iDreamPost
android-app
ios-app

విలువలతో కూడిన రాజకీయం

  • Published Nov 27, 2019 | 7:06 AM Updated Updated Nov 27, 2019 | 7:06 AM
విలువలతో కూడిన రాజకీయం

గత నాలుగురోజుల్లో మహారాష్ట్రలో జరిగిన ఫిరాయింపులు,క్యాంపు రాజకీయాలు చూసిన వారికి ఆశ్చర్యం కలగపోవచ్చు,కారణం ఫిరాయింపు రాజకీయాలు తరుచుగా జరగటమే.గతంలో కాంగ్రెస్ చేసిన ఫిరాయింపు రాజకీయాలను ఇప్పుడు బీజేపీ కూడా ప్రోత్సహిస్తుంది.

ఒక్క మహారాష్ట్రలోనేనా, అరుణాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ , గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా సంకీర్ణానికి అవకాశం ఉన్న ప్రతిచోటా కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాల్ని కమలఛాయలోకి తెచ్చుకోటానికి బీజేపీ అన్నిరకాల మార్గాలను ఉపయోగించుకొన్నది. అందుకోసం అత్యున్నత చట్ట వ్యవస్థల్ని అడ్డగోలుగా వాడుకొంటుందన్న ఆపప్రధ కూడా దేశంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాల భారంతో సమానంగా మూట గట్టుకొంది .

Read Also: మహారాష్ట్ర – సుప్రీం చెప్పిన సత్యాలు

మరోపక్క పూర్తి మెజారిటీతో అధికారాన్ని చేపట్టిన ప్రాంతీయ పార్టీలకు కేంద్రం నుండి రావాల్సిన నిధులు సక్రమంగా ఇవ్వకుండా కొర్రీలు వేస్తూ అభివృద్ధి నిరోధకంగా మారి ఆ ప్రభుత్వాలని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు విదితమే , ఆయా ప్రభుత్వాలపై మతతత్వ శక్తులతో నిరాధార ఆరోపణలు చేయిస్తూ అస్థిర పరిచే కుట్రలకు తెర లేపుతుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి .

అలాగే గత ఐదేళ్లలో మన రాష్ట్రంలో టీడీపీ నేత బాబు గారిని చూస్తే ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కొని అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇంకా మరికొందరిని కూడా లాగే ప్రయత్నం చేయడం భంగ పడటం కూడా మనకు తెలిసిందే . ఈ విషయంపై వైసీపీ పార్టీ ఇది చట్టవిరుద్దం అని, విలువలు లేని రాజకీయం అని పదే పదే స్పీకర్,గవర్నర్లకు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకి మొర పెట్టుకొన్నా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టే తప్ప ప్రయోజనం లేకుండా పోయింది .
వైసీపీ నుంచి ఫిరాయించిన వారిలో నలుగురు చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులు అయినా కూడా నాటి స్పీకరుకు ఫిరాయింపులు జరిగినట్లు కనిపించలేదు.

Read Also: ఏముంది బాబూ..అక్క‌డ?

మన పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సైతం ఫిరాయింపుల్ని ప్రోత్సహించి టీడీపీ , కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలను ఎడాపెడా లాక్కుని వారిలో కొందరికి మంత్రి పదవులివ్వడం గమనార్హం . హాస్యాస్పదం ఏంటంటే తెలంగాణాలో కేసీఆర్ తమ ఎమ్మెల్యేలను లాక్కోవడం వారి చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం అన్యాయమని, తమ ఎమ్మెల్యేలని టిఆర్ఎస్ లాక్కోవడం ఎవరికో పుట్టిన బిడ్డకి తండ్రి మేమే అని చెప్పుకోవడం ఒకటే అని తిట్టిపోసిన టీడీపీ, ఆంధ్రాలో అదే పనిచేసి అడ్డంగా సమర్ధించుకోవడం చూసిన వారికి రాజకీయ వ్యభిచారం అనే పదానికి సరైన నిర్వచనం కనపడి ఉంటుంది .

