iDreamPost
android-app
ios-app

కొత్త జిల్లాల ఏర్పాటుకి అంతా సిద్ధం, పోలీసు బదిలీలన్నీ తాత్కాలిక నిలుపుదల

  • Published Nov 12, 2020 | 1:50 AM Updated Updated Nov 12, 2020 | 1:50 AM
కొత్త జిల్లాల ఏర్పాటుకి అంతా సిద్ధం, పోలీసు బదిలీలన్నీ తాత్కాలిక నిలుపుదల

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజనకు అంతా సిద్దమయ్యింది. ఇప్పటికే క్యాబినెట్ ఆమోదించిన తర్వాత అధ్యయనం కోసం ఏర్పాటయిన కమిటీ నివేదిక సిద్ధం అవుతోంది. దానిని ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. పరిశీలన అనంతరం దానిని ఆమోదానికి క్యాబినెట్ సన్నద్ధమవుతుంది. ఇక రాబోయే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జిల్లాల విభజన అంశం ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చకు వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పోలీసుల బదిలీలపై తాత్కాలికంగా నిలుపుదల ఉత్తర్వులు వచ్చాయి. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ వివిధ విభాగాలకు ఆదేశాలు ఇచ్చారు. వివిధ రేంజ్ ల పరిధిలో జరిగే కింది స్థాయి పోలీస్ అధికారుల బదిలీలు కూడా తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజనకు తాము కట్టుబడి ఉన్నామని వైఎస్ జగన్ మూడేళ్ల క్రితమే ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో ప్రచారం చేశారు. మ్యానిఫెస్టోలో కూడా పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అటువైపు అడుగులు వేశారు. పాలనా వికేంద్రీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్న జగన్ కేవలం రాష్ట్ర స్థాయిలో రాజధాని అంశమే కాకుండా జిల్లాలు, పంచాయితీల వరకూ పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సచివాలయం వ్యవస్థ దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో పలుమార్పులకు మూలం అవుతోంది. మూడు రాజధానుల అంశం కూడా కొలిక్కి వస్తోంది. ఇక జిల్లాల పై కూడా దృష్టి పెట్టి పాలనా వికేంద్రీకరణకు అనుగుణంగా ప్రాధమిక చర్యలు కూడా పూర్తయ్యాయి.

తాజాగా పోలీస్ బాస్ ఉత్తర్వులను బట్టి త్వరలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. 25 లేదా 26 జిల్లాలుగా మార్చేందుకు అనుగుణంగా సూచనలు, సలహాలు ఇవ్వాలని ఉన్నతాధికారుల కమిటీని ఆదేశించారు. అందులో సీఎంవో నుంచి కూడా సభ్యులున్నారు. ఇటీవల ప్రవీణ్‌ ప్రకాష్‌ కూడా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో నేరుగా పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాల విభజనకు కసరత్తులు చేస్తుందంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో త్వరలోనే ఈ అంశం కొలిక్కి వస్తున్నట్టుగా భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు జరుగుతుందా లేదా తర్వాత జనవరి మొదటి వారంలో చేస్తారా అన్నది చర్చనీయాంశం.