iDreamPost
android-app
ios-app

మహిళ ఇంట్లో నోట్ల కట్టలు.. ఏకంగా మంత్రినే అరెస్టు చేసిన ఈడీ

మహిళ ఇంట్లో నోట్ల కట్టలు..  ఏకంగా మంత్రినే అరెస్టు చేసిన ఈడీ

పశ్చిమ బంగాలో ఈడీ జరిపిన దాడులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు కారణం ఆ రాష్ట్ర మంత్రికి సంబంధించిన ఓ మహిళ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడటమే. అసలు ఆ మహిళ ఎవరు? రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రిగా మంత్రి పార్థా ఛటర్జీతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి??

బంగా ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో ప్రైమరీ ఎడ్యుకేషన్‌ బోర్డులో అవకతవకలు, నేరాలు జరిగినట్లుగా అనుమానిస్తున్నారు ఈడీ అధికారులు. అందుకోసం మంత్రి పార్థాకు‌ ఆప్తురాలైన అర్పిత ముఖర్జీ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో సుమారు 20 కోట్ల విలువైన నగదు బయటపడటంతో దుమారు రేగుతోంది. ఆ దొరికిన డబ్బు సదరు కుంభకోణానికి సంబంధించినదిగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తం 500, 2వేల నోట్ల కట్టలే దొరకడం ఆశ్చర్యంగా ఉంది. నగదుతో పాటు ఇరవైకి పైగా మొబైల్‌ ఫోన్లు సైతం స్వాధీనం చేసుకున్నారు. అటు అర్పితతో పాటుగా ఎమ్మెల్యే మాణిక్‌ భట్టాచార్య, విద్యాశాఖ మంత్రి పరేష్‌ అధికారే వంటి ఇతర నేతల ఇళ్ళలోనూ ఈడీ దాడులుచేసింది.

అర్పిత ముఖర్జీ చాలామందికి ఒక నటిగా పరిచయం. బెంగాలీ, ఒడియా, తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లోనూ ఆమె నటించారు. పార్థా నిర్వహిస్తున్న దుర్గా పూజల కమిటీకి ఆమె ప్రచారకర్తగా కూడా వ్యవహరించారు. ఈ కారణంగా మంత్రి పార్థా ఛటర్జీకి అర్పిత చాలా దగ్గరి మనిషిగా చెప్తున్నారు ఈడీ అధికారులు.

పార్థా ఛటర్జీపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. టీచర్ల నియామక కమిషన్ లో ఆయన అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపైనే ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా అర్పిత ఇంట్లో 20కోట్ల నగదు దొరకడంతో మంత్రి పార్థాను అరెస్టు చేసింది ఈడీ. ఆయన నివాసంలోనే దాదాపు 23 గంటల పాటు ప్రశ్నించగా, ఆయన సహకరించకపోవడం వల్లే అరెస్టు చేసినట్లుగా ఈడీ పేర్కోంది. ప్రస్తుతం అర్పిత కూడా ఈడీ అదుపులో ఉన్నారు.