iDreamPost
android-app
ios-app

తెలంగాణ మహిళా కమీషన్ తొలి చైర్‌పర్సన్‌గా ఆ మాజీ మంత్రి నియామకం..

తెలంగాణ మహిళా కమీషన్ తొలి చైర్‌పర్సన్‌గా ఆ మాజీ మంత్రి నియామకం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోయిన తరువాత తెలంగాణా కేసీఆర్ సర్కారు ఇంతవరకూ మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయలేదు. కేసీఆర్ మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలన్న తాజా నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో చైర్‌పర్సన్‌ సహా ఆరుగురు సభ్యులతో కూడిన తొలి మహిళా కమిషన్ ఏర్పాటు అయింది.

కాగా ఈ తొలి మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరఫున నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుంచి 2009 వరకు శాసనసభ మహిళా శిశు సంక్షేమ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో చిన్ననీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన ఆమె 2010లో కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో మహిళాశిశు, దివ్యాంగుల సంక్షేమం, స్వయం సహాయక సంఘాలు, ఇందిరా క్రాంతిపథం, పింఛన్ల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. కాగా రాష్ట్ర విభజన తదనంతరం జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు(2014,2018) ఓటమి పాలవ్వడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

ఆమెతో పాటు మహిళా కమిషన్ సభ్యులుగా షహీనా అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరీ భాయ్, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుధామ్ లక్ష్మీ, కటారి రేవతీ రావులు నియమితులయ్యారు.చైర్‌పర్సన్‌ సహా కమిషన్ సభ్యులంతా ఐదేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.