పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు కార్పొరేషన్ మేయర్ పీఠం ప్రతిష్ట్మాకంగా మారింది. ఏ పార్టీకి ఆ పార్టీ ఎన్ని లెక్కలు చెబుతున్నా రాజకీయ సమీకరణాలు పరంగా చూస్తే అధికార పార్టీకే అనుకూలంగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మానేసి, వరుసగా ఉపముఖ్యమంత్రి సమక్షంలో అధికార పార్టీ లోకి చేరడం బలాన్ని చేకూరుస్తుంది.
ప్రతిరోజు టీడీపీ, జనసేన పార్టీల నుంచి వైస్సార్సీపీలో చేరే టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలతో మంత్రి క్యాంప్ కార్యాలయం సందడిగా కనిపిస్తుంది. కొన్ని డివిజన్లలో అభ్యర్థులు, వారి కుటుంబీ కులు సైతం తమ వారిని కాదని అధికార పార్టీ వైపు మొగ్గు చూపడంతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం ఈ సారి నల్లేరు మీద నడకే కానుందని విశ్లేషకుల మాట.
అండగా… ఆదరణ గా!
జిల్లాలో ఒకే ఒక్క నగరపాలక సంస్థ అందులోనూ జిల్లా ముఖ్య కేంద్రం ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల పై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ప్రతిరోజూ ఆయా డివిజన్ల లో జరుగుతున్న కార్యక్రమాలు పార్టీ తీరును సమీక్షిస్తున్నారు. తమతో వచ్చేవారిని కలుపు వెళ్లడం లో భాగంగా ఇతర పార్టీల నుంచి భారీగా నాయకులు కార్యకర్తలు నాని సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరుతున్నా రు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటారని భావిస్తున్న నేతలు సైతం ఉప ముఖ్యమంత్రి వద్దకు వచ్చి కండువాలు కప్పిఎంచుకోవడం విశేషం. ఇద్దరు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు, ఒక జనసేన పార్టీ అభ్యర్థి సైతం ఇటీవల నాని సమక్షంలో పార్టీలో చేరారు. దీంతోపాటు డివిజన్ల వారీగా భారీగా కార్యకర్తలు అధికార పార్టీ లోకి రావడంతో మేయర్ పీఠం ఈసారి సునాయాసంగా దక్కించుకుంటారు అన్న ధీమా కనిపిస్తోంది.
ఇతర మున్సిపాలిటీ లోనూ…
పశ్చిమ గోదావరిలో ఏలూరు కార్పొరేషన్ పీఠంతో పాటుగా ఎన్నికలు జరుగుతున్న పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలను ఖాతాలో వేసుకునేందుకు, ఛైర్మన్ పదవులనూ కైవసం చేసుకునేందుకు వైస్సార్సీపీ నాయకులు పక్కా వ్యూహం తో ముందుకు వెళ్తున్నారు.
కొవ్వూరు డివిజన్ లో మంత్రి తానేటి వనిత అభ్యర్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కొవ్వూరు మున్సిపాలిటీలో వైస్సార్సీపీ ఒక్క సీటు లభించలేదు. దీంతో ఈ మున్సిపాలిటీ మీద మంత్రి ప్రత్యేక దృష్టి సారించి వార్డుల్లో తిరుగుతున్నారు. అలాగే కొవ్వూరు పక్కనున్న నిడదవోలు మున్సిపాలిటీ రాజకీయాల్లోనూ మంత్రి వనిత చురుగ్గా పని చేస్తున్నారు.
మరోపక్క డెల్టా ప్రాంతంలోని నరసాపురం, పాలకొల్లు మున్సిపాలిటీ ల మీద మరో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు దృష్టి పెట్టి నాయకులందరినీ సమీకరించి తగిన బాధ్యతలను ఎప్పటికప్పుడు అప్పగిస్తున్నారు. కొన్ని వార్డులను డివిజన్గా చేసి ఒక్కో పెద్ద నాయకుడికి ఆయన గెలుపు బాధ్యతను ఇస్తున్నారు. దీంతో నాయకులు జాగ్రత్తగా తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించేదుకు గతం ఏర్పడుతోంది.
చుక్కాని లేని నావ..
