iDreamPost
iDreamPost
వీవీ లక్ష్మీనారాయణ..అదేనండి సీబీఐలో జేడీగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న మాజీ జనసేన నాయకుడు. ప్రస్తుతం జగన్నామస్మరణ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత తీరుని అభినందిస్తున్నారు. అవకాశం దక్కిన ప్రతీ సందర్భంలోనూ ఏపీ ప్రభుత్వ విధానాలను ప్రశంసిస్తున్నారు. దాంతో ఆయన తీరు మీద చర్చ సాగుతోంది. ఆయన ఏదో లక్ష్య సాధనలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే వాదన మొదలయ్యింది.
విశాఖ నుంచి 2019లో తొలిసారిగా పార్లమెంట్ కి బరిలో దిగిన వీవీ లక్ష్మీనారాయణ ఓటమి పాలయ్యారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో పరాజయం పాలయ్యారు. విశాఖ అర్బన్, గాజువాకలో కొంత మెజార్టీ దక్కినా భీమిలి, ఎస్ కోట వంటి సీట్లలో వెనుకబడిన మూలంగా ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన జనసేనకు దూరంగా ఉన్నారు. విశాఖకు కూడా పెద్దగా ప్రాధాన్యతనివ్వం లేదు.
అదే సమయంలో కాకినాడ పార్లమెంట్ సీటు మీద ఆయన కన్నేసినట్టు ప్రచారం సాగుతోంది. దానికి అనుగుణంగా కాకినాడ ఎంపీ సీటు పరిధిలోని ప్రత్తిపాడులో వ్యవసాయం ప్రారంభించారు. కౌలుదారుడిగా వ్యవసాయ పనులను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత వచ్చే ఎన్నికల నాటికి మరోసారి పిఠాపురం నుంచి అసెంబ్లీకి రంగంలో ఉండాలని ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పటికీ పిఠాపురంలో వంగా గీత రంగంలో ఉంటే అది ఆసక్తిగా మారుతుంది.
వైఎస్సార్సీపీ ఎంపీ టికెట్ కోసం గతంలో కాకినాడ నుంచి మూడు సార్లు ఓటమి పాలయిన చలమలశెట్టి సునీల్ వంటి వారు ఆశించే అవకాశం ఉంది. అయితే సునీల్ కి వచ్చే ఏడాది రాజ్యసభ అవకాశం ఖాయమనే ప్రచారం ఉంది. ఇక రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా కాకినాడ నుంచి ఎంపీ టికెట్ ఆశించవచ్చు. కానీ ఆయన వైపు జగన్ మొగ్గుచూపుతారా లేదా అనేది సందేహమే. దాదాపుగా కాపులకు ఈ పార్లమెంట్ సీటు ఇవ్వడం ఖాయం కాబట్టి వైఎస్సార్సీపీ తరుపున జేడీ లక్ష్మీనారాయణ రంగంలో ఉంటే ఎలా ఉంటుందోననే చర్చ వైఎస్సార్సీపీ శ్రేణుల్లోనే మొదలయ్యింది.
వాస్తవానికి జగన్ మీద సీబీఐ కేసుల విషయంలో జేడీ చేసిన అతి అంతా ఇంతా కాదు. ఆ కేసుల ద్వారా జగన్ ని 16నెలలు బంధించడం, ఇతర రూపాల్లో వేధించడం మినహా ఆయన వ్యతిరేకులకు ఒరిగిందేమీ లేదు. ఆ కేసులను నిరూపించగలిగే చట్టబద్ధ ఆధారాల సేకరణ కూడా జేడీ సైతం చేయలేక చతికిలపడ్డారు. దాంతో జగన్ కేసుల ప్రభావం ఏనాటికైనా నీరుగారిపోవడం మినహా మరో మార్గం ఉండదు. ఈలోగా కేసుల్లో విచారణ అధికారిగా ఉన్న జేడీ కూడా జగన్ వైపు వస్తే అది రాజకీయంగా కీలక నిర్ణయం అవుతుంది. ఇటీవల నాడు-నేడు వంటి పథకాలను జేడీ అభినందించారు. అంతేగాకుండా మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలు చేస్తున్నారని జగన్ ని కొనియాడారు. తద్వారా జగన్ కి మరింత దగ్గరయ్యే ఆలోచనలో జేడీ ఉన్నారనే వాదన బలపడుతోంది.
రాజకీయంగా జగన్ -జేడీ చేతులు కలిపితే అది ఆశ్చర్యకర పరిణామంగానే చెప్పాలి. ఇప్పటికే రిలయన్స్ అంబానీ నేరుగా తాడేపల్లి వచ్చి జగన్ ని కలిసి వెళ్లారు. ఆ తర్వాత పరిమళ్ నత్వానీకి ఏపీ నుంచి ఎంపీ టికెట్ కేటాయించారు. ఇప్పుడు జేడీ కూడా అదే రీతిలో జగన్ క్యాంపు కి వస్తే అది ఆసక్తికర పరిణామమే అవుతుంది. ఏమో గుర్రం ఎగురావచ్చునన్నట్టుగా జేడీ మాటలు, ఆయన అడుగులు చూస్తుంటే ఏదో జరుగుతుందనే అభిప్రాయం మాత్రం బలపడుతోంది.