Idream media
Idream media
రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ బడులను పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోకి మారుస్తామని ప్రకటించగానే అత్యధికులు హర్షం వ్యక్తంచేయగా కొందరు వ్యతిరేకించారు. అయితే వ్యతిరేకిస్తున్నవారిలో ఎక్కువమంది తమ పిల్లలని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నవారే. తాము మాత్రం ఇంగ్లీష్ మాధ్యమం ద్వార అవకాశాలు అందిపుచ్చుకోవాలి, పేదపిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదువుతూ భాషని ఉద్దరించటానికి నడుంకట్టాలి. ఇదెక్కడి హిపోక్రసీనో వాళ్లే చెప్పాలి. తెలుగు-ఇంగ్లీష్ మాధ్యమాల మధ్య జరుగుతున్న చర్చకి రాధాకృష్ణ తన ‘కొత్తపలుకు’లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ ఇందులో మతకోణానికి కాల్పనిక చేశారు.
గవర్నమెంట్ బడులు ఆంగ్లమాధ్యమంలోకి మారితే మతమార్పిడి పెద్ద ఎత్తున జతుగుతుందని, జగన్ క్రైస్తవుడు కాబట్టి BC కులాలని కూడా మతం మారిస్తే ఇక తనకి రాజకీయంగా ఎదురుండదని విశ్లేషించారు. తీరా ఆర్టికల్ మొత్తం ఎంత వెతికినా గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ద్వార మతమార్పిడి ఎలా జరుగుతుందో మాత్రం ఎక్కడా రీజన్ ఇవ్వకుండానే తన అరపేజీ వ్యాసాన్ని ముగించారు. పాఠకులకు ఎంతోకొంత ఇంటెలెక్చువల్ సమాచారాన్ని అందించేవి ఎడిట్ పేజీలు. అయితే అక్కడ రీజనబుల్ సమాచారాన్ని ఇవ్వకుండ ప్రజల ఎమోషన్లని ఆకర్షించేలా మొదటి పేజీలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వాక్యాలని హైలైట్ చేసి రాయడం, రాసిన వ్యాసంలో ప్రజలను ఆలోచింపజేసే బలమైన సపోర్టింగ్ ఐడియాలు ఉండకపోగా తప్పుడు ఉదాహరణలు ఇవ్వడం ఒక వార్తాసంస్థ అధిపతికి చెల్లదు.
Also Read: ఇంగ్లీష్ మీడియం-భిన్న అభిప్రాయం
అసలు ప్రభుత్వవిద్య ఆంగ్లమాధ్యమంలోకి మారితే మతమార్పిడి నిజంగా జరుగుతుందా? ఆంగ్లేయులు, ఆ తరవాత గత రెండున్నర దశాబ్దాల క్రితం వరకు మిషనరీ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియంలో క్వాలిటీ బోధన చేశాయి.బ్రిటీష్ పాలనలో మొదలైన ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో మొదటి నుండి చదువుకున్నది ఎవరు? స్వాతంత్రానంతరం మిషనరీ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నది ఎవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు అప్పుడప్పుడే ఎదుగుతున్న నేటి OCలే . వారిలో ఎంతమంది మతం మార్చుకున్నారు? ఎంతమంది క్రైస్తవులుగా మారారు? గత వంద సంవత్సరాల్లో ఇంగ్లీష్ మీడియం చదివినవారందరూ లేదా చదివినవారిలో సగం మంది క్రైస్తవులుగా మారినా నేడు దేశంలో క్రైస్తవజనాభా ఎంత పెరిగి ఉండాలి? లయోలా, St. థెరిసా, St. జోసఫ్స్, St. ఆన్స్ మొదలగు మిషనరీ పాఠశాలలు, కాలేజీలు కొన్ని దశాబ్దాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు పిల్లల ప్రవర్తన విషయంలో కూడా చాలా శ్రద్ద కనబరిచే విద్యాసంస్థలుగా గుర్తింపు పొందాయి. లయోలా లాంటి కాలేజీల్లో చదువుకున్న తమిళ్ హీరో సూర్యలాంటివారు చాలామంది ఇంకా ఉన్నారు. వారిలో ఎవరైనా మతం మార్చుకున్నామని ప్రకటించారా? లేదే.
Also Read : ప్ఛ్…అమెరికా వెళ్లే వారంతా మతం మారితే ఎట్లబ్బా?
మన దేశంలో పుట్టి కెనడాలో గొప్ప రచయిత్రిగా పేరు తెచ్చుకున్న భారతీ ముఖర్జీ ‘డిజైరబుల్ డాటర్స్’ అనే తన నవలలో తన యొక్క బ్రాహ్మణ పుట్టుక, జీవితం గురించి చాలా గొప్పగా చెప్తారు. ఆవిడ చదువుకున్నది లొరెటో అనే మిషనరీ పాఠశాలలో. మిషనరీ పాఠశాలలో చదువుకున్నంతమాత్రాన తన కులాన్ని, తన మతాన్ని ఆవిడ వదులుకున్నారా? వదులుకోకపోగా తన కులం పట్ల ఎంత స్పృహతో ఉన్నారో తన నవలలో ఆవిడే తేటతెల్లం చేశారు.
