iDreamPost
android-app
ios-app

వైఎస్సార్సీపీ వైపు మళ్లీ బొబ్బిలి రాజుల చూపు!

  • Published Aug 25, 2021 | 7:30 AM Updated Updated Aug 25, 2021 | 7:30 AM
వైఎస్సార్సీపీ వైపు మళ్లీ బొబ్బిలి రాజుల చూపు!

పదవుల ప్రలోభాలకు లొంగి పార్టీ మారిన విజయనగరం జిల్లా బొబ్బిలి రాజులు పునరాలోచనలో పడ్డారా?.. మళ్లీ వైఎస్సార్సీపీలో చేరేందుకు ఉత్సుకత చూపుతున్నారా?.. గత కొన్నాళ్లుగా వారి వ్యవహారశైలి, కదలికలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి. విజయనగరం రాజావారు అశోక గజపతి ఉన్నంత వరకు టీడీపీలో విలువ ఉండదని గుర్తించిన బొబ్బిలి రాజులు గతంలో తమను ఆదరించిన వైఎస్సార్సీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు వైఎస్సార్సీపీ కూడా వచ్చే ఎన్నికలను, అప్పటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే త్వరలోనే విజయనగరం జిల్లాలో.. ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది.

రాజుల ప్రాబల్యం

విజయనగరంలో పూసపాటి రాజులకు ఎంత ప్రాధాన్యం ఉందో.. బొబ్బలి ప్రాంతంలో వెలమ రాజులైన సుజయకృష్ణ రంగారావు కుటుంబానికి అంత ప్రాబల్యం ఉంది. అశోకగజపతి కుటుంబం తెలుగుదేశంలో ఉండి చక్రం తిప్పుతోంది. బొబ్బలికి చెందిన సుజయకృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీనాయన మొదట్లో కాంగ్రెసులో ఉండేవారు. 2009లో సుజయకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బొబ్బిలి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన సోదరుడు బేబీనాయన మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. వైఎస్ మరణానంతరం జగన్ కు జైకొట్టారు. వైఎస్సార్సీపీ లో చేరారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా గెలిచి సుజయ రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి టీడీపీలో చేరి.. మంత్రి పదవి చేపట్టారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

టీడీపీలో మనుగడ కష్టం

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ కూడా పూర్తిగా కుంగిపోయింది. మరోవైపు సుజయకృష్ణ రంగారావు పార్టీతో దూరం పాటిస్తున్నారు. టీడీపీలో చేరిన సమయంలో ఇచ్చిన హామీల్లో చాలా వాటిని చంద్రబాబు విస్మరించడం, అశోకగజపతి రాజు ఉండగా.. తమకు ప్రాధాన్యత దక్కదన్న వాస్తవం అర్థం కావడంతోనే సుజయ కుటుంబం పార్టీకి దూరంగా ఉండటం మొదలుపెట్టింది. టీడీపీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న బేబీనాయన కూడా పార్టీ కార్యక్రమాల్లో అంతంతమాత్రంగా పాల్గొంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ కంటే వైఎస్సార్సీపీ లో ఉంటేనే మంచిదన్న భావనలో వారు ఉన్నారు. ఆ మేరకు పార్టీకి సంకేతాలు పంపారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న కీలక నేత ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read : చీరాల టీడీపీ ఇంఛార్జి యడం బాలాజీకి పొగపెడుతున్నదెవరు..?