iDreamPost
android-app
ios-app

మాజీ మంత్రి శంకర్ రావుకు ఆరునెలలు జైలు శిక్ష

మాజీ మంత్రి శంకర్ రావుకు ఆరునెలలు జైలు శిక్ష

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ హయాంలో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీమంత్రి శంకర్రావు అనుకోని విధంగా చిక్కుల్లో పడ్డారు. శంకర్ రావు ని రెండు కేసులలో దోషిగా తేల్చిన ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు జరిమానా విధించింది. భూవివాదానికి సంబంధించి ఒక మహిళను బెదిరించారని అభియోగం మీద 2015లో షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ లో శంకర్రావు మీద ఒక కేసు నమోదైంది. ఒక మహిళ ఇంట్లోకి అక్రమంగా చొరబడడమే కాక ఆమెను బెదిరించి భూవివాదం మీద తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోమని భయపెట్టినట్లు శంకర్రావు మీద కేసు నమోదైంది. ఈ కేసు నమోదయిన క్రమంలో ప్రజాప్రతినిధుల కోర్టులో కేసుకు సంబంధించిన విచారణ జరిగింది.

సుమారు ఆరు సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో శంకర్రావు దోషి అని తేలడంతో ముందుగా శంకర్రావుకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు.. ఈ తీర్పు విన్న వెంటనే శంకర్రావు కోర్టు హాలులోనే స్పృహతప్పి పడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో అక్కడ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మానవతా దృక్పథంతో స్పందించి వెంటనే నీళ్లు తాగించడం తో కాస్త కోలుకున్నారు. ఇదంతా చూసిన జడ్జి ఆయన ఆరోగ్య పరిస్థితి పరిగణలోకి తీసుకుని రెండు కేసులకు గాను ఒక కేసులో 2000 మరో కేసులో 1500 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మరో కేసుకు సంబంధించిన ఆధారాలు దొరకకపోవడంతో కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు.

ఇక మాజీమంత్రి శంకర్రావు తమ అధినేత సోనియాగాంధీ ప్రోద్బలంతో వైఎస్ జగన్ మీద అక్రమాస్తుల కేసు అక్రమంగా బనాయించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది. డాక్టర్ గా తన కెరీర్ ప్రారంభించిన శంకర్రావు తొలిసారిగా షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన రాజకీయ జీవితంలో ఎక్కువ షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన వైఎస్ఆర్ మంత్రివర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. వైయస్ తర్వాత ఆయన రోశయ్య మంత్రివర్గంలో ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు. అనూహ్యంగా కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించిన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు పాత కేసుల దృష్ట్యా ఆయన మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.