కాలం గిర్రున తిరిగింది కేంద్రంలో అదే బీజేపీ అధికారంలోకి వచ్చింది . మళ్లీ ఫిరాయింపు రాజకీయాలను పెంచి పోషిస్తుంది . పక్కన తెలంగాణలో మళ్లీ టిఆర్ఎస్ వచ్చింది . ఇతర పార్టీల నుండి వచ్చిన నేతల్ని ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవితోనే తన పార్టీలో చేర్చుకొంటుంది . ఇతర రాష్ట్రాల్లో సైతం అధికార పక్షాలు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఇదే తరహా నీతి బాహ్య రాజకీయాలు చేయడం పరిపాటి అయ్యింది .

మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి,

ప్రస్తుతం టీడీపీ 23 స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమై,151 స్థానాల అఖండ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది . ఓడలు బండ్లు అయ్యాయి బండ్లు ఓడలు అయ్యాయి . గతంలో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కొన్నట్టే ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కొనే అవకాశం జగన్ కి వచ్చింది . రావటం కూడా అలాంటి ఇలాంటి అవకాశం కాదు . ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలని లాక్కుంటే టీడీపీకి ప్రతిపక్ష హోదా ఉండదు , 12 మందిని చీల్చి వేరు కుంపటి పెట్టిస్తే టీడీపీ లెజిస్లేటివ్ పార్టీని , అసెంబ్లీలో TDLP కార్యాలయాన్నీ,వైసీపీ తన గుప్పిట్లోకి లాక్కోవచ్చు .అప్పట్లో బాబుగారు రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యింది ఇలాగే. తుదకు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీని,ఆ పార్టీ సకల ఆస్తుల్ని,బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డిపాజిట్లను చంద్రబాబు స్వాధీనం చేసుకున్నాడు.

Read Also: బంద‌రు పోర్టుకి మోక్షం…!

ఇలా ప్రతిపక్షం అన్నది లేకుండా చేసే సువర్ణ అవకాశం తనకు వచ్చినా జగన్ మోహన్ రెడ్డి మాత్రం తను నమ్ముకున్న రాజకీయ విలువలకు కట్టుబడే ఉన్నాడు . ఇతర పార్టీల రాజకీయ నాయకులు తమ పార్టీలోకి రావాలంటే ముందుగా ఆ పార్టీ ద్వారా సంక్రమించిన అన్ని పదవులు వదులుకొని వస్తేనే తమ పార్టీలోకి ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశాడు. 2019 ఎన్నికల ఓటమై తరువాత చంద్రబాబు కుడి ఎడమ భుజాలైన సుజనా చౌదరి,సీఎం రమేష్ ,మరో ఇద్దరు రాజసభ సభ్యులు టీజీ వెంకేష్ మరియు గరికపాటి రామ్మోహన్ రావుతో కలిసి బీజేపీలో చేరి రాజ్యసభలో టీడీపీ శాఖను బీజేపీలో విలీనం చేశారు. రాష్టంలో కూడా టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెలేలు చాలా మంది గోడ దూకటానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి టీడీపీ ఎమ్మెల్యేలను చీల్చి వేరు కుంపటి పెట్టించి టీడీపీ శాసనసభా పక్షం నుంచి మరియు ప్రతిపక్ష నేత హోదా నుంచి చంద్రబాబును తప్పిద్దామని స్వంత పార్టీ వాళ్ళు ప్రేరేపించినా జగన్ వారిని వారించి ,మనం కూడా ఫిరాయింపులు ప్రోత్సహిస్తే బాబు నీతి బాహ్యతకు , తనకు తేడా ఏముంటుందని ప్రశ్నించటం చూస్తే భారత రాజకీయాల్లో కనుమరుగవుతున్న విలువల ప్రాణాల్ని జగన్ పునఃప్రతిష్ట చేస్తున్నాడని చెప్పొచ్చు .

ఏదేమైనా ప్రస్తుత దేశ రాజకీయాల్లో ఇలా ఉన్నత విలువలు , సాంప్రదాయాలు పాటిస్తున్న నిఖార్సయిన రాజకీయ నాయకుడు ఎవరూ అంటే జగన్మోహన్ రెడ్డినే ముందు వరుసలో ఉంటాడంటే అతిశయోక్తి కాదు . మిగతా రాజకీయ నాయకులు కూడా ఈ ప్రమాణాలు పాటిస్తేనే నిజమైన ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమవుతుంది .