iDreamPost
android-app
ios-app

వాట్‌ ఏ లాజిక్‌..? దేవినేని ఉమా..!

వాట్‌ ఏ లాజిక్‌..? దేవినేని ఉమా..!

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కర రావు హత్య కేసులో కొల్లు రవీంద్ర పాత్రపై ఆయన సహచరనేత, మాజీ మంత్రి దేవినేని ఉమా సరికొత్త లాజిక్‌లతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు మచిలీపట్నంలో కొల్లు కుటుంబ సభ్యులను పరామర్శించిన దేవినేని ఉమా అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. హత్య జరిగిన నాలుగు గంటల్లోనే నోటీసులు ఇవ్వకుండా ఏ 4గా నమోదు చేశారని, ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు చేర్చిన సంగతి గోప్యంగా ఉంచారని విమర్శించారు.

దేవినేని ఉమా మాట్లాడిన మాటలు చూస్తే.. హత్య జరిగిన తర్వాత 4 గంటల్లోనే నిందితుల పేర్లతో ఎఫ్‌ఐఆర్‌ వేయాలని చెబుతున్నట్లుగా ఉంది. ఆ తర్వాత ఆ హత్య కేసులో ఎవరినీ నిందితులను చేయకూడదని, 4 గంటల్లోపు హత్యలో నిందితులను పట్టుకోవాలని, సూత్ర దారులకు నోటీసులు పంపాలని, లేదంటే వదిలేయాలన్నట్లుగా ఉమా మాట్లాడిన తీరు ఉంది. అసలు మోకా భాస్కర రావు హత్య 29వ తేదీ జరిగితే 30వ తేదీన నిందితులైన చింతా చిన్నితో సహా మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వారు ఇచ్చిన వాగ్మూలంతోనే ఈ హత్యలో సూత్రధారి కొల్లు రవీంద్ర అని పోలీసులు తెలుసుకున్నారు. వారు ఇచ్చిన వాగ్మూలంపై ఆధారపడకుండా అన్ని ఆధారాలు సేకరించన తర్వాతనే విచారణ కోసం కొల్లుకు నోటీసులు పంపారు. అంతకు ముందే ఆయన్ను ఈ కేసులో నిందితుడుగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేసిన విషయం దేవినేని ఉమా మరచిపోయినట్లుగా ఉన్నారు.

దేవినేని మరో ముఖ్య విషయం కూడా చెప్పారు. భాస్కర రావు హత్య కేసు వివరాలు పోలీసులు ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. కొల్లు రవీంద్రను అరెస్ట్‌ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన వివరాలను, హత్యకు ప్లాన్‌ ఎక్కడ చేశారు. హత్య తర్వాత ఏమి జరిగింది అనే వివరాలు కృష్ణా జిల్లా ఎస్పీ పూసగుచ్చినట్లు చెప్పారు. ఆ సమయంలో దేవినేని ఉమా ఎస్పీ ప్రెస్‌ మీట్‌ చూడనట్లుగా ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. లేదా తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారనుకొవచ్చు కూడా.

Read Also : మంత్రి నాని అనుచరుడి హత్యలో కొల్లు రవీంద్రే సూత్రధారి.. వెల్లడించిన కృష్ణా ఎస్పీ

ఈ హత్యలో కొల్లు రవీంద్రకు సంబంధం లేదని అధికారులే అంటున్నారని దేవినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యలో కొల్లుకు సంబంధం లేదని తనతో చెప్పిన ఆ అధికారులు ఎవరో మాత్రం దేవినేని ఉమా విలేకర్ల సమావేశంలో వెల్లడించలేదు. వారి పేర్లు వెల్లడిస్తే కొల్లు రవీంద్రకు ఊరట లభించేది కదా..? ఈ రోజు కొల్లు రవీంద్రను పోలీసులు జడ్జి అనుమతితో రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. కొల్లుకు ఈ హత్యతో సంబంధం లేదని తనకు చెప్పిన అధికారులు పేర్లు చెప్పి ఆందోళన చేస్తే కొల్లు రవీంద్ర సెంట్రల్‌ జైలుకు వెళ్లకుండా ఆపడంతోపాటు ఆయన విడుదలయ్యేందుకు పని చేయొచ్చు. మరి ఇంత మంచి అవకాశాన్ని దేవినేని ఉమా ఎందుకు చేజార్చుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.