iDreamPost
android-app
ios-app

సేవ‌ల్లో చ‌రిత్ర సృష్టిస్తున్న ఏపీ : ఇదే నిద‌ర్శ‌నం..

సేవ‌ల్లో చ‌రిత్ర సృష్టిస్తున్న ఏపీ : ఇదే నిద‌ర్శ‌నం..

రేష‌న్ కార్డు, పింఛ‌ను, ఇళ్ల స్థ‌లం ఇలా.. అవ‌స‌రం ఏదైనా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం.. ప‌ది ప‌దిహేను సార్లు కార్యాల‌యాల చుట్టూ తిర‌గ‌డం…వ‌స్తే కార్యాల‌యానికో, మ‌రోచోటుకో వెళ్లి ల‌బ్ధి పొంద‌డం. ఇదే ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ ప్ర‌భుత్వ హ‌యాంలో అయినా జ‌రిగేది. కొన్ని సార్లు ఎంతలా తిరిగినా అర్హుల‌కు కూడా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అంద‌ని దుస్థితి ఉంది. కానీ.. అర్హుడైన ల‌బ్ధిదారుడు ఎక్క‌డో ఉండి.. పింఛ‌ను తీసుకోలేని ప‌రిస్థితిలో ఉంటే.. నేరుగా అక్క‌డికే వెళ్లి వారి పింఛ‌ను చేతికి అందిస్తున్న ఘ‌నత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంది. ప్ర‌తిప‌క్షాలు అప‌హాస్యం చేసిన వ‌లంటీర్ వ్య‌వ‌స్థ వ‌ల్లే ఇదంతా జ‌రుగుతోంది. నిర్ణీత వ్య‌వ‌ధిలో అర్హుల‌కు సంక్షేమ ఫ‌లాలు అందించాల్సిందేన‌ని ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధే దీనికి కార‌ణం.

అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను ఆదుకునే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధికి అనుగుణంగా వలంటీర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెలలో పింఛన్ల పంపిణీ రెండో రోజైన మంగళవారం నాటికి 96.36 శాతం మందికి పూర్తయింది. 59,32,610 మంది లబ్ధిదారులకు రూ.1,420.95 కోట్లను అందజేశారు. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛను సొమ్ము అందజేయగా.. లబ్ధిదారుల్లో కొందరు అనారోగ్యం వంటి కారణాల వల్ల ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండటంతో వలంటీర్లు దూరాభారాన్ని సైతం లెక్కచేయకుండా వెళ్లి వారికి నగదు పంపిణీ చేస్తుండ‌డం చ‌రిత్ర‌లో నిలిచిపోనుంది.

ల‌బ్దిదారుల క‌ళ్లల్లో ఆనంద భాష్పాలు

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన లబ్ధిదారు పైడి అప్పలనర్సమ్మ కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అప్పలనర్సమ్మ అతడితోపాటు ఆస్పత్రిలోనే ఉండటంతో వలంటీర్‌ రమణ మంగళవారం కేజీహెచ్‌కు వెళ్లి పింఛను సొమ్ము అందించాడు. దీంతో న‌ర్స‌మ్మ ఆనందానికి హ‌ద్దుల్లేవ్. వ‌లంటీర్ సేవ‌కు ఫిదా అయ్యారు. జ‌గ‌న్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చిలకపాడు గ్రామానికి చెందిన లబ్ధిదారు బొల్లినేని వీరనారాయణమ్మ హైదరాబాద్‌లో గుండె శస్త్ర చికిత్స చేయించుకోగా.. వలంటీర్‌ సిద్దారపు ఇసాక్‌ సొంత ఖర్చులతో అక్కడికి వెళ్లి పింఛను సొమ్ము అందించాడు.

అనారోగ్యంతో కుమార్తె ఇంట్లో ఉండిపోయిన అవ్వ‌కు..

పెందుర్తి సమీపంలోని కృష్ణరాయపురం ఎన్‌ఏడీ కాలనీకి చెందిన వడ్డాది జగ్గయ్యమ్మ (86) మూడు నెలల క్రితం పెద్దాపురంలోని సోదరి కుమార్తె ఇంటికి వెళ్లింది. అనారోగ్యానికి గురి కావడంతో అక్కడే ఉండిపోయింది. మూడు నెలలుగా పింఛన్‌ ఇచ్చేందుకు వెళుతున్న సచివాలయ సిబ్బంది, వలంటీర్‌కు ఆమె ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో స్థానికులను ఆరా తీయగా తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఉన్నట్లు తెలిసింది. దీంతో వార్డు వెల్ఫేర్‌ కార్యదర్శి డొక్కరి వెంకటరావు మంగళవారం పెద్దాపురం వెళ్లి జగ్గయ్యమ్మకు మూడు నెలల పింఛను అందించారు.

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ములకేడు వలంటీర్‌ చిరంజీవి తిరుపతికి వెళ్లి మరీ స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న కిడ్నీ వ్యాధి బాధితుడు శ్రీనివాసులుకు పింఛను అందజేశాడు. ఇదే జిల్లాలోని అమరాపురం మండలం హలుకూరు వలంటీర్‌ హనుమంతరాయ బెంగళూరులో చికిత్స పొందుతున్న కరియమ్మకు పింఛను అందించారు. చిత్తూరు జిల్లా కంభంవారిపల్లె గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి అనే లబ్ధిదారు పక్షవాతంతో బెంగళూరులో చికిత్స పొందుతుండగా వలంటీర్‌ భానుప్రకాష్‌ అక్కడికి వెళ్లి పింఛను అందించారు. వీరంతా అప్ప‌టికే ప‌లు ర‌కాల బాధ‌ల్లో ఉన్నారు. ఇంటి వ‌ద్ద ఉండ‌లేని ప‌రిస్థితి. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన వ‌లంటీర్లు వారు ఎక్క‌డున్నారో తెలుసుకుని అక్క‌డికే వెళ్లి పింఛ‌ను సొమ్ములు అందివ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.