కీలకమైన ఏలూరు కార్పొరేషన్ జనరల్ మహిళ రిజర్వేషన్ అయ్యింది. వైసీపీ తన మేయర్ అభ్యర్థిని ప్రకటించగా టీడీపీ, జనసేనలు మాత్రం తమ మేయర్ అభ్యర్థులను ప్రకటించలేదు. వచ్చేనెల 3వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ పూర్తవనుండడంతో అప్పటికి బరిలో ఎవరు నిలుస్తారనేది గుర్తించిన తర్వాతే మేయర్ అభ్యర్థిని ప్రకటించాలని టీడీపీ భావిస్తోంది. అయితే ఇప్పటికే టీడీపీకి చెందిన కొందరు అభ్యర్థులు రాత్రికి రాత్రి అధికార పార్టీ లోకి జంప్ అవుతుండడంతో వారిని కాపాడుకోవడమే టిడిపి నాయకులకు సరిపోతుంది.
ఏలూరు మాజీ ఎమ్మల్యే బడేటి బుజ్జి మరణంతో టీడీపీ ఏలూరులో పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన సోదరుడు చంటి కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతను తీసుకున్నా ప్రజాదరణ పెద్దగా కనిపించడం లేదు. నాయకులు సైతం ఆయన వెంట నడిచేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ టీడీపీని వీడి బీజేపీలోకి చేరారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన ఏలూరు మాజీ మున్సిపల్ చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి ఆమె భర్త బలరాం సైతం వైస్సార్సీపీ లోకి వచ్చి కీలకంగా పనిచేస్తున్నారు. దింతో ఏలూరు టిడిపి ను నడిపించే ప్రధాన నాయకులే కరువయ్యారు.
కీలకనాయకులు ఎక్కడా?
జిల్లాలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా ఇప్పటి వరకూ టీడీపీ కీలకనేతలు అభ్యర్థులకు భరోసాగా ప్రచారంలో పాల్గొనలేదు. 2015 పురపోరులో ఎంపీలు మురళీమోహన్, మాగంటి బాబు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లాలోని ఎంఎల్‌ఎలు అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు.
2019 శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యకలాపాలకు సీతారామలక్ష్మి, మాగంటిబాబు, మురళీమోహన్‌లు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో కూడా అభ్యర్థులకు భరోసాగా సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఇక టిడిపి ఎమ్మెల్యేలు గా 2019లో పోటీ చేసి ఓడిపోయిన వారు ఎక్కడున్నారో కూడా కార్యకర్తలకు అంతుబట్టడం లేదు. ఎన్నికల్లో నిలబడే టీడీపీ అభ్యర్థులకు వారికి కనీస మద్దతు ఇవ్వకపోవడంతో పోటీలో ఉన్న వారు సైతం నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇవన్నీ టీడీపీకి ప్రతికూలంశాలుగా మారనున్నాయి.
జనసేన పార్టీ అయోమయం
జనసేన-బీజేపీ కూటమి మేయర్ అభ్యర్థి లేకుండానే ఎన్నికల బరిలోకి దిగాయి. జనసేన గతేడాది నామినేషన్లు వేసినప్పుడు వామపక్షాలతో జతకట్టింది. ఇప్పుడు బిజేపీతో దోస్తీ చేయడంతో ఈ రెండు కలిసి ఏలూరు కార్పొరేషన్‌లో 20 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే ఇప్పటి వరకూ ఈ పార్టీల నుంచి తమ మేయర్ అభ్యర్థి ఫలానా అనే మాటే వినిపించలేదు. దీంతో మేయర్ అభ్యర్థి లేకుండానే ఈ కూటమి బరిలోకి దిగనుంది. మొత్తం ఏలూరు కార్పొరేషన్ లో 50 డివిజన్ లకు సైతం జనసేన బీజేపీ అభ్యర్థులు లేరు. దీంతో ఈ కూటమి కనీస మేయర్ పీఠం మీద ఆశలు పెట్టుకోలేదు. మొత్తంమీద పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య కేంద్రం ఏలూరు రాజకీయాలు అధికార పార్టీ కు అందరం ఎక్కించేలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు మాట.