iDreamPost
android-app
ios-app

ఎనర్జిటిక్ స్టార్ కమర్షియల్ డెసిషన్

  • Published Mar 20, 2021 | 5:52 AM Updated Updated Mar 20, 2021 | 5:52 AM
ఎనర్జిటిక్ స్టార్ కమర్షియల్ డెసిషన్

ఇస్మార్ట్ శంకర్ కు ముందు ఒక లెక్క తర్వాత ఒక లెక్క అన్నట్టుంది ఎనర్జిటిక్ స్టార్ రామ్ పరిస్థితి. ఊర మాస్ అవతారంలో తన నటనకు ప్రేక్షకులు ఫుల్ మార్కులు ఇవ్వడంతో అలాంటి కథలపైనే రామ్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. కమర్షియల్ గానూ అవే ఎక్కువ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ కోణంలోనే ఇమేజ్ ని డెవలప్ చేసుకునే పనిలో ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు లింగుస్వామి డైరెక్షన్ లో చేస్తున్న మూవీ కూడా యాక్షన్ ఎంటర్ టైనరని టాక్. పందెం కోడి తరహాలో అన్ని అంశాలు పొందుపరిచి క్లాసు మాస్ లేకుండా అందరిని టార్గెట్ చేసే తరహాలో స్క్రిప్ట్ పక్కాగా లాక్ చేసుకున్నాకే అనౌన్స్ చేసినట్టు సమాచారం.

ఇందులో ఉప్పెన సంచలనం కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపిక కావడం కూడా హైప్ పెరగడానికి కారణం అవుతోంది. దీని సంగతలా ఉంచితే ఇదయ్యాక రామ్ బోయపాటి శీనుతో ఓ సినిమా చేయొచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది.ఆల్రెడీ డిస్కషన్ అయ్యిందని, బోయపాటి బాలకృష్ణ సినిమా విడుదలయ్యాక దీని మీదే పూర్తిగా వర్క్ చేయబోతున్నట్టు తెలిసింది. అధికారిక ప్రకటన ఇప్పుడే రాకపోయినా రానున్న రోజుల్లో ఏదో ఒక పండగ సందర్భంగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. మాస్ పల్స్ మీద బోయపాటికున్న పట్టు తెలిసిందే. అందుకే ఇస్మార్ట్ ఇమేజ్ ని ఇంకా పెంచాలంటే ఇలాంటి దర్శకులతో డీల్ చేయడం అవసరం.

వినయ విధేయ రామా ఎంత డిజాస్టర్ అయినప్పటికీ బోయపాటి డిమాండ్ మరీ దారుణంగా పడిపోలేదు. ఒకవేళ బాలయ్య సినిమా బ్లాక్ బస్టర్ అయితే మళ్ళీ స్టార్ హీరోలు పిలిచి మరీ చేద్దాం అంటారు. ఇది ముందుగా ఊహించే రామ్ ఇతన్ని లాక్ చేసి ఉండొచ్చు. పైగా ఇప్పుడు టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న డైరెక్టర్లందరూ తమ తమ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. ఇంకో ఏడాదికి పైగా అందుబాటులోకి వచ్చే సీన్ కనిపించడం లేదు. అలాంటప్పుడు బోయపాటిని కూడా చేజార్చుకుంటే నష్టం ఎక్కువవుతుందని వెంటనే నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. రెడ్ సేఫ్ అయినా రామ్ ఆశించిన అద్భుతం దాన్నుంచి జరగలేదు కాబట్టి ఈ రెండు సినిమాల మీద గట్టి దృష్టే పెట్టాలి మరి