iDreamPost
iDreamPost
ఈనాడు అంటే శ్రీధర్, శ్రీధర్ అంటే ఈనాడు అన్నట్టుగా సాగింది. నలభై ఏళ్ల పాటు తిరుగులేని అనుబంధంలా కనిపించింది. ఈనాడు కార్టూన్లతో ఊరూవాడా శ్రీధర్ పేరు మారుమ్రోగింది. కానీ హఠాత్తుగా మొన్నటి ఆగష్టులో ఆ బంధం చెదిరింది. రామోజీరావు- శ్రీధర్ మధ్య ఏం జరిగిందో ఏమో గానీ వారి మైత్రీ చెదిరింది. చెరో దారి పట్టారు.. ఈనాడు ప్రస్తుతం ఇదీ సంగతి అనే కార్టూన్ శీర్షిక ఎత్తేసింది. ఆ స్థానంలో కొత్త కార్టూనిస్టులతో ప్రయోగాలు చేస్తోంది. ఆశించిన స్పందన లేకపోవడంతో ఆచితూచి వ్యవహరిస్తోంది.
అదే సమయంలో శ్రీధర్ కూడా 40 ఏళ్లుగా ఈనాడు ఆఫీసులు, రామోజీరావు చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత ప్రస్తుతం భిన్నమైన మార్గాల్లో పయనించాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగా తొలుత యూట్యూబ్ చానెల్ లో వ్యాఖ్యానం ప్రారంభించారు. వర్తమాన అంశాలపై తన విశ్లేషణలను అందించపూనుకున్నారు. పూర్తిగా కొత్తమార్గం కావడంతో ఆయన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. నాలుగైదు భాగాలుగా ఆయన చేసిన ప్రయోగం ఆకట్టుకోలేదు. దాంతో ఆయన తనకు తెలిసిన విద్యనే నమ్ముకోవాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.
Also Read : ఈనాడుతో శ్రీధర్ అనుబంధం ముగిసింది..
శ్రీధర్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్ ని ప్రారంభిస్తున్నారు.
హైదరాబాద్ లోని ప్రగతినగర్ నుంచి నిర్వహించబోతున్నారు. 12 ఏళ్ల పైబడిన వారందరికీ ప్రవేశం కల్పిస్తామని చెబుతున్నారు. చిత్రలేఖనంలో తీర్చిదిద్దుతామంటున్నారు. కార్టూన్ల చిత్రీకరణలో సిద్ధహస్తుడైన శ్రీధర్ శిక్షణలో కొత్తగా కళాకారులను తయారుచేసేందుకు పూనుకుంటున్నారు. దాంతో ఇది అందరినీ ఆకర్షిస్తోంది. విశేష నైపుణ్యం కలిగిన శ్రీధర్ కొత్త కార్టూనిస్టులను తయారు చేసేందుకు సమాయత్తం కావడం ఆసక్తికరంగా మారింది. కొత్తతరంలో కార్టూనిస్టుల కొరత మాత్రమై కాకుండా నైపుణ్య లోపం కొట్టిచ్చినట్టు కనిపిస్తున్న నేపథ్యంలో శ్రీధర్ ప్రయత్నం ఆశాజనకం అనే అభిప్రాయం వినిపిస్తోంది.
శ్రీధర్ వయసు, ఇతర కారణాల రీత్యా ఈ ఇనిస్టిట్యూట్ నిర్వహణ ఏమేరకు ముందుకు సాగుతుందోననే సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. కానీ పట్టుదలతో ఏదయినా సాధించేందుకు తీవ్రంగా శ్రమించే లక్షణాలున్న శ్రీధర్ కొత్త అడుగులు ఖచ్చితంగా విజయవంతం అవుతాయని ఆయన సన్నిహితుల అభిప్రాయం. ఏమయినా తెలుగు లోగిళ్లలో నవ్వులు పూయించిన శ్రీధర్ కొత్తగా మరింత మందిని తీర్చిదిద్దాలనే ప్రయత్నానికి పూనుకోవడం చర్చనీయాంశం అవుతోంది. యువత నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Also Read : కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా చేసేలా ఈనాడు యాజమాన్యం ప్రవర్తించిందా?