అయినా మిషనరీ స్కూలుని గవర్నమెంట్ స్కూలుతో పోల్చడం ఎంతవరకు సమంజసం? గవర్నమెంట్ బడుల పనితీరు, వాటి నియమనిబంధనలు మిషనరీ బడులతో ఏకీభవంచవని వ్యాసకర్తకు తెలియదా? మతసంస్థలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో చదువుతోపాటు తమ మతాన్ని ప్రచారం చేసుకునే వెసులుబాటు ఉందని వ్యాసకర్తకు తెలియదా? RSS నిర్వహించే పాఠశాలల్లో, మదర్సాల్లో, మిషనరీ పాఠశాలల్లో మతప్రచారం జరుగుతుంది, ఆ వెసులుబాటు రాజ్యాంగమే ఆయా మతసంస్థలకు ఇచ్చింది. కాని గవర్నమెంట్ పాఠశాల విధానం వేరు కద. అక్కడ మతానికీ, మతప్రచారానికీ చోటు లేదు. బడి పూర్తి సెక్యలర్ వాతావరణంలో పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ అభివృద్ది చెందేలా జరగాలి. అలాంటి గవర్నమెంట్ పాఠశాలలో ఏవిధంగా మతప్రచారానికీ, మతమార్పిడికి అవకాశం ఉంటుంది?
నిజానికి నేడు ప్రభుత్వపాఠశాలల్లో సరస్వతీ దేవి విగ్రహాలు నెలకొల్పడం ద్వార, అసంబ్లీలో సరస్వతీ నమస్తుభ్యం వంటి శ్లోకాల ద్వార, పదోతరగతి పరీక్షలప్పుడు బడిలో పూజలు చేయడం జరుగుతుంది.ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వలన మేరీ మాత లేక ఏసు క్రీస్తు విగ్రహాలు పెడతారన్నట్లు రాధాకృష్ణ వాదన ఉంది. సరస్వతి పూజల గురించి ఎప్పుడు మాట్లాడని రాధాకృష్ణ ఇప్పుడు అభూత కల్పనలు సృష్టిస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో మతప్రచారం నిషేధం కాబట్టి రేపు ప్రభుత్వం మతప్రచారమే మొదలు పెడితే చట్టం, కోర్టు చూస్తూ ఊరుకుంటాయా? రాధాకృష్ణ లాంటివారు తమ ‘క్రొత్తపలుకు’లో ప్రశ్నించరా? ప్రజాస్వామ్యవాదులు, హేతువాదులు, అకడమీషియన్లు చూస్తూ కూర్చుంటారా?
Also Read: పదకొండోవాడిగా మిగిలిపోయే దురదృష్టం
రాధాకృష్ణ గారి వ్యాసంలో ఎడ్యుకేషన్ కన్నా రాజకీయ కోణం ఎక్కువ కనబడుతుంది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్నది ఎక్కువగా SC, ST, BCలు. ఎటూ SC, STలు ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్నారు అనడం, ఎటువంటి కారణం చూపకుండా BCలను ఇంగ్లీష్ మీడియం ద్వార మతమార్పిడి చేస్తారు అని ప్రభుత్వం మీద నెపం మోపడం BCలని భయభ్రాంతులకు గురిచేయడం కాదా? దేశజనాభాలో సుమారు 50% ఉన్న BCలు BJPకి ఓటుబ్యాంకుగా, వెన్నుదన్నుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వీరిని ఎవరికి దగ్గర చేయడానికి వాళ్లని అభివృద్ది వైపు ఆలోచించనీయకుండా మతం మత్తులోనికి వారిని నెడుతున్నారు?
ఎలిమెంటరీ స్థాయి నుండీ నేను లోకల్గా నెలకొల్పబడిన ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుకున్నాను. మా టీచర్లు ఇంగ్లీషులో చదివి తెలుగులో పాఠం చెప్పేవారు. ఆంగ్లభాషా సాధన లేకపోవడం వలన PGకి వెళ్లేవరకు నా ఇంగ్లీష్ వాక్యనిర్మాణం అంతా తప్పుల తడక. మా ఊరులోనే ఉన్న St.Johns ఇంగ్లీష్ మీడియం స్కూలు చాలా ఫేమస్. కాని మిగతా ప్రైవేటు స్కూల్సుకంటే ఫీజులు కొంచం ఎక్కువగా ఉండుటవలన మేమ అక్కడ చేరలేని పరిస్థితి. ఆ పాఠశాలలో చదివే పిల్లలు ఇంగ్లీషులో చాలా ముందంజలో ఉంటారు. ఎలిమెంటరీ స్థాయి నుండే ఆంగ్లంలో సంభాషించగల నైపుణ్యం సంపాదించేవారు. పెద్దయ్యాక విదేశాల్లో, మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డవాళ్లు ఆ స్కూల్ నుండి నేటికీ చాలా ఎక్కువగా ఉంటారు. ఓపెన్ క్యాటగిరీ విద్యార్థులు ఎక్కువగా చదువుకునే ఆ బడిలో మతమార్పిడి జరిగిన ఉదంతాలు ఈరోజుకీ ఒక్కటీ లేదు.
Also Read: విద్య- ప్రభుత్వ బాధ్యత-ఇంగ్లీష్ మీడియం
–Joshua Daniel