Idream media
Idream media
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కురువృద్ధుడుగా అందరూ భావించే పెన్మత్స సాంబశివరాజు సోమవారం ఉదయం కన్ను మూశారు. 87 ఏళ్ల రాజు గత కొంత కాలంగా అస్వస్థతతో విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..
ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చేసిన సాంబశివరాజు రాజకీయ ప్రవేశమే ఓ సంచలనం.25 ఏళ్ళ వయసులోనే రాజకీయ రంగప్రవేశం చేసిన పెన్మత్స సాంబశివరాజు1958లో గజపతినగరం సమితి అధ్యక్షుడిగా గెలిచారు.1967లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి గజపతినగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత మరో ముప్పై ఐదేళ్లు ఆయనకు రాజకీయంలో ఎదురులేకుండా పోయింది. 1972లో మళ్ళీ గజపతి నగరం నుంచే బరిలో దిగారు కానీ ఆయనకు పోటీ ఇచ్చేవారే కరువయ్యారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది.
ఆ తరువాత 1978 ఎన్నికల్లో “సతివాడ” నియోజకావర్గంగా ఆవిర్భవించటంతో సాంబశివరాజు సతివాడకు మారి ఆరుసార్లు గెలిచారు. 1994 ఎన్నికల్లో మాత్రం పొట్నూరు సూర్యనారాయణ (టిడిపి) మీద ఓటమి పాలయ్యారు. సాంబశివరాజు 1967-2004 మధ్య పోటీచేసిన తొమ్మిది ఎన్నికల్లో ఏకైక ఓటమి 1994 ఎన్నికలు.
Also Read:ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు.. పుల్లారావు..!
2009 లో నియోజకావర్గాల పునఃవిభజన తో సతివాడ రద్దయ్యి నెల్లిమర్ల నియోజకవర్గం ఏర్పడింది. కానీ ఆ ఎన్నికల్లో సాంబశివరాజుకు పోటీచేసే అవకాశం రాలేదు. ఆ తరువాత రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.
సాంబశివరాజు తండ్రి జగన్నాథ రాజు గారు గతంలో విజయనగరం గజపతుల సంస్థానంలో దివాన్ గా సేవలందించారు. గజపతులకు తలలో నాలుకలా ఉంటూ అత్యంత ప్రీతిపాత్రులయ్యారు. 1989-94 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో రవాణా, పౌర సరఫరాల శాఖా మంత్రిగా పని చేశారు.
దివంగత వైఎస్సార్ తో అనుబంధం
సాంబశివరాజు కు కాంగ్రెస్ పార్టీలో అపారమైన గౌరవ మర్యాదలు ఉండేవి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో అత్యంత సాన్నిహిత్యం ఉండేది. రాజుగారు వచ్చారు అంటే వైఎస్ ఎంత బిజీగా ఉన్నాసరే వెనువెంటనే లోపలికి పిలిచి మాట్లాడి ఆయన సూచించిన ప్రజాపయోగమైన పనులు చేసేవారు. తుదివరకు అత్యంత సాదా జీవితాన్ని గడిపిన సాంబశివరాజు కెరీర్ మొత్తం మీద ఒక్క అవినీతి మరక లేకపోవడం ఆయన ఔన్నత్యాన్ని సూచిస్తుంది. కోట్ల విజయభాస్కర రెడ్డి, చెన్నారెడ్డి, నేదురుమల్లి, అంజయ్య, దామోదరం సంజీవయ్య వంటి ముఖ్యమంత్రులతో సాంబశివ రాజు సన్నిహితంగా మెలిగేవారు.
బొత్స రాజకీయ గురువు
ప్రస్తుత మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణతో రాజకీయ ఓనమాలు దిద్దించింది మాత్రం సాంబశివరాజే. నిత్యం రాజు వెన్నంటే ఉంటూ సత్తిబాబు రాజకీయాలను ఆయన నుంచే నేర్చుకున్నారు. ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి..వారి కష్టసుఖాలు ఎలా తెలుసుకోవాలి..ఇవన్నీ రాజుగారు నేర్పిన పాఠాలే..
Also Read:ఆంధ్రా రాజకీయాల్లో సోము వీర్రాజు తెచ్చిన మార్పు
మర్రిచెట్టు కింద మొలిచిన మొక్కలెన్నో!!
ఈనాడు ఎమ్మెల్యేలుగా ఉన్న అప్పలనరసయ్య, వీరభద్రస్వామి, అప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన శిష్యగణం పదుల్లోనే ఉంటుంది..
వైస్సార్సీపీకి జిల్లాలో పునాది వేసింది పెద్దాయనే
ఈనాడు వైఎస్సార్సీపీకి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు లీడర్లు బోలెడు మంది ఉన్నారు. కానీ ఆనాడు జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తరువాత విజయనగరం ఓదార్పు యాత్రకు వచ్చేసరికి ఇక్కడ ఆయన్ను తొలిసారిగా ఆహ్వానించింది ఆదరించింది సాంబశివరాజే. 77 ఏళ్ల వయసులో ప్రతి గ్రామానికి వెళ్లి, రాజశేఖర రెడ్డి కొడుకు వెనకాల మనం ఉండాలి అంటూ ప్రజలను ఒప్పించి, మెప్పించి మద్దతు కూడగట్టారు. ఆయన వేసిన మొక్క ఈనాడు జిల్లాలో మహావృక్షమైంది. తొమ్మిదికి తొమ్మిది ఎమ్మెల్యే సీట్లన, ఒక ఎంపీ సీట్ ను గెలుచుకుంది.
గత దశాబ్దంగా పదవులకు దూరంగా ఉన్నా ఇప్పటికి అందరు గురువుగారు అంటూ సాంబశివరాజును గౌరవిస్తారు.ఒక సందర్భంలో జగన్ కు శాలువ కప్పపోయిన సాంబశివరాజును ,మీరు తండ్రిలాంటి వారు అంటు జగన్ ఆయనకు శాలువ కప్పి గౌరవించారు.
టీడీపీ తరుపున పతివాడ నారాయణస్వామి ,కాంగ్రెస్/వైసీపీ తరుపున పెనుమత్స సాంబశివరాజు పదవులను మించి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. సాంబశివరాజు మృతితో విజయనగరం రాజకీయాల్లో ఒకశకం ముగిసింది.