తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయమని తెలిసినప్పటికీ.. ముహూర్తం ఇంకా కుదరలేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తారని అత్యధిక మంది ఊహించినప్పటికీ ఈటల నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడ లేదు. ఆయన ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వచ్చారు. తన భవిష్యత్ పై సమాలోచనలు చేశారు. అయితే ఈటల ఈరోజే బీజేపీలో చేరుతాడన్న గ్యారెంటీ మాత్రం రావడం లేదట. అతను వెంటనే నడ్డా సమక్షంలో బిజెపిలో చేరవచ్చు లేదా టిఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాత అధికారికంగా చేరవచ్చని.. అప్పటిదాకా సమయం కోరుతారని అంటున్నారు. బీజేపీ నుంచి బలమైన హామీ కోసం ఈటల వేచి చూస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఆ పార్టీ కూడా రాజేందర్ కు డబుల్ బొనాంజా అందించేందుకు సిద్ధమైందని టాక్ నడుస్తోంది.
ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన ప్రభుత్వం భూ కబ్జా ఆరోపణలతో పాటు, ఆయన కంపెనీల వ్యవహారాల్లోని లొసుగులను సాకుగా చేసుకుని పలు కేసులు ఆయనపై నమోదై అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్కటే ఈటలను రక్షించగలదు. ఆయన బీజేపీలో చేరేందుకు ఇది ఓ కారణమైతే, రాజకీయ భవిష్యత్ కు సంబంధించి కూడా బలమైన హామీ బీజేపీ నుంచి దక్కిందన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర కేబినెట్ లో ఈటలకు చోటుతో పాటు ఆయన సతీమణికి హుజూరాబాద్ నుంచి బరిలో దిగడానికి అవకాశం ఇచ్చినట్టుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాజేందర్ సతీమణి జమున కూడా ఇటీవల లైన్ లోకి వచ్చారు. దశాబ్దాలుగా రాజేందర్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ జమున దూరంగానే ఉన్నారు. కానీ ఇటీవలి కాలంలో ఆమె కూడా రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. కేసులు, పోలీసుల నిర్బంధంపై కేసీఆర్ పైనే విమర్శలు చేశారు.
తన స్థానంలో సతీమణిని నిలబెట్టేందుకే ముందస్తుగా ఈటల రాజేందర్ ఆమెను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, హుజూరాబాద్ ఉప ఎన్నికలో జమునను బీజేపీ నుంచి నిలబెట్టేందుకు ఢిల్లీ లో ఉండి రాజేందర్ లైన్ క్లియర్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాగే తనకు కేబినెట్ బెర్త్ కన్‌ఫార్మ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. బీజేపీ కూడా అందుకు సిద్ధంగా ఉందని, అయితే పక్కా హామీ కోసం ఈటల ఎదురుచూస్తున్నారని ఆయన అనుచరుల ద్వారా తెలుస్తోంది. ఇది ఎంత వరకూ అమల్లోకి వస్తుందో ఎదురుచూడాలి.