ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మధ్య 11వ పీఆర్సీ విషయంలో భేదాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చి తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి వెల్లడించాయి. పెద్ద ఎత్తున విజయవాడలో నిరసన కార్యక్రమం చేపట్టినా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఇక ఈ రోజు మధ్యాహ్నం ఉద్యోగం సంఘాల స్టీరింగ్ కమిటీతో ప్రభుత్వం చర్చకు ఆహ్వానించింది. దాదాపు ఏడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.
దీంతో స్టీరింగ్ కమిటీ సమ్మె విరమణ ప్రకటన చేసింది. లిఖితపూర్వకంగా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె విరమిస్తున్నట్లు వెల్లడించారు. సమ్మె నోటీసులో పేర్కొన్న అంశాలపై ప్రభుత్వం స్పందించిందని ఈ నేపథ్యంలోనే వెనక్కి తగ్గుతున్నామని అంటూ ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఇక ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిగిన చర్చల్లో భాగంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లు సవరణ ప్రతిపాదనలు వచ్చాయి, దాని ప్రకారం 70 నుంచి 74 ఏళ్ల పెన్షనర్లకు 7 శాతం అదనంగా పెన్షన్, 75 నుంచి 79 ఏళ్ల పెన్షనర్లకు 12 శాతం అదనపు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. పీఆర్సీ రిపోర్ట్ ని జివో జారీ చేసిన తర్వాత ఉద్యోగ సంఘాలకు ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.
గతంలో నిర్ణయించిన పీఆర్సీ 23 శాతం కొనసాగుతుందని, హెచ్ఆర్ఏ విషయంలో ఉద్యోగస్తుల కోరిక మేరకు మార్పులు జరిగాయని సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. అలాగే పీఆర్సీ ప్రతి ఐదు ఏళ్లకు చేసేలా ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. హెచ్ఆర్ఏ స్లాబ్ 10, 12, 16, 24 శాతం, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ హెచ్‌వోడీ, సెక్రటేరియట్ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ 24 శాతం ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేశారు. చేసింది. ఈ క్రమంలో మంత్రుల కమిటీ, స్టీరింగ్ కమిటీ ఉమ్మడి ప్రెస్‌మీట్ నిర్వహించగా సమ్మె విరమిస్తున్నట్టుగా స్టీరింగ్ కమిటీ సభ్యులు కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య చర్చలు విజయవంతంగా పూర్తయ్యాయని ఉద్యోగులు తమ తమ విధులకు హాజరు అవుతారని వెల్లడించారు.