iDreamPost
android-app
ios-app

Eenadu -రెండు ఎడిషన్లు మూసివేసే దిశలో ఈనాడు

  • Published Nov 23, 2021 | 1:35 PM Updated Updated Mar 11, 2022 | 10:34 PM
Eenadu -రెండు ఎడిషన్లు మూసివేసే దిశలో ఈనాడు

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ప్రభావం ఇంకా అనేక రంగాలపై కొనసాగుతోంది. అందులో మీడియా ఒకటి. ప్రధానంగా ప్రింట్ మీడియాకు ఈ తాకిడి తీవ్రంగానే ఉంది. కోవిడ్ కారణంగా పత్రికల సర్క్యులేషన్ సమస్యలు, రెవెన్యూ సమస్యలు చాలా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అనేక మంది రూటు మారుస్తున్నారు. డిజిటల్ దారులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే వివిధ మీడియా సంస్థలతో పాటుగా తెలుగులో పెద్ద పెద్ద మీడియా గ్రూపులు కూడా తమ ప్రింట్ ఎడిషన్ల కొనసాగింపుపై మల్లగుల్లాలు పడుతున్నాయి. క్రమంగా ప్రింట్ ఎడిషన్లు మూతవేసే దిశలో సాగుతున్నాయి. ఇప్పటికే ఈనాడు దానికి అనుగుణంగా సంకేతాలు ఇచ్చేసింది.

ఈనాడు ఏపీ, తెలంగాణాతో పాటుగా చెన్నై బెంగళూరు, ముంబై, ఢిల్లీ కేంద్రాలుగా ఎడిషన్లు నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లోని తెలుగువారికి సమగ్ర సమాచారం అందించే ఉద్దేశంతో 1980లోనే ఈ ఎడిషన్లు ప్రారంభించింది. అప్పటి నుంచి వాటిని కొనసాగిస్తోంది. అయితే తాజాగా ముంబై, చెన్నై ఎడిషన్లకు సంబంధించి ఏబీసీ సర్టిఫికెట్ రద్దు చేసుకుంది. పత్రికల సర్క్యులేషన్ కి కొలబద్ధగా భావించే ఏబీసీ సర్టిఫికెట్ వదులుకోవడం ద్వారా ఇకపై ఆ రెండు ఎడిషన్లు కొనసాగించే ఉద్దేశంలో లేమన్నట్టుగా ఉషోదయ పబ్లికేషన్స్ చాటిచెప్పిందనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే రెండు ఎడిషన్లు మూతవేసే దిశలో ఉందని భావిస్తున్నారు.

వాస్తవానికి కోవిడ్ సమయంలో పత్రికల సర్క్యులేషన్ కి అనేక చిక్కులు ఏర్పడ్డాయి. పత్రిక పంపిణీ కష్టంగా మారింది. దాంతో ఆయా పత్రికల సర్య్కులేషన్ అంచనాలు వేసే ఏబీసీ ఈసారి తమ డేటా సేకరణ కూడా నిలిపివేసింది. 2021 ద్వితీయార్థంలో మాత్రమే ప్రకటిస్తామని వెల్లడించింది. దానికి ప్రధాన కారణం కోవిడ్ సెకండ్ వేవ్ లో కూడా పత్రికల ముద్రణ, పంపిణీ కష్టాలను గమనంలో ఉంచుకుని వాటిని పరిగణలోకి తీసుకోకూడదని భావించడమే. అయితే ఒకప్పుడు ఏబీసీ సర్టిఫికెట్ లో పెద్ద సంఖ్యలో పత్రికలు పంపిణీ అవుతున్నట్టు చూపించుకోవడానికి వివిధ ప్రింట్ మీడియా సంస్థలు చాలా ప్రయత్నాలు చేసేవి.

ఇప్పుడు మాత్రం అలాంటి ఆలోచన విరమించుకుంటున్నట్టు స్పష్టంగా చెప్పవచ్చు. పూర్తిగా డిజిటల్ రంగం మీద కేంద్రీకరించడం ద్వారా పత్రికల ముద్రణకు ప్రాధాన్యత ఇచ్చే ఆలోచన తమకు లేదని ఇప్పటికే మీడియా సంస్థల యాజమాన్యాలు చాటిచెబుతున్నాయి. చివరకు ఏబీసీలో తమ లెక్కలు తగ్గినా ఫర్వాలేదు గానీ పోటీ పడి అదనంగా ముద్రించే ఆనవాయితీకి ఇక ఫుల్ స్టాప్ పెట్టేసినట్టేనని చెబుతున్నాయి. దాంతో డిజిటల్ మీడియాలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవడంలో ఉన్న శ్రద్ధ ఏబీసీ సర్టిఫికెట్లు, ఎడిషన్ల కొనసాగింపు మీద లేదని తేలుతోంది. త్వరలో మరిన్ని ఎడిషన్లకు ఈనాడు ముగింపు పలికే దిశలో ఇది తొలి అడుగు అని అంతా భావిస్తున్నారు. ఈనాడు మొదటి అడుగు వేస్తే మరింత మంది అనుసరించే అవకాశం కూడా ఉందనడంలో సందేహం లేదు.