iDreamPost
iDreamPost
గత నాలుగైదు సంవత్సరాలలో వివిధ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తీరు చూసి ఈవీఎం ల టాంపరింగ్ జరిగిందని విపక్షాలు ఆరోపణలు చేశాయి. 2017 లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలవటానికి ఉన్న ఏకైక అవకాశం “ఈవీఎం టాంపరింగ్” అని ఫలితాల కన్నా ముందు శివసేన నేత ఉద్దవ్ థాకరే కామెంట్ చేశారు .
ఏప్రిల్-మే నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాజస్థాన్,మధ్యప్రదేశ్ ,ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో బీజేపీ ఏకపక్షంగా గెలిచింది. లోక్ సభ ఎన్నికల కన్నానాలుగు నెలల ముందు ఈ రాష్టాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలై కాంగ్రెస్ అధికారములోకి వచ్చింది. నాలుగు నెలలోనే ప్రజాభిప్రాయంలో ఇంతమార్పు ఉంటుందా అని కాంగ్రెస్ తో పాటు రాజకీయ పరిశీలకు, “దాల్ మే కుచ్ కాలా హై” అంటూ ఈవీఎం ల మీద అనుమానాలు వ్యకతం చేశారు .
ఈవీఎం టాంపరింగ్ మీద బీజేపీ మరియు ఇతరపక్షాల మధ్య పెద్దపెట్టున వాదోపవాదాలు జరిగాయి. సోషల్ మీడియాలో ఈవీఎం ల మీద భారీగా జోక్స్ పేలాయి.
అయితే ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. మొన్న బెంగాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ చిత్తయింది. ఈ మూడు స్థానాలలో గెలుస్తాం మరో రెండు సంవత్సరాలలో జరిగే శాసనసభ ఎన్నికల్లో మమతా ను ఓడించి బెంగాల్ పీఠం ఎక్కుతామని గట్టి నమ్మకంతో ఉన్న బీజేపీ శ్రేణులకు ఈ ఉప ఎన్నికల ఫలితాలు మింగుడు పడలేదు.
గత లోక్ సభ ఎన్నికల్లో ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాలు ఖరగ్ పూర్ సధన్,కరింపుర్,కలియగంజ్ లలో బీజేపీకి ఆధిక్యత వచ్చిందని,ఆరునెలలు గడిచేసరికి ఫలితాలు తారుమారవ్వడం వెనక ఏదో మతలబు ఉందని,ఈవీఎంల టాంపరింగ్ జరిగిందని పశ్చిమబెంగాల్ బీజేపీ నాయకుడు రాహుల్ సిన్హా ఆరోపణలు చేసాడు.
ఇప్పటి వరకు బీజేపీ మీద ప్రత్యర్ధులు చేసిన ఈవీఎం టాంపరింగ్ ఆరోపణలను ధాటీగా తిప్పికొట్టి,ఈవీఎంలను టాంపర్ చెయ్యలేరు ,ఎవరైనా బహిరంగంగా ఈవీఎంలను టాంపర్ చేసి చూపిస్తే కోటి రూపాయలు ఇస్తాం అని సవాలు చేసిన బీజేపీ ,ఇప్పుడు ఈవీఎం టాంపరింగ్ జరిగిందని ఆరోపించటం వారి మీద వచ్చిన టాంపరింగ్ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఏది ఏమైనా ఈవీఎం ఒక బ్రహ్మపదార్ధం అన్నట్లు జరుగుతున్న వాదోపదాలకు ముగింపు పడేలా లేదు.