Idream media
Idream media
తెలుగు సహా ఎనిమిది ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తూ అఖిల భారత సాకేంతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఉత్తర్వులు జారీ చేయడం విద్యావేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, కన్నడ, మలయాళీ, తమిళ మాద్యమంలో ఈ ఏడాది (2021–2022) నుంచే విద్యను అభ్యసించేందుకు ఏఐసీటీఈ అవకాశం కల్పించింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 500 కాలేజీలు ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ విద్యను బోధించేందుకు అవకాశం కల్పించాలని దరఖాస్తు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీటీఈ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా ఆయా మాతృభాషల్లో విద్యార్థులు ఇంటర్ వరకూ చదువుకుని, ఇంజనీరింగ్ ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సి రావడంతో వారు రాణించలేకపోతున్నారని ఏఐసీటీఈ పేర్కొంది.
మాతృభాషల్లో ఉన్నత విద్యనభ్యసించే అవకాశం కల్పించడంతో భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నా.. విద్యా నిపుణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో పోటీ పెరిగింది. ఉద్యోగ వేటలో కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. మల్టినేషన్ కంపెనీలు సైతం తమ కార్యకలాపాలను ఆయా దేశాల్లోనే నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంపాదించి, అందులో రాణించాలంటే అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీష్‌లో చదవడం ఎంతో ముఖ్యం.
ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలో ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు.. తర్వాత ఉద్యోగ వేటలో పోటీ పడేందుకు కమ్యూనికేషన్‌స్కిల్స్‌ను ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నత విద్యను చదవిన విద్యార్థుల పరిస్థితి ఇలా ఉంటే.. ప్రాంతీయ భాషలో చదవబోయే విద్యార్థుల భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ విద్యను బోధించేందుకు.. పాఠ్యపుస్తకాలను ఆయా భాషల్లో తర్జుమా చేయాలని కూడా ఏఐసీటీఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇది ఎంత వరకు సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లీష్ టెర్మినాలజీని ప్రాంతీయ భాషల్లో విద్యార్థులు అర్థం చేసుకోవడం, దాన్ని తమ ఉద్యోగ వేటలోనూ, ఉద్యోగం చేసే సమయంలోనూ ఉపయోగించడం కష్టతరమైన పని. అందరూ ఒక దారిలో నడుస్తుంటే.. ప్రాంతీయ భాషల్లో విద్యనభ్యసించే వారు ప్రత్యేకమైన మార్గంలో నడవాల్సి ఉంటుంది. మరి ఇలాంటి విద్యార్థులకు కంపెనీలు ఎంత వరకు అవకాశాలు ఇస్తాయనేది ఇట్టే ఊహించుకోవచ్చు. ఇంగ్లీష్‌లో రాసిన పుస్తకాన్ని తెలుగులో తర్జుమా చేసేందుకు అనువాదకులు అష్టకష్టాలు పడుతుంటారు. అయినా భావం పూర్తిగా రాదు.
ఇంజనీరింగ్ విద్యలో ఆది నుంచి ఉన్న సాంప్రదాయ కోర్సులు ప్రస్తుత అవసరాలకు సరిపోదని, నూతన కోర్సులను కూడా ఏఐసీటీసీ ప్రవేశపెట్టింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. సాంప్రదాయ కోర్సులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం, అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నా.. ఇంగ్లీష్ మీడియంలో ఉన్నత విద్యను చదవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ విద్యను ప్రవేశపెట్టాలని ఎవరు సిఫార్సు చేశారన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఇదే జరిగి.. ప్రాంతీయ భాషలోనే ఇంజనీరింగ్ చదివితే.. ఆయా విద్యార్థులు భారీగా నష్టపోతారు. ఈ నిర్ణయం విద్యార్థులను మోసం చేయడమేననే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రాంతీయ భాషలో చదివిన ఇంజనీరింగ్ పట్టా వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు.
Also Read : బాబు నువ్వు వద్దు,నీ మద్దతు వద్దూ