస్తోంది. రాష్ట్రప్రభుత్వ బలహీనతలను ప్రజలకు వివరించడంతో తమకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. అయితే పోలింగ్ కు సమయం తక్కువ ఉండటం బీజేపీకి ప్రతికూల అంశంగా ఉంది. అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. అంటే కేవలం 20 రోజులు మాత్రమే ప్రచారానికి అవకాశముంటుంది. ఇంత తక్కువ సమయంలో బీజేపీ అక్కడ విస్తృత ప్రచారం చేపట్టడం సాధ్యమయ్యే పనికాదు.
గతంలో జయరాములు బద్వేలు ఎమ్మెల్యే గా పనిచేసిన అనుభవం కూడా తమకు కలిసే వచ్చే అంశమని బీజేపీ బావిస్తున్నట్లు తెలుస్తోంది.ఎస్సీ రిజర్వడ్ స్థానమైన బద్వేలు నుంచి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జయరాములు వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. తర్వాత ఆయన పార్టీ మారారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన 23 మంది ఎమ్మెల్యేల్లో జయరాములు కూడా ఒకరు. అయితే 2019 ఎన్నికల్లో జయరాములకు టీడీపీ టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు.
Also Read : బద్వేలు బరిలో బీజేపీ ఏం సాధించబోతోంది?