iDreamPost
android-app
ios-app

ప్రతీ ఏడాది అన్ని దేశాలు 15 రోజులు లాక్ డౌన్ ప్రకటించాలి….

ప్రతీ ఏడాది అన్ని దేశాలు 15 రోజులు లాక్ డౌన్ ప్రకటించాలి….

ఒకప్పుడు ఇప్పుడు ఉన్నంత కాలుష్యం ఉండేది కాదు.. ఎప్పుడైతే ఆయిల్ బయట పడిందో అప్పటినుండి వాహన వినియోగం పెరిగింది. సరికొత్త ఆవిష్కరణలతో పర్యావరణం మొత్తాన్ని కాలుష్యంతో నింపేందుకు శాయశక్తులా కృషి చేసారు మానవులు.. వాహన వినియోగం ఆయిల్ వినియోగం వల్ల గ్రీన్ హౌస్ వాయువులు పెరిగి భూమిపై ఉష్ణతాపం పెరిగింది.అతినీలలోహిత కిరణాల నుండి భూమిని కాపాడే ఓజోన్ పొరకు చిల్లులు కూడా పడ్డాయి.

ఇదంతా ఒక ఎత్తైతే ప్లాస్టిక్ ని కనిపెట్టడం మరొక ఎత్తు. మొదట్లో ప్లాస్టిక్ వల్ల ఉపయోగం ఎక్కువ పర్యావరణానికి మేలు చేస్తుంది. వృక్షాలను, అడవులను ప్లాస్టిక్ వినియోగం ద్వారా నరకకుండా ఆపొచ్చు అని అనుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు పర్యావరణానికి అతి పెద్ద భూతంగా ప్లాస్టిక్ మారిపోయింది. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని తెలిసింది. దాంతోపాటు ప్లాస్టిక్ వస్తువులను ఆహారం అనుకుని నీటిలో జీవించే జీవులు తినడం వల్ల వాటి మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది.. ప్లాస్టిక్ వినియోగం మానవజాతికి నిత్యకృత్యంగా మారింది. అదే ప్లాస్టికి పర్యావరణానికి పెనుముప్పుగా మారిపోయింది..

ప్లాస్టిక్ వస్తువులతో నదులు, సముద్రాలు, చెరువులు, సరస్సులు కాలువలు నిండిపోతున్నాయి. దీంతో నీరు కలుషితం అయిపోతుంది. ఇప్పటికే కర్బన ఉద్గారాల వల్ల భూ వాతావరణంలో పెనుమార్పులు సంభవించాయి.. ఋతువులలో మార్పులు వచ్చేసాయి..గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదవుతున్నాయి. అడవులను నరకడం వల్ల వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో పాటుగా వాయు కాలుష్యం కారణంగా కార్బన్ డై ఆక్సయిడ్ లెవెల్స్ పెరిగాయి. వాయు కాలుష్యం ఏ స్థాయిలో పెరిగింది అంటే స్వచ్ఛమైన గాలిని విక్రయించేందుకు కంపెనీలు కూడా మొదలయ్యాయి.. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. అక్కడ కూడా స్వచ్ఛమైన గాలిని విక్రయించే వ్యాపార సంస్థ వెలిసింది. దాంతో పాటు అత్యంత కాలుష్య పూరిత నగరంగా ఢిల్లీ వార్తల్లో నిలిచింది.

దేశంలో నదీ జలాలు పరిశ్రమల వ్యర్దాలు కలవడంతో పాటు మురుగు మరియు చెత్తను నదుల్లో కలపడం వల్ల తీవ్రంగా కలుషితం అయిపోయాయి. ముఖ్యంగా గంగా, యమునా నదుల్లో ఉండే కాలుష్యం గురించి చెప్పనలవి కాదు. వాటిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పథకాలు ప్రవేశ పెట్టిన ఎంత డబ్బు వెచ్చించినా కూడా ఆ నదుల్లో కాలుష్యాన్ని తగ్గించడం ఎవరివల్ల కాలేదు.. దీంతో పాటుగా మృత్తికా కాలుష్యం కూడా ఎక్కువైంది. మితిమీరిన పురుగు మందుల వాడకం ద్వారా మృత్తికల్లో ఉండాల్సిన సారం కోల్పోయి బీడు భూములుగా మారుతున్నాయి.

