iDreamPost
iDreamPost
కరోనా ఉధృతి పెరుగుతోంది. పలువురు ప్రముఖులను పొట్టన పెట్టుకుంటోంది. తాజా ఆ జాబితాలో మాజీ మంత్రి, సీనియర్ వైఎస్సార్సీపీ నేత కొప్పన వెంకట చంద్ర మోహన్ రావు చేరిపోయారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన రెండు సార్లు విజయం సాధించారు. 1992లో అప్పటి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో అటవీ శాఖ మంత్రిగానూ పనిచేశారు.
పిఠాపురం మండలం మల్లం గ్రామానికి చెందిన కొప్పన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి కొప్పన పెదనాయన కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశారు. జిల్లా స్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత తనయుడు కేవీసీహెచ్ మోహన్ రావు తొలిసారిగా 1978 ఎన్నికల బరిలో ఇందిరా కాంగ్రెస్ తరుపున బరిలో దిగి విజయం సాధించారు. అప్పట్లో వైఎస్సార్, చంద్రబాబు, ముద్రగడ వంటి నేతలు కూడా తొలిసారిగా సభలో ప్రవేశించడంతో వారందరితో కొప్పనకు స్నేహం ఏర్పడింది.
ఆ తర్వాత రెండు సార్లు ఓటమి పాలయినప్పటికీ మళ్లీ 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం కోట్ల క్యాబినెట్ లో కీలకంగా వ్యవహరించారు. జిల్లాలో కాపు సామాజికవర్గంలో గుర్తింపు పొందిన నేతగా ఎదిగారు. వైఎస్ కి సన్నిహితంగా మెలిగారు. 2004 ఎన్నికల్లో చివరి సారిగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో కూడా చేరారు. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరి, అనంతరం వైఎస్సార్సీపీలో జగన్ వెంట ఉన్నారు. సీనియర్ నేతగా గుర్తింపు పొంది వివిధ కార్యక్రమాల్లో చురుగ్గు పాల్గొంటూ వస్తున్న కొప్పన మోహన్ రావు 75 ఏళ్ల వయసులో మృతి చెందారు.
ఆయనకు రెండు మూడు రోజులుగా ఆరోగ్యం బాగోలేదని కుటుంబీకులు చెప్పారు. సమస్య తీవ్రం కావడంతో కాకినాడ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు కరోనా సోకడంతో సమస్య తీవ్రం అయిన కారణంగా మరణించినట్టు ప్రకటించారు. మల్లాం గ్రామంలో ఆయన అంత్యక్రియలు ప్రూర్తి చేశారు.