Idream media
Idream media
అవినీతి, అక్రమాలు, హత్యల కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన జైలు జీవితం గడుపుతున్న టీడీపీ తాజా, మాజీ ప్రజా ప్రతినిధులకు హైకోర్టు కన్నా కింది స్థాయి కోర్టులే కలసి వస్తున్నాయట. తమపై నమోదైన అభియోగాలను డిఫెండ్ చేస్తూ టీడీపీ నేతలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను విచారించిన హైకోర్టు వాటిని తిరస్కరించింది. అయితే వారు బెయిల్ కోసం మళ్లీ దిగువ కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ అయిన అచ్చెం నాయుడు, మంత్రి పేర్ని నాని అనుచరుడి హత్య కేసులో అరెస్ట్ అయి రాజమహేంద్రరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఫోర్జరీ పత్రాలతో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి విక్రయించిన కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిలకు హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. వారి బెయిల్ పిటిషన్లను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. అచ్చెం నాయుడు వ్యవహారంలో ఏసీబీ వాదనను, కొల్లు రవీంద్ర విషయంలో పోలీసుల వాదనలను సమర్థించి వారి బెయిల్ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు… జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో హోం శాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలించి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడమే కాకుండా జేసీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కింది కోర్టులో తాము ఆశించిన తీర్పు రాకపోతే కక్షిదారులు పై కోర్టును ఆశ్రయించడం సర్వసాధారణం. అయితే టీడీపీ నేతల వ్యవహారాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతోంది. హైకోర్టు బెయిల్ తిరస్కరిస్తే.. వారు పై కోర్టు.. అంటే సుప్రిం కోర్టును ఆశ్రయించాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా కింది కోర్టుల్లో మళ్లీ బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఒక సారి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన కింది కోర్టుల్లో కాకుండా.. మరో కోర్టులో బెయిల్ కోసం అపీల్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడుల బెయిల్ పిటిషన్ మొదట అనంతపురం జిల్లా కోర్టులో తిరస్కరణకు గురి కాగా, హైకోర్టులోనూ అదే ఫలితం రావడంతో వారు తిరిగి అనంతపురం జిల్లా ఎస్సీ,ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి బెయిల్ పొందారు.
తాజాగా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి దారిలోనే నడుస్తున్నారు. మొదట కొల్లు రవీంద్ర బెయిల్ కోసం మచిలీపట్నం కోర్టును ఆశ్రయించిగా అక్కడ లభించలేదు. హైకోర్టును ఆశ్రయించిగా అక్కడా చుక్కెదురైంది. తాజాగా కృష్ణా జిల్లా కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తాను ఉంటున్న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని, అందుకే బెయిల్ మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్‌లో అభ్యర్థించారు.
పిటిషన్‌ను విచారించిన కృష్ణా జిల్లా కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జైలులో కరోనా పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. రేపు బుధవారం ప్రభుత్వం ఇచ్చే నివేదికను పరిశీలించిన తర్వాత కృష్ణా జిల్లా కోర్టు కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెలువరించే అవకాశం ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి మాదిరిగా.. కింది కోర్టులో కొల్లు రవీంద్రకు కూడా జైలు నుంచి ఉపశమనం లభించే నిర్ణయం వెలువడుతుందా..? లేదా చూడాలి.