గుంటూరు జిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో జరుగుతున్న వరుస ఎన్నికల్లో టీడీపీ పేలవ ప్రదర్శన చేస్తుండగా, కీలక నేతలు కూడా పార్టీకి దూరమవుతున్నారు. తాజాగా మంగళగిరికి చెందిన టీడీపీ నేత, మాజీమంత్రి మురుగుడు హనుమంతరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన మురుగుడు హనమంతరావు,, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపార్టీలో చేరారు. ఆప్కో చైర్మన్ గా పనిచేశారు.
ఇవాళ ఆయన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించారు. మంగళగిరికి చెందిన మురుగుడు హనమంతరావుది చేనేత సామాజిక వర్గం. చేనేత పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారు . ఆయన 1999,2004లో మంగళగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో పోటీకి దూరంగా ఉన్నారు. మురుగుడు హనమంతరావు వియ్యపురాలు, చేనేత సామాజికవర్గానికే చెందిన కాండ్రు కమల కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు.
మంగళగిరి చేనేత పరిశ్రమకు పేరుగాంచినది. మంగళగిరి మండలంలో చేనేతలే ఓట్లే ఎక్కువ. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో మురుగుడు హనమంతరావు, బ్యాక్ వర్డ్ క్లాసెస్ చెర్మైన్ గా పనిచేశారు. ఆప్కో అభివృద్ధి కోసమే 2014లో టీడీపీలో చేరినట్లు హనమంతరావు చెబుతున్నారు. ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని వైసీపీ పాలనను కొనియాడిన హనమంతరావు.. టీడీపీలో తనకు తగిన ప్రాధాన్యం లభించలేదన్నారు. ఆప్కో అభివృద్ధికి చంద్రబాబు సహకరించలేదని ఆరోపించారు.
Also Read : కొడాలి మీదికి వంగవీటి అస్త్రం – బాబు మార్క్ వాడకం
2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన గంజి చిరంజీవిది కూడా చేనేత సామాజిక వర్గమే. ఆయన అప్పుడు స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఆర్కే చేతిలో ఓడారు. అయితే 2019లో ఆయన పోటీచేయలేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆర్కే చేతిలో ఓటమి చెందారు.
ఇప్పటికే గుంటూరు జిల్లాలో టీడీపీ ఓటు బ్యాంకు తగ్గిపోతుండగా, కీలక నేతలు ఆ పార్టీకి దూరమవుతుండటం పార్టీకి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. జిల్లాలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. తాజాగా వెల్లడైన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఓటు బ్యాంకు గణనీయంగా తగ్గిపోయింది. పరిషత్ ఫలితాల తర్వాత మాజీమంత్రి మురుగుడు హనమంతరావు టీడీపీ కి రాజీనామా చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పార్టీ వరుస ఓటములతోనే కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతుంది.
ఇటీవల వెలువడిన పరిషత్ ఫలితాల్లో గుంటూరు జిల్లాలో మొత్తం 57 జడ్పిటీసీ స్థానాలు ఉండగా 53 స్థానాల్లో వైసీపీ విజయభేరి మోగించింది. వివిధ కారణాలతో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. ఇక జిల్లాలో 862 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వివిద కారణాలతో 65 చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. ఏకగ్రీవమైన 226 స్థానాలు పోను 571 స్థానాలకు పోలింగ్ జరిగింది. వైసీపీ 496 చోట్ల విజయం సాధించగా, టీడీపీ 57 చోట్ల, జనసేన 10 చోట్ల గెలిచింది. ఇక స్వతంత్రులు 7 స్థానాల్లో గెలవగా, సీపీఐ అభ్యర్థి కేవలం ఒక్క చోట మాత్రమే నెగ్గారు. ఏకగ్రీవాలతో కలుపుకుని వైసీపీ 709 సీట్లు కైవసం చేసుకోగా, టీడీపీ 61 స్థానాలకు పరమితమైంది. ఇక బీజేపీ ఖాతా తెరవలేదు. ఏకగ్రీవాలతో కలిపి జనసేన 11 స్థానాల్లో జెండా ఎగురవేసింది. ఇతరులు 15 స్థానాల్లో విజయం సాధించారు.
Also Read : అనంత టీడీపీని ముంచిన కుమ్ములాటలు