iDreamPost
iDreamPost
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ఈనాడు దినపత్రిక కోవిడ్ సాకుతో ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విరమణ పధకం ప్రవేశపెట్టింది. కోవిడ్ కారణంగా ఆదాయం పడిపోయిందని, ఉద్యోగుల అవసరాలు కూడా తగ్గిపోయాయని ప్రాంతీయ భాషా పత్రికలే కాదు, జాతీయస్థాయి పత్రికలు కూడా ఈ రెండేళ్ళలో ఉద్యోగుల్లో భారీ కోత విధించాయి.
కొన్ని పత్రికలు అనేకమంది జర్నలిస్టులను, జర్నలిస్టులు కాని ఇతర సిబ్బందిని నిర్ధాక్షిణ్యంగా తొలగించాయి. మరికొన్ని పత్రికలు జర్నలిస్టులు, జర్నలిస్టేతర సిబ్బంది జీతాల్లో ఒక మోస్తరు నుండి భారీస్థాయిలో కోత విధించాయి. కోవిడ్ తాకిడికి లాక్ డౌన్ విధించిన 2020 యేడాది నుండి అనేక సంస్థల్లాగే మీడియా సంస్థలు కూడా ఉద్యోగుల సంఖ్యలో, వారి జీతాల్లో కోత విధిస్తూనే ఉన్నాయి. మొదట్లో పరిస్థితి చక్కబడగానే జీతాలు పునరుద్ధరిస్తాం అని చెప్పిన మీడియా సంస్థలు 2021లో కూడా జీతాల్లో మరోమారు కోత విధించాయి. అలాగే ఇంకొన్ని సంస్థలు 2020లో కొంతమందిని ఉద్యోగాలనుండి తొలగించాయి. అలాగే 2021లో ఇంకొంతమందిని తొలగించాయి.
ఈనాడు, ఆంధ్ర జ్యోతి వంటి పత్రికలు ఉద్యోగుల సంఖ్యను కుదించే ప్రయత్నాలు 2020లో మొదలు పెట్టాయి. షిఫ్టుల వారీగా ఉద్యోగులను విధులకు పిలిచి వారు పనిచేసిన కాలానికి మాత్రమే జీతాలు చెల్లించాయి. ఇప్పుడు కోవిడ్ పరిస్థితి కాస్త మెరుగుపడినా ఏ మీడియా సంస్థ కూడా జర్నలిస్టులను కానీ, జర్నలిస్టేతరులను కానీ తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. అలాగే తగ్గించిన జీతాలు పెంచే ఆలోచన చేయడం లేదు.
Also Read: ముఖ్యమంత్రులతో జాతీయ పార్టీల బంతులాట
ఇప్పుడు తాజాగా ఈనాడు ఉద్యోగులకు స్వచ్చంద పదవీవిరమణ పధకం తెరపైకి తెచ్చింది. వాస్తవానికి దక్షిణాదిన విశేష ప్రజాధారణ పొందిన “ది హిందూ” పత్రిక ఈ స్వచ్చంద పదవీవిరమణ పధకం గత కొన్నేళ్ళనుండి అమలుచేస్తూనే ఉంది. అలాగే హైదరాబాద్ నగరంలో గుత్తాధిపత్యం కొనసాగిస్తున్న “డెక్కన్ క్రానికల్” పత్రిక కూడా ఈ స్వచ్చంద పదవీవిరమణ పధకం కొంతకాలం క్రితం అమలుచేసింది. ఈ పత్రిక యాజమాన్యంలోని “ఆంధ్ర భూమి” తెలుగు దినపత్రికను పూర్తిగా మూసివేసి జర్నలిస్టులు, జర్నలిస్టేతరులను ఇప్పటికే ఇంటికి పంపించారు. “డెక్కన్ క్రానికల్” పత్రికలో కూడా అనేకమందిని ఇంటిదారి పట్టించే ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని మీడియా సంస్థల తీరు ఒక ఎత్తైతే ఈనాడు తీరు విభిన్నం. ఈనాడు యాజమాన్యం ఎప్పుడూ ఉద్యోగులను మంచిగా చూసుకున్నది లేదు. 1980 దశకంలో మొదటిసారి జర్నలిస్టులకు వేజ్ బోర్డు జీతాలు వచ్చినప్పుడు రామోజీరావు జోక్యం చేసుకుని “మాకు వేజ్ బోర్డు జీతాలు అక్కర్లేదు” అని రాయించుకున్నారు. ఆ తర్వాత జర్నలిస్టులతో సహా ఈనాడు ఉద్యోగులను “న్యూస్ టుడే” అనే వార్తా సంస్థ పేరుతోనో, ప్రియా పచ్చళ్ళ సంస్థ పేరుతోనో, మార్గదర్శి పేరుతోనో, ఉషాకిరణ్ మూవీస్ పేరుతోనో ఇంకా అనేక రకాల మీడియాయేతర సంస్థల్లో ఉద్యోగులుగా మార్చి వేజ్ బోర్డు జీతాలు అమలు చేయకుండా అటు కార్మిక శాఖను, ఇటు ఉద్యోగులను మభ్యపెట్టి ఇన్నేళ్ళు చాకిరీ చేయించుకున్నారు.
Also Read:మురారీ సినిమా షూటింగ్ జరిపిన రామచంద్రాపురం రాజుగారి కోట గురించి తెలుసా..?
