మాటలకందని ఆవేదన. గుండెలు పగిలే దుర్మార్గం. వర్ణణకు అందని పైశాచికత్వం. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషిలో నానాటికి మానవత్వం అంతరిస్తూ రాక్షసత్యం పెరుగుతుందనేందుకు నిలువెత్తు నిదర్శనం. మానవ సమాజ మొత్తాన్ని సిగ్గుతో తలవంచుకునేలా కొందరు క్రూర మృగాళ్లు ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడటంతో పాటు హత్యకు పాల్పడ్డ హృదయ విధారక దుర్ఘటన. జన్మనిచ్చిన తల్లిదండ్రులకే కాకుండా ప్రతి హృదయాన్ని కదిలించే, కన్నీటి వర్షాన్ని కురిపించే వర్షిణి జీవితాన్ని మొగ్గదశలోనే చిదిమేసిన పైశాచికత్వం. ఈ కన్నీటికి ఏ పేరు పెడుదాం.
అంత వరకూ ఆడుతూ పాడుతూ తల్లిదండ్రులు, అక్కలు, బంధుమిత్రాదులతో గడిపిన ఆరేళ్ల చిన్నారి వర్షిణి…ఇక జీవితంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతుందని ఎవరూ ఊహించలేదు. అసలా చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడాలనే తలంపు మనుషన్న వారెవరికైనా ఎలా వస్తుందనేదే అంతుచిక్కని ప్రశ్న. ఆ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడటమే కాకుండా కర్కశంగా ప్రాణాలు కూడా తీశారా దుర్మార్గులు.
చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గట్టు పంచాయతీలోని గుట్టపాళ్యేనికి చెందిన సిద్ధారెడ్డి, ఉషారాణి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. చిన్న కూతురు వర్షిణి. కురబలకోట మండలం అంగళ్లులోని ఓ కల్యాణ మండలంలో దగ్గరి బంధువుల పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్లారు. రాత్రి 9.30 గంటలకు భోజనం చేశారు.
అనంతరం సొంతూరికి వెళ్లేందుకు చిన్న కూతురితో కలసి తండ్రి సిద్ధారెడ్డి కల్యాణ మండపం మొదటి అంతస్తు నుంచి కిందికి వచ్చాడు. ఎంత సేపటికీ మిగిలిన కుటుంబ సభ్యులు రాకపోవడంతో చిన్న కూతురిని కిందనే నిలిపి అతను పైకి వచ్చాడు. తర్వాత కిందికి వచ్చేసరికి కూతురు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.
చుట్టూ పక్కలా వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వారు ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అప్రమత్తమై అన్నిచోట్ల వెతికారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు కల్యాణ మండపం వెనక వైపు పాప శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రల గుండెలు పగిలినంత పనైంది. వారి శోకానికి అంతులేదు. చిన్నారి మృతదేహాన్ని చూసిన ప్రతి ఒక్క హృదయం కన్నీటిపర్యంతమైంది.
పాపకు మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. పాప ఒంటిపై గాయాలుండటంతో అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.