🎶🎶🎶భద్రాచలం కొండా.. సీతమ్మవారి అండా… కావాలానీకండాదండా…..🎶🎶🎶
ఏకాంబరం : కండాదండా ఎందుక్కానీ కలాకండ ఉంటే పట్రా. తిందాం.
కనకాంబరం : నీకు మరీ ఏలాకోలం బావా. అది మా బాసు పాట తెలుసా?
ఏకాంబరం : నీ స్టీలుకొట్టు ఓనరుకి ఏలంపాట కాకుండా ఈపాటలు కూడా ఉన్నాయేట్రా..
కనకాంబరం : అది కాదెహే.. మా బాసు చిరంజీవి పాట. గాంగ్లీడర్లోది.
ఏకాంబరం : అదిప్పుడెందుగ్గుర్తొచ్చిందంటా??
కనకాంబరం : నిన్న టీవీ సూళ్ళేదా??
ఏకాంబరం : ఏ పార్టీ టీవీ? ఓడినోడిదా గెలిచినోడిదా?
కనకాంబరం : లైవిచ్చినోడిది. నిన్న సరిలేరునీకెవ్వరు ఈవెంట్ జరిగింది కదా.
ఏకాంబరం : అది మయేస్‌బాబు బొమ్మ కదా. సినిమా కొంపదీసి గాంగ్లీడరుకి రీమేకా??
కనకాంబరం : బొత్తిగా జనరల్ నాలెడ్జి లేకుండా పోతందిరా బాబూ.. అనిల్ రావిపూడెప్పుడైనా రీమేకులు చేసాడా?
ఏకాంబరం : అబ్బా… మరి కొత్త స్టోరీలతో ఏమైనా చేసాడా పోనీ?
కనకాంబరం : యెహే ఉండు బావా.. నిన్న పోగ్రాంకి మా బాసు చిరంజీవొత్తేనీ…
ఏకాంబరం : ఒత్తే ఒచ్చేడులే. దానికంత ఇదెందుకు.
కనకాంబరం : ఓరి బాబూ ఇందులో విజయశాంతి మళ్ళీ మొకానికి రంగేసుకుంది. కమ్ బ్యాక్ సినిమా. ఎంత హడావిడో తెలుసా…
ఏకాంబరం : ఆపెయ్… సంగీత కూడా ఇదే సినిమాతో మళ్ళీ రంగేసుకుంది. ఆవిడేమైనా అరుస్తుందా?
కనకాంబరం : నీతో ఇదే వచ్చిందిరా బాబూ.. అరిటాకూ కరేపాకూ రెండూ ఆకులే అంటావ్.
ఏకాంబరం : రెండూ ఆకులు కాపోతే ఒకటేమైనా పేపరు ప్లేటా?
కనకాంబరం : అది కాదు బావా. విజయశాంతి యాక్సనూ.. మహేషు బాబు బొమ్మా.. దానికి చిరంజీవి ఛీఫ్ గెస్టూనూ…
ఏకాంబరం : అవునా.. చూసేవోళ్ళకి అలా అనిపించలేదురా. మహేషే పాపం గెస్టులా పక్కకి నుంచున్నట్టుందంట కదా.
కనకాంబరం : మా బాసొస్తే ఎవరైనా సైడైపోవాల్సిందేనమ్మా. బాసీజ్ బ్యాక్.
ఏకాంబరం : త్రీఇయర్స్ బ్యాకే మీ బాసీజ్ బ్యాకు. ఇపుడు గైటౌటాఫ్ మై మదర్ లాండ్!
కనకాంబరం : అది కాదురా.. అసలు స్పీచిస్తూ నిన్న బాసు మైకు పట్టుకుని, విజయశాంతినొక చేతితో పట్టుకుంటే..
ఏకాంబరం : జనం తలలు పట్టుకున్నారు. ఏంటా మాటలూ అని.
కనకాంబరం : బొత్తిగా ఇదానం లేకండా మాట్లాడత్నావ్ బావా. ఏ రోజైనా చిరంజీవి పధ్ధతి దాటి బిహేవ్ చేసేడా?
