iDreamPost
android-app
ios-app

పుట్టపర్తి రాజకీయాల్లో “స్థానికత” ఆరోపణలు

  • Published Jan 25, 2022 | 2:52 AM Updated Updated Mar 11, 2022 | 10:22 PM
పుట్టపర్తి రాజకీయాల్లో “స్థానికత” ఆరోపణలు

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల పైనే సమయం ఉన్నా రాష్ట్రంలో కొన్నిచోట్ల టీడీపీ వేడి రగిల్చే ప్రయత్నం చేస్తోంది . ఈ క్రమంలోనే పుట్టపర్తిలో కూడా సవాళ్ళతో వేడిరగిల్చే ప్రయత్నం చేశారు టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి . పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి స్థానికుడు కాదంటూ కొత్త ఆరోపణలు చేశారు పల్లె .

ఈ అంశం పై స్పందించిన దుద్దుకుంట తాను స్థానికుణ్ణి కాదని నిరూపిస్తే తనకున్న ఐదొందల కోట్ల ఆస్తిని పల్లెకు రాసిస్తానని సవాల్ చేయడంతో పాటు కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలంలో పుట్టిన పల్లె రఘునాథ రెడ్డి పుట్టపర్తికి స్థానికుడు ఎలా అయ్యారో చెప్పాలన్నారు .

తొలుత దుద్దుకుంట ఫౌండేషన్ అనే సేవా సంస్థ స్థాపించిన శ్రీధర్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న పలు గ్రామాల ప్రజలకు తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేసేవారు . 2014 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ తరుపున హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన తర్వాత కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాలకు నీటి సరఫరాతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేవారు .

మరో వైపు 1999 నుండి టీడీపీ తరపున నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న పల్లె రఘునాథ రెడ్డి తన వ్యాపారాలు చూసుకొంటూ దాదాపు వంద ఎకరాల్లో అనంతపురంలో నిర్మించిన అగ్రికల్చర్ కాలేజి ప్రాంగణంలో నివాసముంటూ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో క్రమంగా ప్రజలకు దూరమయ్యారు . దీర్ఘకాలం పుట్టపర్తికి ప్రాతినిథ్యం వహించినా శాశ్వత ప్రాతిపదికన ఒక్క పనీ చేయకపోవడం , తీవ్ర నీటికొరత ఎదుర్కొంటున్న అమ్మడనూరు , నల్లమాడ వంటి మండలాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించే ప్రయత్నాలు సైతం చేయకపోవడంతో ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేకత పెరిగింది .

2014 నుండి 2019 వరకూ టీడీపీ ప్రభుత్వంలో కేంద్ర నిధులతో సాగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో పేదలకు అందరికీ వేలకొద్దీ సొంత మరుగుదొడ్లు ఏర్పాటు చేయగా పుట్టపర్తి నియోజకవర్గంలో కేవలం 126 మరుగుదొడ్లు మాత్రమే ఏర్పాటు చేశారంటే రాష్ట్రానికి ఖర్చులేని కేంద్ర నిధులు కూడా పేదలకు అందకుండా నియోజకవర్గాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారో అర్ధమవుతుంది .

Also Read : ఏపీలో ఇస్లామిక్ ఫండమెంటలిజమ్‌ పెరిగిందట! విస్తుగొల్పుతున్న కేంద్రమంత్రి వ్యాఖ్యలు

మరోవైపు 2019 లో ఎమ్మెల్యేగా గెలిచిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆ తర్వాత సైతం అనునిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా రాయలసీమ రైతుల గిట్టుబాటు ధరల కోసం అసెంబ్లీ వేదికగా పలుమార్లు డిమాండ్ చేయటం , టమోటా రైతు గిట్టుబాటు ధరకోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో కీలక భాగస్వామి కావడం విశేషం .

కరోనా ఫస్ట్ వేవ్ సందర్భంగా లాక్ డౌన్ పెట్టినప్పుడు నియోజకవర్గ ప్రజలందరికీ దుద్దుకుంట ఫౌండేషన్ ద్వారా రెండు దఫాలు నిత్యావసరాలు , పలు దఫాలు కూరగాయలు అందించటంతో పాటు , ఫ్రంట్ లైన్ వారియర్స్ కి అవసరమైన పీపీఏ కిట్స్ , మాస్క్స్ , సానిటైజర్స్ కూడా సొంత ఖర్చులతో పంచడం లాంటి సేవా కార్యక్రమాలతో శ్రీధర్ రెడ్డి ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు .

రాబోయే ఎన్నికలలో మరోసారి టీడీపీ తరపున అదృష్టం పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న పల్లె రఘునాథ రెడ్డికి ఈ అంశాలన్నీ ప్రతికూలంగా మారడమే కాక నేను పలానా పని చేశాను అని చెప్పుకోవడానికి ఏమీ లేని స్థితిలో , అధికారపార్టీ ఎమ్మెల్యే పై ఆరోపణలు చేయటానికి ఏ అంశం దొరక్క ఇతర ప్రాంతాల్లో టీడీపీ నేతలు కొందరు చేస్తున్నట్లే అసత్య,అసందర్భ ఆరోపణలతో బురద చల్లే యత్నం చేస్తున్నారనేది బహిరంగ రహస్యం .

దుద్దుకుంట స్థానికుడా కాదా ….

దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి విద్యుత్ శాఖ డీఈగా విధులు నిర్వర్తించారు , తల్లి పార్వతమ్మ . ఆయనది ఆయన పూర్వీకుల స్వస్థలం నల్లమాడ మండలం నల్లసింగయ్య గారి పల్లె . శ్రీధర్ రెడ్డి ఆయన అన్న శ్రీనివాస రెడ్డి (వాసు) ఇరువురూ జన్మించింది నల్లసింగయ్యగారి పల్లెలోనే. వారి తండ్రి వెంకట్రామిరెడ్డి ఉద్యోగరీత్యా రాయలసీమలోని పలు ప్రాంతాలలో బదిలీల పై పని చేసినా రిటైర్మెంట్ తర్వాత స్వగ్రామంలోనే నివసించసాగారు .

శ్రీధర్ రెడ్డి విద్యాభ్యాసం నల్లసింగయ్యగారి పల్లెలో మొదలై అనంతపురంలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ వ్యాపారరీత్యా పలు ప్రాంతాల్లో పనిచేసినా దీర్ఘకాలం నల్లసింగయ్యగారి పల్లె స్థిరనివాసంగా కొనసాగారు . రాజకీయ ప్రవేశం తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం కొద్ది సంవత్సరాల క్రితం పుట్టపర్తిలో ఇల్లు , పార్టీ కార్యాలయం నిర్మించుకొని నివాసం ఉండసాగారు .

శ్రీధర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి రెండు ఎన్నికలు గడిచిన తరువాత ఇప్పుడు కొత్తగా ఆయన స్థానికుడు కాదని పల్లె రఘునాథ రెడ్డి ఆరోపించడం స్థానికులను ఆశ్చర్య పరుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గానికి తాగు నీరు,సాగు నీరు,గార్మెంట్స్ ఇండస్ట్రీ తదితర అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టి హంద్రీ-నీవా పథకంలో భాగంగా కొత్త రిజర్వాయర్లకు పాలనా అనుమతులతో పాటు,అనేక చెరువులను నింపటానికి జీవో తెచ్చిన శ్రీధర్ రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చేస్తున్న స్థానికత ఆరోపణలు ప్రజలను ఆకర్షించటం లేదు. 

Also Read : మాజీ ఎమ్మెల్యే ,మాజీ సీఎం మేనమామ కలిచెర్ల మృతి