అసలు విద్య అంటే ఏమిటి? భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మెరుగు పరచటమేనా విద్యా వ్యవస్థ లక్ష్యం? అంతకు మించి మరేమి లేదా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్న వారి వాదనలు వింటుంటే కలుగుతున్న సందేహాలు ఇవి.
పిల్లలకు ఇంగ్లీష్ చదువుల కోసం సొంత ఊరు వదులుతున్నారు, మధ్య తరగతి వారు పేదవాడుగా మారుతున్నాడు, అప్పుల పాలవుతున్నాడు. ఇది కేవలం ఆంగ్లం మీద మోజు కాదు, మారిన కాలంలో ఆ భాషకు పెరిగిన ప్రాధాన్యం అటువంటిది. ఇంటర్నెట్ యుగంలో, గూగుల్ కాలంలో ఏది తెలుసుకోవాలన్నా, నేర్చుకోవాలన్న ఇంగ్లీష్ తప్పని సరి. గతంలో ఫలానా వారు మాతృభాషలోనే చదివారు, లేక ఫలానా దేశాలలో మాతృభాషనే వాడుతున్నారు అనేవి చెల్లని వాదనలు. నేడు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెడితే ఆ విద్యార్థి అవకాశాల ప్రపంచంలోకి వచ్చేది షుమారు మరో 20 ఏళ్ల తర్వాత. అప్పటికి కూడా ఏ మార్పు జరక్కూడదు అని ఎవరూ అనుకోకూడదు. ఈ రోజు ఏ తండ్రినైనా నీ పిల్లవాడ్ని ఏ మీడియం స్కూల్లో చేర్పిస్తారు అని అడిగితే వచ్చే సమాధానం అందరికి తెలిసిందే. ఇక్కడ ఆ తండ్రి భాద్యతనే ప్రభుత్వం తీసుకొంది. మధ్య తరగతి నుంచి పేద ప్రజలకు ఇది చాలా ఊరట నిచ్చే నిర్ణయం అనే దానిలో సందేహమే లేదు. అంతవరకు ప్రభుత్వాన్ని అభినందించాలి.
Also Read: విద్య- ప్రభుత్వ బాధ్యత-ఇంగ్లీష్ మీడియం
ప్రభుత్వం ఒక తండ్రిగా తన భాధ్యతల్ని నిర్వర్తించింది కానీ, ప్రభుత్వం అంతకన్నా పెద్దది అనే విషయం మరిచిపోయిందేమో! విద్య అంటే విజ్ఞాన సముపార్జన. ఒక పిల్లాడిలో సృజనాత్మకత పెంచటం, ప్రతి విషయాన్ని ప్రశ్నించటం, ఆ ప్రశ్నల నుంచి వచ్చే సమాధానాల నుంచి సమాజం మీద అవగాహన పెంచుకునే తృష్ణ అలవాటు చెయ్యటం, ఒక విద్యార్థిని ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దటం విద్యా వ్యవస్థ లక్ష్యం కావాలి కానీ ఉద్యోగాల దృష్టితో ఒక బాష నేర్పటమో, రెండు సబ్జెక్టులను నేర్పి ఒక డిగ్రీ ఇచ్చి పంపటమో కాదు.జమే, ఉద్యోగ అవసరాల కోసం మాత్రమే కాదు, రేపటి రోజున తన వృత్తిలో పైకి రావాలన్నా ఇంగ్లీష్ అవసరమే, కానీ ప్రభుత్వానికి వీటితో పాటు మాతృభాషని, మన సంస్కృతిని కాపాడాల్సిన భాద్యత కూడా ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెట్టటం వలన తెలుగు భాష, సంస్కృతి అంతమయిపోతాయా? కానే కావు, కానీ ప్రభుత్వం అలా ప్రశ్నించే వారి విషయంలో సరిగా స్పందించలేదు, వారి సందేహ నివృత్తి చెయ్యటానికి ఏమీ చెయ్యలేదనేది నిజం. అసలు ఏ ఏ సబ్జెక్టులు ఇంగ్లీష్ లో చెప్పబోతున్నారు, తెలుగు అనేది ఎంత ఉండబోతుంది వంటి వాటిలో ఎటువంటి స్పష్టత ఇవ్వటం లేదు ప్రభుత్వం. దీనిని కేవలం పేద ధనిక వర్గాల మధ్య అంశంలా మాట్లాడటం ప్రభుత్వానికి శోభనివ్వదు. 7-8 తరగతుల వరకు రెండు బాషలని సంతులనం చేసుకొంటూ తర్వాత ఇంగ్లీష్ ప్రాధాన్యం పెంచితే బాగుంటుందేమో అని ఆలోచించాలి.
సమాజంలో అందరు పన్నులు కడుతున్నారు, అందరికీ ప్రభుత్వం భాద్యత వహించాలి. ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి. రేపు వందమందిలో ఒకరికి తనకు తెలుగు మీడియం స్కూల్లో చదువుకోవాలనిపిస్తే ఎక్కడికి వెళ్ళాలి? ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రత్యామ్నాయం చూపలేకపోతే అది నిర్బంధ ఇంగ్లీష్ విద్య అవుతుంది. ఒక పౌరుడి హక్కుల్ని కాల రాచినట్లు అవుతుంది
–Written By Ramesh Adusumilli.