ఏకాంబరం : చేయలేదుగా. అందుకే జనం ఆశ్చర్యపోయారు. ఫిగరూ అందం.. అయ్యేం మాటలూ అని.
కనకాంబరం : అది సరదా బావా. ఇపుడు మన టెంత్ క్లాసులో నువ్వు ప్రెండ్సిప్ చేసిన కడలి మాదురి కనపడితే నువ్వు క్లోజుగా మాట్లాడవా?
ఏకాంబరం : ఆడను. అలా చిలిపిగా.. ఫిగరంటూ మాట్లాడితే.. మాటొచ్చేదా..
కనకాంబరం : ఆ ఒక్కటే పట్టుకుంటావేంటెహే.. ఎన్నో మంచి విషయాలు చెప్తేని. రాజకీయాలు శత్రుత్వాలూ, సినిమాలు మితృత్వాలూ అని చెప్పేడా లేదా?
ఏకాంబరం : ఆ అవును సినిమా మితృత్వాలు గురించి మొన్న రాస్సేకరు చెప్పేడు కదా.
కనకాంబరం : ఒక ఫీల్డన్నాక గొడవలుండవా బావా.. నువ్ మరీనీ..
ఏకాంబరం : నీకు సినిమావోళ్ళేం చేసినా గొప్పే..
కనకాంబరం : ఆళ్ళేం చేసినా నీకు లోకువే.. జనాల్ని పేమించరా బాబూ..
ఏకాంబరం : సరే కానీ.. మరీ చిరంజీవీ విజయశాంతి ఇన్ని రోజులూ కలుసుకోకుండా ఫోనుల్లో కూడా మాట్లాడకోకుండా ఉన్నారంటావా..
కనకాంబరం : డైరెట్రు చూసినపుడు ఆ.ఆనందం వేరు కదా బావా.. అయినా మా బాసింకాసేపు మాట్లాడుండాల్సింది.
ఏకాంబరం : మిగతా జనాన్ని కూడా మాట్లాడనిచ్చి ఉండాల్సింది..చిరంజీవీ విజయశాంతి గెట్‌గెదర్ కోసం.. సరిలేరు నీకెవ్వరూ సినిమా తీసినట్టుంది ఈ దిల్రాజు.
కనకాంబరం : దిల్రాజు తెలివైనోడు బావో.. చిరంజీవిని తెచ్చి సినిమాకి బజ్జెలా తెచ్చాడో.. వ్యాపార కిటుకులివి. చూసావా?
ఏకాంబరం : హా చూసా… మొన్న ఇద్దరిలోకం ఒకటే కూడా చూసాలే.
కనకాంబరం : ఇపుడదెందుకుబా.. బొమ్మ చీదేసింది కదా…
ఏకాంబరం : అంటే.. అది కూడా చాలా ఏళ్ళకి తిరిగి కలుసుకునే ఫ్రెండ్స్ కధ కదా. దీనికేమైనా లింకుందేమో అని.
కనకాంబరం : నమస్కారం బావో.. ఎక్కడి నుండి ఎక్కడకి కలిపి ఏకుతావురా బాబూ..
ఏకాంబరం : ఏదేమైనా సుమ లాంటి యాంకర్‌నే పదిహేను నిమిషాల పాటు మాట్లాడనివ్వకుండా నుంచోపెట్టాడంటే.. చిరంజీవి సూపర్రా..
కనకాంబరం : మరేమనుకున్నావ్ బాసంటే గౌరవం. ఆళ్ళేం మాట్లాడుకున్నారు, అలా మాట్లాడేంటీ, అయ్యేం మాటలూ లాంటియి పక్కనెట్టి రైస్మిల్లు రాజుగారికి చెప్పి సినిమాకి టికెట్లు తెప్పించెహే…
ఏకాంబరం : అలాగే.. ఇంతకీ ఇది మహేష్‌బాబు సినిమాయే కదా..
కనకాంబరం : నువ్వు మారవురా…
🎶🎶సండే అననురా మండే అననురా.. అస్సలు మారనురా….🎶🎶🎶