ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణించారు. వృధ్యాప్యం,అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఏపీ ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్‌గా ఆయన పనిచేశారు. తెలుగు నాట రాజకీయాల్లో ప్రత్యేక తీరుతో ఆయన విశేషంగా రాణించారు. వాగ్దాటితో సుదీర్ఘకాలం పాటు ఆయన కాంగ్రెస్ నేతగా పనిచేశారు. వైఎస్సార్ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా, ఆయన మరణాంతరం ముఖ్యమంత్రిగా రోశయ్య అవకాశాలు దక్కించుకున్నారు.
కొణిజేటి రోశయ్య గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. 1933, జూలై 4న జన్మించిన ఆయన వయసు 88 ఏళ్లు. గుంటూరు హిందూ కళాశాలలో ఆయన చదువుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున తొలుత శాసనమండలికి ప్రాతినిథ్యం వహించారు. 1968, 1974, 1980లలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1985లో ఎన్టీఆర్ శాసనమండలి రద్దు చేయడం వెనుక రోశయ్య వంటి వారిని ఎదుర్కోవడం కష్టంగా మారడమే ప్రధాన కారణంగా చెబుతారు.
1989 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం లో రోడ్లు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తర్వాత అనేక కీలక శాఖలను వివిధ ముఖ్యమంత్రుల వద్ద నిర్వహించారు. 2004లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. వైఎస్సార్ క్యాబినెట్‌లో కీలక నేతగా వ్యవహరించారు. అదే సమయంలో మండలి పునరుద్దరణ తర్వాత మరోసారి శాసనమండలికి ప్రాతినిథ్యం వహించారు.
Also Read : TDP, Chandrababu, OTS – డ్వాక్రా సంఘాలు, ఓటీఎస్.. ఓ చంద్రబాబు
వైఎస్సార్ మరణించిన తర్వాత 2009 సెప్టెంబర్ 3 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులతో 2010 నవంబరు 24 వరకు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి, తెలంగాణా ఉద్యమం నేపథ్యంలో ఆయన సీఎం పీఠం నుంచి దిగిపోయిన ఏడాదికే తమిళనాడు గవర్నర్ గా అవకాశం వచ్చింది.
ఎన్.జి.రంగా శిష్యుడిగా ఆయనకు పేరుంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిలిచారు మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం.
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి మరియు గవర్నర్‌గా పనిచేసిన అరుదైన ఘనత రోశయ్యది.
వైశ్య కులానికి చెందిన రోశయ్యకు తన సొంత కులంతో పాటుగా రాష్ట్రంలోని వివిధ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : CBI Case – ఆ మాజీ ఎంపీ అల్లుడి మీద సీబీఐ కేసు.. అసలు విషయం ఏమిటంటే?