అడవుల్లో ఏర్పడే కార్చిచ్చుల వల్ల అడవుల్లో నివసించే జీవజాలంతో పాటు అడవులు బుగ్గిపాలు అవుతున్నాయి. ప్రపంచ ఊపిరితిత్తులుగా పేరుపొందిన అమెజాన్ అడవులలో పాటు ఆస్ట్రేలియా అడవులు కూడా కార్చిచ్చు ధాటికి చాలా మేర దగ్ధం అయ్యాయి. దీంతో పర్యావరణ అసమతౌల్యం ఏర్పడుతుంది.

కాలుష్యానికి పరిష్కారం ఏంటి?

తన ఆవిష్కరణలతో ఉద్బవించిన కాలుష్యం కారణంగా మానవ మనుగడతో పాటు అనేక జీవజాల ఉనికిని కూడా ప్రమాదంలోకి నెట్టాడు మనిషి.. అలాంటి మనిషిని కూడా ఇంట్లో కదలనివ్వకుండా కూర్చోబెట్టింది కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి.. దాదాపు అన్ని దేశాలు పరిశ్రమల కార్యకలాపాలను మూసివేసి రవాణా సౌకర్యాలను నిలిపివేశాయి. దీంతో కాలుష్యం గణనీయంగా తగ్గింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా శుద్ధి కాని నదీజలాలు ఇప్పుడు స్వచ్ఛంగా మారాయి. కొన్ని దశాబ్దాల తర్వాత కాలుష్యం తగ్గడం కారణంగా కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయాలు కూడా కనబడుతున్నాయి అంటే కాలుష్యం ఏ స్థాయిలో తగ్గిందో ఊహించుకోవచ్చు.

వాయు కాలుష్యం తగ్గడం వల్ల అస్త్మా బాధితులు కూడా గాలి పీల్చుకోగలుగుతున్నారు. ఒక వైరస్ మూలంగా పర్యావరణానికి జరిగిన మేలు ఇది. మానవజాతి చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తూ కరోనా వైరస్ మానవులను ఇంటికే పరిమితం అయ్యేలా చేసింది. దీంతో కాలుష్య స్థాయి పూర్తిగా తగ్గింది. వైరస్ చేసిన మేలును మరువకుండా ప్రతీ ఏడాది దాదాపు 15 రోజులు స్వచ్ఛంద లాక్ డౌన్ పాటించేలా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. కాలుష్య స్థాయి అదుపులో ఉంటుంది.

ఇప్పటికే మితిమీరిన వినియోగం కారణంగా కాలుష్య స్థాయిని పెంచేశారు మానవులు. కనీసం భవిష్యత్ తరాల కోసమైనా కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అందుకే ప్రతీ సంవత్సరం ఒక 15 రోజుల పాటు అన్ని పరిశ్రమలకు లాక్ డౌన్ ప్రకటించి ప్రజా రవాణాను కూడా నిలిపివేసి, ప్రజలంతా ఇంటికే పరిమితం అయ్యేలా చట్టం తీసుకొస్తే మనతో పాటు పర్యావరణానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఆ 15 రోజులు కుటుంబంతో గడిపినట్లు కూడా ఉంటుంది..

Time for nature” థీమ్ తో ఈరోజు (జూన్ 5) జరుగుతున్న “పర్యావరణ దినోత్సవం” సందర్భంగా అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది.. ఎందుకంటే మనల్ని రక్షించేది పర్యావరణం కాబట్టి..