Idream media
Idream media
ఈ సృష్టిలో ఎక్కడో జరిగే ఏదో ఒక సంఘటన మరెక్కడో జరిగే సంఘటనతో ముడిపడి ఉంటుంది అనేది ఓ సినిమాలో డైలాగ్. ఈ డైలాగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయదల్చుకున్న మూడు రాజధానులు, వాటిని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న ఓ వర్గం మీడియాకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించినప్పటి నుంచీ అడ్డుకునేందుకు ఎల్లో మీడియాగా పిలవబడే మీడియా సంస్థలు సముద్రతీర నగరంపై విషం చిమ్ముతున్నాయి. అందు కోసం ఈ సృష్టిలో ఎక్కడ ఏది జరిగినా విశాఖకు ఆపాదిస్తూ కథనాలు వండి వారుస్తున్నాయి.
తాజాగా లెబనాన్ రాజధాని బీరుట్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. 100 మందికిపైగా చనిపోయారు. 5 వేల మంది గాయపడ్డారు. భవనాలు ధ్వంసమయ్యాయి. దీనికి కారణం… పోర్టు ఏరియాలో నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్ పేలడమే కారణమని ప్రాథమికంగా నిర్థారించారు. 2,750 టన్నుల అయ్మోనియం నైట్రేట్ ప్రమాదవశాత్తూ పేలడంతో లెబనాన్ రాజధాని బీరుట్ ధ్వంసమైంది. ఈ విషయం మొదటిపేజీలో ప్రచురించిన ఈనాడు పత్రిక లోపలి పేజీలో ఓ ప్రత్యేక కథనాన్ని రాసుకొచ్చింది. ‘అమ్మో’నియం నైట్రైట్ అంటూ శీర్షికలోనే దాని వల్ల ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పింది. అది ఎలా తయారు చేస్తారు..? ఎందుకు ఉపయోగిస్తారు..? ఏ సందర్భాల్లో పేలుతుంది..? అనే వివరాలు ఆ కథనంలో ప్రస్తావిచిన ఈనాడు.. మన దేశంలో దాని పరిస్థితి ఏమిటో చెప్పుకొచ్చింది. దేశంలో ప్రతి ఏడాది 2 నుంచి 2.5 లక్షల టన్నుల అమ్మోనియం నైట్రేట్ దిగుమతి అవుతోందని చెబుతూ.. ఆ మొత్తం విశాఖ పోర్టుకే వస్తోందంటూ అసలు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పింది.
2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలితేనే బీరుట్ పరిస్థితి ఇలా తయారైంది.. మరి ప్రతి ఏడాది రెండున్న లక్షల టన్నులు విశాఖకు వస్తోంది. ఇతర పోర్టులు రక్షణ నిమిత్తం నిషేధించాయి. ప్రస్తుతం విశాఖకే వస్తోంది. ఇలాంటి విశాఖపట్నం పరిస్థితి ఏమిటి..? ప్రమాదం అంచున విశాఖ నిలుచున్నది.. అనే విషయం పరోక్షంగా చెప్పేందుకు బీరుట్ ప్రమాదాన్ని ఈనాడు ఆ విధంగా ఉపయోగించుకుంది. ఇదే కాదు.. గతంలో ఎక్కడ తుఫానులు వచ్చినా.. విశాఖకు ముడిపెట్టి రాసింది. హుద్‌హుద్ తుఫానును ఉదహరించింది. సముద్రంలో పెద్ద చీలిక ఏర్పడిందని, దాని ప్రభావం వల్ల భవిష్యత్‌లో విశాఖపై సునామీలు విరుచుకుపడతాయంటూ కూడా రాసుకొచ్చింది.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఈ విషయాలన్నీ విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేసినప్పటి నుంచే ఈనాడు పత్రికకు గుర్తుకు రావడం. విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా అయితే ఈ ప్రమాదాలన్నీ పొంచి ఉన్నాయని చెబుతున్న ఈనాడు పత్రిక.. తన మొదటి పత్రిక యూనిట్‌ను విశాఖలోనే ఎందుకు ప్రారంభించిందన్న సందేహం సామాన్యులకు కలుగుతోంది. ఈ విషయాలన్నీ తెలియక అక్కడ పెట్టారనుకోవాలా..? అంటే ఇది సామాన్యులకు జవాబు దొరకని ప్రశ్న అవుతుంది.