ఈనాడులో ఉద్యోగులకు, ప్రత్యేకించి జర్నలిస్టులకు జీతాలు పెరిగింది కేవలం “సాక్షి” పత్రిక రంగప్రవేశం చేసినప్పుడు మాత్రమే. ఈనాడులో జర్నలిస్టులు కానీ లేదా తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు జర్నలిస్టులకు జీతాలు పెరిగింది సాక్షివల్లే అని చెప్పక తప్పదు. సాక్షి పత్రికకు ముందు తెలుగు జర్నలిస్టుల జీతాలు యాభైవేలు దాటిన పరిస్థితి లేదు. ఈనాడు చేసిన అంతకు మించిన ద్రోహం ఏమంటే జర్నలిస్టులకు జీతాలు కాకుండా వాళ్ళు రాసిన వార్తలను స్కేలుతో కొలిచి కూలీ చెల్లించే పద్దతి తెచ్చింది కూడా రామోజీరావు.
ఇప్పుడు కోవిడ్ సాకుతో మొత్తం ఉద్యోగులను సగానికిపైగా తగ్గించేందుకు రామోజీరావు రంగం సిద్ధం చేశారు. అందుకోసమే ఈ నెల మొదటివారంలో స్వచ్చంద పదవీవిరమణ పధకం ప్రవేశపెట్టారు. ఈ దెబ్బతో చాలా మందికి తృణమో, ఫలమో చేతిలో పెట్టి ఇంటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్వచ్చంద పదవీవిరమణ నోటీసు ఇప్పుడు ఈనాడు కార్యాలయంలో వేలాడుతోంది. ఈ నెల 23నాటికి రామోజీరావు విధించిన గడువు పూర్తిఅవుతుంది. ఈ గడువులోగా స్వచ్చంద పదవీవిరమణకు ఉద్యోగులు అంగీకార పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read: వైఎస్సార్ రాజనీతిజ్ఞతకు ఈ సముద్రతీరం ఓ ఉదాహరణ
అయితే ఇప్పుడు ఆయన దృష్టి జర్నలిస్టుల కంటే జర్నలిస్టేతరులపై ఉందని తెలుస్తోంది. పత్రికా కార్యాలయంలో జర్నలిస్టేతరులు అంటే ప్రింటింగ్ సెక్షన్, మార్కెటింగ్ సెక్షన్, అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ ఉంటాయి. వీటిలో మార్కెటింగ్ విభాగంలో పనిచేసే వారు పత్రిక సర్క్యులేషన్ వ్యహారాలు చూస్తూ సర్క్యులేషన్ పెంచుతూ, పత్రిక ఏజెంట్ల నుండి డబ్బులు వసూలు చేస్తూ సంస్థకు ఆదాయం సమకూర్చుతుంటారు. అలాగే అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ లో పనిచేసే సిబ్బంది పత్రికకు వ్యాపార ప్రకటనలు సేకరిస్తూ ఆదాయం తెస్తూ ఉంటారు. ఇక మిగిలిన ప్రింటింగ్ విభాగంలోని సిబ్బంది పత్రిక సకాలంలో ప్రింటు అయ్యే బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ మొత్తం విభాగాల్లోని సిబ్బందిలో సగానికిపైగా వదిలించుకోవాలని రామోజీరావు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఇప్పటివరకూ ఉన్న సమాచారం మేరకు ఓ డజను మంది ఉద్యోగులు ఈ స్వచ్చంద పదవీవిరమణ పధకం పట్ల ఆసక్తి చూపారని, మిగతావారెవరూ అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు రోడ్డుమీదకు వస్తే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. పదవీవిరమణకు రెండు మూడేళ్ళ సమయం ఉన్న కొద్దిమంది మాత్రమే రామోజీరావు తెరపైకి తెచ్చిన స్వచ్చంద పదవీవిరమణ పధకం పట్ల ఆసక్తి చూపుతున్నారని, మిగతావారు ఇందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. తమ జీవితకాలంలో ఇన్నేళ్ళు రామోజీరావుకు గాడిద చాకిరీ చేసి ఇప్పుడు కోవిడ్ పేరుతో బయటకు తరిమేస్తే మిగతా కాలం తాము ఎలా జీవించాలి అని ప్రశ్నిస్తున్నారు.
Also Read:పంజాబ్ కొత్త సీఎం ఎవరు?
ఈ సమస్యను రామోజీరావు ఎలా పరిష్కరిస్తారో చూడాల్సిందే అని మీడియా రంగంలోని కొన్ని వేలజతల కళ్ళు ఈనాడు కార్యాలయంవైపు చూస్తున్నాయి. ఏ ఉద్యోగులతో అయితే ఇన్నేళ్ళు గొడ్డు చాకిరీ చేయించుకుని లాభాలు గడించి కోట్లకు పడగలెత్తారో అదే ఉద్యోగులను కోవిడ్ నష్టాల పేరుతో రోడ్డునపడేసే ఆలోచనలు చేయడం రామోజీరావుకు కొత్తేమీ కాదు. ఇప్పుడు ఈ ఉద్యోగులు కూడా మినహాయింపేమీ కాబోరు. ప్రభుత్వాలనే శాసించి తన చెప్పు చేతల్లో పెట్టుకున్న రామోజీరావు ఇప్పుడు ఈ స్వచ్చంద పదవీవిరమణ పధకాన్ని అమలుచేయడంలో వెనుకాడబోరని, బలవంతపు స్వచ్చంద పదవీ విరమణలు ఈనాడులో మరో నెలా, రెండు నెలల్లో చూడబోతున్నామని జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు.