Idream media
Idream media
రాజకీయాల్లో రాణించాలని, పదవులు అనుభవించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటూ వుంటారు. ఒకసారి కార్పొరేటర్ గా ఎన్నికైతే చాలు అధికార దర్పం ప్రదర్శిస్తూ వుంటారు. కానీ, ఇలాంటి వారికి తాను పూర్తి భిన్నం అని నిరూపించుకున్నారు బద్వేలు మాజీ ఎమ్మెల్యే వి. శివరామకృష్ణ.
కడప జిల్లాలో రాజకీయం చేయడం అంటే కత్తి మీద సాములాంటిది. వర్గపోరును అధిగమించి గెలిచినవాడే నాయకుడవుతారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి వెన్నంటి వుంటూ ఆయన వర్గంలోని ప్రధాన నాయకుల్లో ఒకరిగా శివరామకృష్ణారావుని చెప్పుకోవచ్చు. శివరామకృష్ణ బ్రహ్మాణ కులానికి చెందిన వారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత బ్రాహ్మణ కులం నుంచి రాయలసీమ జిల్లాల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఒకే ఒక వ్యక్తి ఈయనే.
ఈయన తండ్రి వడ్డమాని చిదానందం 1952, 62లలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బద్వేలు నియోజకవర్గంలోని వడ్డమాను వద్ద నిర్మించిన బ్రిడ్జి కి చిందానం పేరు పెట్టారు.
కడప జిల్లాలో వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసినవారిలో బిజివేముల వీరారెడ్డి ప్రముఖుడు. ఈయన 1978లో కాంగ్రెస్ నుంచే పోటీ చేయగా జనతాపార్టీ నుంచి పోటీచేసిన శివరామకృష్ణారావు చేతిలో ఓడిపోయారు. తర్వాత 1985లో టీడీపీలో చేరి వైఎస్ఆర్ కు పూర్తి వ్యతిరేకంగా రాజకీయం చేశారు. అలాంటి వ్యక్తిని శివరామకృష్ణారావు రెండు సార్లు ఓడించారు. 1989 ఎన్నికల్లో 10 వేల కోట్ల మెజారిటీతో శివరామకృష్ణారావు గెలిచారు.
శివరామకృష్ణారావు మొదటినుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్గంలోనే కొనసాగారు. జిల్లాలో ప్రతి ఎన్నికల్లో ఆయన వెంట నడిచారు. వీరారెడ్డిని ఎదురించి నిలిచారు. 2015లో స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి.. తన గెలుపుని వీరారెడ్డి కి అంకితం ఇచ్చారంటే.. వీరారెడ్డి వైఎస్ఆర్ కి ఎంత వ్యతిరేకంగా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు.
ఇక, వైఎస్ఆర్ ని పేరుతో పిలిచేంత చనువు శివరామకృష్ణారావుకు ఉంది. వీరారెడ్డి మరణంతో 2001లో వచ్చిన ఉపఎన్నికల్లో చివరిసారిగా పోటీ చేసిన ఈయన ఓడిపోయారు. 2009 తర్వాత నుంచి క్రియాశీలక రాజకీయాల్లోంచి పూర్తిగా తప్పుకున్నారు. మనం వయసు అయిపోయింది.. కొత్తగా వస్తున్న నాయకుల చేతులు, కాళ్లకు అడ్డపడడం తనకు ఇష్టం లేదు. అందుకే తప్పుకున్నా అని తన సన్నిహితుల వద్ద చెప్పే వారు.
బద్వేలులో 10వ తరగతి పూర్తి చేసిన ఆయన ఇంటర్ కడపలో అభ్యసించారు. బెనారస్ మెడికల్ కళశాల నుంచి వైద్య పట్టా అందుకున్నారు. 1978లో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డితో అనుబంధం ఉండేది. 2004లో కొన్ని కారణాల రీత్యా టిక్కెట్ రాకపోవడంతో అలకబూనారు. అయితే వైఎస్సార్ సీఎం కాగానే ఈయనకు వైద్య, విధాన పరిషత్ చైర్మన్ పదవి ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
వ్యక్తిగత జీవితానికి వస్తే భార్య గిరిజమ్మ, కుమారుడు శ్రీనివాస చిదానంద కుమార్. కుమారుడు ప్రస్తుతం కడప రిమ్స్ డెంటల్ కళాశాలలో ప్రొఫెసర్ గా చేస్తున్నారు. ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేవు. అయినప్పటికీ ఇప్పుడు కారణాలు చెప్పకుండానే ఆయన సన్యాసం స్వీకరించారు. రెండు రోజుల కిందట ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి తీరంలో సన్యాసాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శివరామృష్ణారావుతో సన్యాసాన్ని స్వీకరింపజేసిన గురువు..ఆయన పేరును మార్చివేశారు. స్థితప్రజ్ఙగా కొత్తగా నామకరణం చేశారు. పాతపేరును మరిచిపోవాలని, స్థితప్రజ్ఞగా ఇక సన్యాస జీవితాన్ని కొనసాగించాలంటూ బోధించడం ఈ వీడియోలో రికార్డయింది. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే గెలిచి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన పొలిటికల్ లీడర్ ఏకంగా సన్యాసం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.