iDreamPost
iDreamPost
లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాలకి వచ్చే రోజువారీ ఆదాయం ఒక్కసారిగా ఆగిపోవడంతో రాష్ట్ర ఖాజనాలు నిండుకుంటున్నాయి. ఒక వైపు సంక్షేమ పథకాలు మరో వైపు అభివృద్ధి పనులు కు నిధులు భారీగా ఖర్చు అవుతుండగా ఇప్పుడు ఉద్యోగస్తుల జీతాలకి కటకటలాడే పరిస్థితి దాదాపు అన్ని రాష్ట్రాల్లో చోటు చేసుకొంది . ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల్లో అత్యధిక భాగం ఉద్యోగుల జీతభత్యాలకి పెన్షన్లకి పోతుంది . తరువాతి స్థానం సామాజిక పెన్షన్లు , సంక్షేమ పధకాలది . ఆ తరువాత ప్రాధాన్యతాక్రమాలని బట్టి అభివృద్ధి కార్యక్రమాల వంతు.
ఆదాయంలో అత్యధిక భాగం జీతభత్యాలకి , సంక్షేమ పథకాలకి పెడుతున్న రాష్ట్రాలు లాక్ డౌన్ కారణంగా ఒక్కసారిగా ఆదాయం ఆగిపోయేసరికి రేపు నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో పడ్డాయి . పలు రాష్ట్రాలు ఇదే స్థితిలో ఉండి ఈ నెల జీతాల్లో కోత పెట్టొచ్చు అని వార్తలొస్తున్నా ముందుగా తెలంగాణా సీఎం కేసీఆర్ ధైర్యం చేసి ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి కోత విధించాడు .
మరికొన్ని రాష్ట్రాలు కూడా కేసీఆర్ బాటలో కోత విధించవచ్చని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది . అందులో ఆంధ్రా కూడా ఒకటి . రోజువారీ ఆదాయం కోల్పోయి ప్రస్తుతం ఉన్న క్లిష్ట ఆర్ధిక పరిస్థితిలో ఖర్చు తగ్గించటానికి ఉద్యోగుల జీతభత్యాలలో కోత విధించక తప్పని స్థితి .
అనధికార సమాచారం ప్రకారం లాక్ డౌన్ సందర్భంగా క్షేత్ర స్థాయిలో పూర్తి సమయం విధులు నిర్వహిస్తున్న పోలీస్ , పబ్లిక్ హెల్త్ రంగాల వారికి కోత లేకుండా పూర్తి జీతం ఇస్తూ , లాక్ డౌన్ భాద్యతలు ఎక్కువ శాతం మోస్తున్న పంచాయితీ రాజ్ , మున్సిపల్ విభాగాల ఉద్యోగులకు 30 శాతం , మిగతా అన్ని విభాగాల ఉద్యోగులకు 50 శాతం కోత విధించనున్నారని సమాచారం .అలాగే రిటైర్మెంట్ పెన్షన్స్ లో 50 శాతం , నాన్ రెగ్యులర్ ఉద్యోగస్తులు , వర్క్ ఇంచార్జ్ ల జీతాల్లో 10 నుండి 20 శాతం కోత ఉండవచ్చని సమాచారం .
జీతాల్లో కోత పడుతుందన్న సమాచారంతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. అకస్మాత్తుగా జీతంలో కోత పడితే ఇబ్బందులు పడతామని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ను కలసి తమ సమస్యలను విన్నవించేందుకు సచివాలయ ఉద్యోగులు సిద్ధమైయ్యారు. ఈ నెల పూర్తి జీతం ఇవ్వాలని, వచ్చే నెలలో కోత విధించాలని విజ్ఞప్తి చేయనున్నారని సమాచారం. గత నెల (టాక్స్ కట్టింగ్స్ ఫిబ్రవరి ,మార్చ్ లో ఎక్కువ) జీతంలో ఇన్కమ్ టాక్స్ రూపంలో కోత ఎదుర్కొన్న విషయాన్ని వారు సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులు జీతాల్లో కోత పడుతుందా..? లేదా వచ్చే నెలకు వాయిదా వేస్తారా..? అనేది మరి కొద్దీ గంటల్లో తేలనుంది.